Share News

Siddaramaiah: ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 24 , 2025 | 03:39 PM

నాలుగైదు నెలల క్రితమే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అంగీకరించిందని, అయితే ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసేంత వరకూ ఆగాల్సిందిగా తాను సూచించానని సిద్ధరామయ్య చెప్పారు.

Siddaramaiah: ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Siddaramaiah

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు తెరపడటం లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు రెండు వర్గాలకు చెందిన నేతలు హస్తినను చుట్టేస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దీనిపై సిద్ధరామయ్య సోమవారంనాడు ఆచితూచి స్పందించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కోరుకుంటే తాను ఐదేళ్లూ సీఎంగా కొనసాగుతానని చెప్పారు. తుది నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వానిదేనని, అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తానూ, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సి ఉంటుందని చెప్పారు.


మంత్రివర్గ విస్తరణపై..

నాలుగైదు నెలల క్రితమే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం అంగీకరించిందని, అయితే ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసేంత వరకూ ఆగాల్సిందిగా తాను సూచించానని సిద్ధరామయ్య చెప్పారు. ఇప్పుడు హైకమాండ్ ఏమి చెప్పినా ఆ ప్రకారమే నడుచుకుంటామని అన్నారు. రెండున్నరేళ్లకు అధికార బదలాయింపుపై ఒప్పందం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని ముక్తసరిగా ఆయన సమాధానమిచ్చారు.


ఢిల్లీలో డీకే విధేయ ఎమ్మెల్యేలు

మరోవైపు, డీకే శివకుమార్‌కు విధేయులైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానం పెద్దలను కలుసుకునేందుకు ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఎమ్మెల్యేలు హెచ్‌సీ బాలకృష్ణ (మాగడీ), కేఎం ఉదయ్ (మద్దూరు), నయన మోటమ్మ (ముదిగేరి), ఇక్బాల్ హసన్ (రామనగర), శరత్ కుమార్ బచే గౌడ (హోసకోటే), శివగంగ బసవరాజ్ (చన్నగిరి)లు ఢిల్లీ వెళ్లిన టీమ్‌లో ఉన్నారు. మరొకొందరు డీకే అనుకూల ఎమ్మెల్యేలు కూడా హస్తినకు వెళ్లొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా, సీనియర్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన నుంచి తిరిగి రానున్నారు. గత వారంలోకూడా డీకే విధేయ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఖర్గేను కలిసారు. సిద్ధరామయ్య సైతం ఖర్గేతో బెంగళూరులో శనివారంనాడు సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయితే, మంత్రివర్గ విస్తరణను ముందుగా చేపట్టాలని సిద్ధరామయ్య కోరుతుండగా, నాయకత్వం అంశాన్ని ముందుగా తేల్చాలని డీకే శివకుమార్ కోరుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం

అధికారిక కారును వదిలి.. రాష్ట్రపతి భవన్ వీడిన మాజీ సీజేఐ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 24 , 2025 | 04:19 PM