మహిళల భద్రత సామాజిక బాధ్యత
ABN, Publish Date - Aug 12 , 2025 | 12:39 AM
రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం- కేవలం ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమం మాత్రమే కాదు యావత్ సమాజం కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అంశం. విద్య, ఉపాధి, భద్రత వంటి రంగాలలో మహిళలు సాధిస్తున్న...
రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమం- కేవలం ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమం మాత్రమే కాదు యావత్ సమాజం కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అంశం. విద్య, ఉపాధి, భద్రత వంటి రంగాలలో మహిళలు సాధిస్తున్న పురోగతికి తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం స్పష్టమవుతోంది.
మహిళల భద్రతపై ఒక వైపు ప్రభుత్వం, మరో వైపు మహిళా కమిషన్, మహిళా సంఘాలు అనేక చర్యలు తీసుకుంటున్నా.. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హింసాత్మక ఘటనలు, లైంగిక దాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసు వ్యవస్థను మరింత బాధ్యతతో, మహిళాభిముఖంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. సంస్కృతి, సంప్రదాయాలకు దిక్సూచిగా నిలిచే దేశంలో కూడా మహిళలకు ఆపదలు పెరిగిపోతున్న కాలంలో వారి భద్రత, రక్షణపై చైతన్యంతో కూడిన చర్చ అవసరం. స్త్రీ ఆత్మగౌరవంతో జీవించగల వాతావరణం ఎంత మేరకు ఉంది? రోడ్డుపై నడుస్తున్నా, వాహనాల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, పాఠశాలల్లో... ఇలా అక్కడ, ఇక్కడ అని లేకుండా మహిళలను క్రూరమృగాల్లా వేధిస్తుండటం సమాజాన్ని కళంకితం చేస్తోంది. ఆఖరికి ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి.
భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వం, హక్కులు కల్పించినా ఆ హక్కులను ఉపయోగించుకునే పరిస్థితి అందరికీ సమంగా లేదు. మహిళలందరికీ భద్రత, రక్షణ చట్టాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులు, సైబర్ స్టాకింగ్ వంటి నేరాలపై ఐపీసీ, 1860 ప్రకారం సెక్షన్ 354, సెక్షన్ 354ఏ–డీ, అత్యాచారానికి సంబంధించి సెక్షన్ 375, సెక్షన్ 376లు వర్తిస్తాయి. వివాహిత మహిళపై భర్త, కుటుంబసభ్యుల మానసిక, శారీరక వేధింపులకు సెక్షన్ 498ఏ వంటి చట్టాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా సెక్స్యువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్‌ప్లేస్ యాక్ట్ (POSH), 2013; మైనర్ బాలికలకు రక్షణగా పాక్సో యాక్ట్ (POCSO), 2012 వంటి చట్టాల గురించి బాలికలకు తెలియజేయాలి.
రాష్ట్రంలోని మహిళల హక్కులకు రక్షణ, భద్రత, సురక్షత, సాధికారత కోసం మహిళా కమిషన్ ఏర్పడింది. సివిల్ కోర్ట్‌కి సమానమైన అధికారాలు కమిషన్‌కు ఉన్నాయని CPC 1908 ప్రకారం సెక్షన్ 14 చెబుతుంది. సెక్షన్ 16(1) ప్రకారం బాధిత మహిళల నుంచి వచ్చిన న్యాయబద్ధమైన ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు కమిషన్ తీసుకుంటుంది. సెక్షన్ 16(3) ప్రకారం ఎవరైనా అభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తి కమిషన్ ముందు నిర్దేశించిన తేదీ నాడు విచారణకు హాజరు కాకపోతే, కమిషన్ ఆ విషయంపై విచారణ నిర్వహించి, అభియోగం నిరూపణ అయితే తగు చర్యకై ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు, లేదా ప్రాసిక్యూషన్‌ను కూడా ప్రారంభించవచ్చు. సెక్షన్ 21 ప్రకారం ప్రభుత్వం మహిళలకు సంబంధించిన అన్ని విధానపరమైన నిర్ణయాలను తీసుకునే ముందు కమిషన్‌ను సంప్రదించాలి. గృహ హింస, లైంగిక వేధింపులు వంటి అంశాలను కమిషన్ పరిశీలించి పరిష్కార చర్యలు సూచిస్తుంది. సోషల్ మీడియా, ప్రింట్/ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలిసిన ఘటనలను సుమోటాగా స్వీకరించి సంబంధిత శాఖలకు సూచనలు చేస్తుంది. యూనివర్సిటీలు/ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
మహిళా కమిషన్ బాధిత మహిళలకు అండగా నిలిచేందుకు అలుపెరగని కృషి చేస్తోంది. బాధిత మహిళలకు తోడుగా నిలిచేందుకు వన్ స్టాప్ సెంటర్లు, అత్యవసర పరిస్థితుల్లో 24/7 ఉచిత సేవలు అందించేందుకు మహిళా హెల్ప్‌లైన్ 181, శక్తి సదన్‌లు, శక్తి నివాస్ కేంద్రాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. అదే విధంగా ప్రభుత్వాసుపత్రుల్లో మహిళలు, గర్భిణిల వార్డులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి లోపాలను సరిచేస్తుంది. అధికారులతో సమీక్షలు నిర్వహించి సూచనలు చేస్తుంది.
కొద్ది రోజుల క్రితం ఒక జిల్లా జీజీహెచ్‌లో 50 మంది వైద్య విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన సిబ్బందిపై ఆ విద్యార్ధినులు ధైర్యంగా ముందుకు వచ్చి ఘటన వివరాలు చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎంతో మంది మహిళలకు ధైర్యాన్ని ఇస్తాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలను నిశితంగా పరిశీలిస్తే మోసగాళ్ల ఉచ్చులోపడి బాలికలు అన్యాయంగా బలైపోతున్నారు. చిన్నారి బాలికలు, చదువుకుంటున్న అమ్మాయిలు అనవసర సమస్యల్లో చిక్కుకొని తమ జీవితాలను చెడగొట్టుకుంటున్నారు. ప్రభుత్వం, సామాజిక సంస్థలు, ప్రజలు కలిసి బాలికల రక్షణకు చర్యలు తీసుకోవాలి.
బాలికలకు పాఠశాలలోనే తగిన లైంగిక విద్య, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, స్వీయరక్షణ విషయాలు నేర్పాలి. ఉద్యోగావకాశాలు, చట్టసభల్లో మహిళల ప్రాధాన్యతను పెంచాలి. మీడియా, పాఠశాలలు, సామాజిక సంస్థలు కూడా మహిళల చైతన్యాన్ని పెంచే దిశగా ముందుకు రావాలి. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లలపై నిరంతరం దృష్టి ఉంచాలి. ఏవైనా అసాధారణ ప్రవర్తనలు కనిపించినప్పుడు వాటిపై శ్రద్ధ వహించాలి.
మహిళా హక్కుల పరిరక్షణ, సమానత్వ సాధన, న్యాయ కల్పనలో మహిళా కమిషన్ పోషిస్తున్న పాత్ర అనన్య సామాన్యమైనది. ఇది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు సామాజిక మార్పుకు నిదర్శనంగా నిలుస్తున్న శక్తివంతమైన మాధ్యమం. అయితే, కమిషన్ పనితీరు మరింత సమర్థవంతంగా ఉండాలంటే ప్రభుత్వ సహకారం, న్యాయ వ్యవస్థ స్పందన, ప్రజల భాగస్వామ్యం అవసరం.
శైలజ రాయపాటి
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
ఈ వార్తలు కూడా చదవండి..
జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు
పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Aug 12 , 2025 | 12:39 AM