Womens Safety NCRB Data: మహిళా భద్రతే నాగరికతకు నిదర్శనం
ABN, Publish Date - Nov 25 , 2025 | 01:03 AM
ఒక దేశం, రాష్ట్రం, సమాజం ఎంత అభివృద్ధి సాధించిందో తెలుసుకోవాలంటే ఆకాశాన్ని తాకే భవనాలు, విలాసవంతమైన వాహనాలు, ఆధునిక సాంకేతికత వీటిని చూసి అంచనా వేయటం కాదు; అక్కడి మహిళలు ఎంత భద్రంగా, గౌరవంగా, స్వేచ్ఛతో..
ఒక దేశం, రాష్ట్రం, సమాజం ఎంత అభివృద్ధి సాధించిందో తెలుసుకోవాలంటే ఆకాశాన్ని తాకే భవనాలు, విలాసవంతమైన వాహనాలు, ఆధునిక సాంకేతికత వీటిని చూసి అంచనా వేయటం కాదు; అక్కడి మహిళలు ఎంత భద్రంగా, గౌరవంగా, స్వేచ్ఛతో జీవిస్తున్నారో చూస్తే సరిగ్గా తెలుస్తుంది. మహిళలు భయం అనే భారాన్ని మోయకుండా, తమ హక్కులతో, తలెత్తుకొని నడిచే పరిస్థితి ఉన్నప్పుడే ఆ సమాజం నిజమైన పురోగమనాన్ని సాధించినట్టు భావించాలి. ఆడపిల్లలు రోడ్లపై అభద్రతాభావం లేకుండా నడవగలిగితే; వారు విద్యలో, ఉపాధిలో, స్వతంత్ర ఆలోచనలో ఏ అడ్డంకీ లేకుండా రాణించగలిగితే, వారిపై హింస, వివక్ష, అవమానాలు లేని వాతావరణం ఏర్పడితే అదే అసలైన నాగరికత. మహిళను గౌరవించే చోట విలువలు నిలుస్తాయి, న్యాయం బతుకుతుంది, మానవత్వం వికసిస్తుంది. అందుకే మహిళకు రక్షణ, గౌరవం, స్వేచ్ఛ కలిగిన సమాజమే నిజమైన అభివృద్ధికి ప్రతిబింబం.
నవంబర్ 25వ తేదీని మహిళలపై హింస నిర్మూలన దినంగా ప్రపంచం గుర్తించింది. మన సమాజం, మన వ్యవస్థ, మన ఆలోచనల్లో ఇంకా పరిష్కారం పొందాల్సిన అతిపెద్ద, అత్యంత బాధాకరమైన సమస్య స్త్రీలపై హింస. మనం సాంకేతికతలో ఎంత వేగంగా ముందుకెళ్లినా, శాస్త్రంలో ఎన్ని శిఖరాలు అధిరోహించినా, మహిళల భద్రత, గౌరవంపై ప్రశ్నలు నేటికీ జవాబు లేకుండానే మిగిలి ఉన్నాయి.
స్త్రీపై హింసను మనం కేవలం కంటికి కనిపించే శారీరక దాడిగా మాత్రమే చూడకూడదు. దాని పరిధి చాలా విస్తృతమైంది, ప్రమాదకరమైంది. అవమానించడం, మానసిక వేధింపులు, ఆర్థిక నియంత్రణ, వరకట్నం వేధింపులు, లైంగిక దాడులు, ట్రాఫికింగ్, ఆన్‌లైన్ హరాస్‌మెంట్, సైబర్ మోసం... ఇలాంటివి అన్నీ హింసకు రూపాలే. చట్టాలు మారాయి, సమాజం మారుతోందని మనం ధైర్యంగా చెప్పుకుంటున్నా, వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈ విషయంలో అంతర్జాతీయ గణాంకాలను పరిశీలిస్తే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒక మహిళ తన జీవితంలో ఏదో ఒక దశలో శారీరక, లైంగిక హింసను అనుభవించింది. ఈ భయంకరమైన విషయం సమాజ సామూహిక వైఫల్యాన్ని స్పష్టంగా సూచిస్తోంది.
భారతదేశం విషయానికి వస్తే, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB–2023) గణాంకాలు దేశంలో మహిళలపై నేరాల రేటు ఇంకా ఆందోళనకరంగానే ఉన్న వాస్తవాన్ని చూపిస్తున్నాయి. మరీ దురదృష్టకరం ఏమిటంటే, ఈ లెక్కలు కేవలం పోలీసు రికార్డులలో నమోదైన కేసులు మాత్రమే. వీటి వెనుక భయంతోనో, బైటికి తెలిస్తే కుటుంబ గౌరవం పోతుందనే భీతితోనో నిశ్శబ్దంగా మిగిలిపోయిన వేలాది కేసుల వాస్తవం ఉంది. మన రాష్ట్రంలో కూడా 2022లో 25,503 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య తరువాతి సంవత్సరంలో కొంత తగ్గినట్లు కనిపించినా, అది పరిస్థితి మెరుగైందన్న సూచనగా తీసుకోలేము; అది ఫిర్యాదు చేయడంపై మహిళలకున్న భయానికీ, వ్యవస్థపై తగ్గిన నమ్మకానికీ సంకేతమై ఉండొచ్చు.
మహిళలపై హింసకు అసలు కారణం మనుషుల ఆలోచనల్లోనే ఉన్నది. ఎందుకు ఆ సమయంలో బయటికి వెళ్లింది? ఎందుకు అలాంటి దుస్తులు వేసుకుంది? అనే ప్రశ్నలు అడిగి బాధితురాలిపైనే నింద వేసే ఈ విషపూరిత ఆలోచనా ధోరణి నేరస్థుడికి బలాన్ని ఇస్తోంది. ఈ ధోరణిని సమూలంగా పెకిలించడమే మన తక్షణ కర్తవ్యం. భారత రాజ్యాంగం మహిళలకు సంపూర్ణ సమాన హక్కులు ఇచ్చింది. గృహహింస నుండి సైబర్ క్రైమ్ వరకు అనేక కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. అయినా, న్యాయం ఆలస్యం అవుతూనే ఉంది. నేరం చేసినవాడు సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే, నేరం ఎదుర్కొన్న స్త్రీ మౌనంగా బ్రతకాల్సిన పరిస్థితి ఉన్నది.
ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ అత్యంత కీలకపాత్రను పోషిస్తోంది. ఇక్కడ ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి, చట్ట సహాయం అందిస్తూ, కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తున్నాం. విద్యాసంస్థలు, కార్యాలయాలలో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే, ఈ కృషికి ప్రభుత్వ సాయం కూడా అందడం మరింత బలాన్ని ఇస్తుంది. గత ఏడాదిన్నరగా ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి యాప్, సఖి నివాస్ కేంద్రాలు, మహిళలు–పిల్లల కోసం ప్రత్యేక రక్షణ వింగ్, శక్తి సదన్ వంటి సేవలను ప్రారంభించడంతో పాటు మహిళా కమిషన్‌తో కలిసి చట్ట అవగాహన, కౌన్సెలింగ్, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత బలోపేతం చేసింది. ఈ చర్యల ప్రభావంతో రాష్ట్రంలో మహిళలపై నేరాలు సుమారు 12శాతానికి తగ్గాయి. అత్యవసర స్పందన వేగవంతం అయ్యింది. అలాగే గత కొద్ది నెలల్లో 169 మంది నేరస్థులు శిక్షించబడ్డారు. ఇవన్నీ ప్రభుత్వ చర్యలు ఫలితాల దిశగా సాగుతున్నాయనటానికి సంకేతాలు. మహిళా భద్రత ర్యాంకింగ్స్‌లో విశాఖ దేశంలో అగ్రస్థానంలో నిలవడం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి అనడానికి మంచి ఉదాహరణ.
మహిళలపై హింసను అరికట్టాలంటే, ముందుగా మారాల్సింది చట్టాలు కాదు మనలోని కుటుంబ విలువలు, సామాజిక దృక్పథం. చిన్నప్పటి నుండే పిల్లలకు గౌరవం నేర్పాలి. పాఠశాలలో లింగ సమానత్వం పాఠ్యాంశంగా ఉండాలి. నేరానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయాలి, న్యాయవ్యవస్థ వేగవంతం కావాలి. ముఖ్యంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండే మహిళ మరింత ధైర్యంగా నిలబడగలదు. సైబర్ హింస పెరుగుతున్న ఈ యుగంలో, డిజిటల్ భద్రత బోధన ప్రతి మహిళకు, యువతికి అత్యవసరం.
స్త్రీ భద్రతని స్త్రీల సమస్యగా కాదు, సమాజం, ప్రభుత్వం, వ్యవస్థల ఉమ్మడి బాధ్యతగా గుర్తించే రోజు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రపంచం న్యాయానికి దగ్గరవుతుంది. ఈ దిశగా నవంబర్ 25 కేవలం ఒక సంప్రదాయం కాదు; ఇది సమాజానికి గట్టి హెచ్చరిక, ఒక బలమైన పిలుపు, ఒక మార్పుకు లభించిన మంచి అవకాశం. మహిళ ఆత్మవిశ్వాసంతో, భయంలేకుండా, గౌరవంగా జీవించగలిగినప్పుడు అది నాగరిక సమాజం తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్న విలువైన రుజువు.
శైలజ రాయపాటి
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
(నేడు మహిళలపై హింస నిర్మూలన దినం)
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ
ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 25 , 2025 | 01:03 AM