Telangana Governor Issue: రాష్ట్రం తెలిసిన గవర్నర్లు రావాలి
ABN, Publish Date - Nov 25 , 2025 | 12:53 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు దాటినా ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా తెలంగాణ వాస్తవ్యులు నియమితులు కాకపోవటం విచారకరం. చట్టసభల నిర్ణయాలకు అవరోధాలు ఏర్పడటానికి ఇదే ప్రధాన కారణం. బిల్లుల ఆమోదం...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు దాటినా ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా తెలంగాణ వాస్తవ్యులు నియమితులు కాకపోవటం విచారకరం. చట్టసభల నిర్ణయాలకు అవరోధాలు ఏర్పడటానికి ఇదే ప్రధాన కారణం. బిల్లుల ఆమోదం, అత్యవసర పరిస్థితులు, మంత్రివర్గ నియామకాల్లో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఈ పదవిని నిర్వహించేవారు రాష్ట్ర స్థానిక సందర్భాలపై అవగాహన ఉన్నవారై ఉండాలి.
బాహ్య ప్రాంతాల నుండి గవర్నర్లుగా వచ్చినవారికి ఇక్కడి సామాజిక వాస్తవాల పట్ల అవగాహన ఉండటం లేదు. తెలంగాణ ప్రాంత చరిత్ర గురించి – అంటే ఇక్కడి వలస పాలన, చేతి వృత్తులు, వ్యవసాయరంగం, ఫ్యూడల్ వ్యవస్థ, విద్యా వెనుకబాటు, కుల ఆధారిత వివక్ష... వీటి గురించి – బయటి నాయకులకు పూర్తిగా తెలియదు. తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతలు వారికి అర్థం కావు. ఈ అర్థం కాకపోవటం అనేది విధానాల పరిశీలనలో లోపాలకు దారితీస్తుంది. చట్టసభ నిర్ణయాలకు అనవసరమైన అడ్డంకులను సృష్టిస్తుంది.
2018లో టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) 42శాతం బీసీ బిల్‌ను గవర్నర్ తమిళిసై సుదీర్ఘంగా పెండింగులో పెట్టారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పంపగా, ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం ఇవ్వకుండా రాష్ట్రపతికి పంపారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో స్థానిక సంస్థల వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయి. ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్రలో స్థానిక నేపథ్యం గలవారు గవర్నర్లుగా ఉన్నప్పుడు ఇలాంటి బిల్లులు వేగంగా క్లియర్ అయ్యాయి.
ఉత్తర భారతదేశానికి చెందినవారు గవర్నర్లుగా వచ్చినప్పుడు వారు తెలుగు భాషలో అసెంబ్లీ ప్రసంగాలు చదవడానికి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. స్థానిక యాస తెలియని గవర్నర్‌కు తెలంగాణ గెజిట్ నోటిఫికేషన్లు, ప్రజా ఫిర్యాదులు అర్థమవుతాయా? గవర్నర్లు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రాంతీయ భావజాలాన్ని, సామాజిక కుల వ్యవస్థ లక్షణాలను అర్థం చేసుకోవడం అవసరం. వారు ఇవి అర్థం చేసుకుని చట్టసభ నిర్ణయాలకు గౌరవం ఇచ్చినప్పుడే రాజ్యాంగ వ్యవస్థ సాఫీగా నడుస్తుంది.
తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణకు చెందినవారే గవర్నర్లుగా వచ్చినప్పుడు– తెలంగాణ చరిత్ర, సమాజం, ఆర్థిక వెనుకబాటుతనం గురించి వారికి లోతైన అవగాహన ఉంటుంది. బీసీ ఉపకులాల మధ్య రిజర్వేషన్ పంపకం వంటి రాజకీయ సంక్లిష్టతలు వారికి అర్థమవుతాయి. బిల్లులు త్వరగా క్లియర్ అవుతాయి. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో అనవసరమైన ఘర్షణ తగ్గుతుంది. గవర్నర్‌లను నియమించేవారు ఏ పార్టీ అన్నది సమస్య కాదు. రాజ్యాంగం పట్ల, తెలంగాణ ప్రజల సమస్యల పట్ల, ఇక్కడి భాషా భావజాలం పట్ల అవగాహన ఉన్న విద్యావేత్త అయినా, ఉన్నత స్థాయి పరిపాలన అనుభవం ఉన్న సేవాధికారి ఐనా, లేదా తెలంగాణ సామాజిక ఉద్యమాల దార్శనిక నాయకుడు ఐనా... ఇలాంటివారి నుంచి గవర్నర్లు రావటం వల్ల ఈ పదవి పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుంది.
– పాపని నాగరాజు
ఇవి కూడా చదవండి..
అయోధ్యలో పర్యటించనున్న మోదీ.. రామాలయంపై పతాకావిష్కరణ
ఢిల్లీలో డీకే విధేయులు.. సీఎం మార్పుపై సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 25 , 2025 | 12:53 AM