ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Social Boycott Law: బహిష్కరణ వ్యతిరేక చట్టం కావాలి

ABN, Publish Date - Dec 18 , 2025 | 05:58 AM

భారతదేశంలో కులం ఒక సామాజిక అవశేషం కాదు. అది ఇప్పటికీ చురుకైన రాజకీయ ఆయుధం. గ్రామాల్లో కుల పంచాయతీల రూపంలో, పట్టణాల్లో కమ్యూనిటీ సంఘాల పేరుతో, రాజకీయాల్లో...

భారతదేశంలో కులం ఒక సామాజిక అవశేషం కాదు. అది ఇప్పటికీ చురుకైన రాజకీయ ఆయుధం. గ్రామాల్లో కుల పంచాయతీల రూపంలో, పట్టణాల్లో కమ్యూనిటీ సంఘాల పేరుతో, రాజకీయాల్లో ఓటు బ్యాంకులుగా కులం ఈ దేశ పౌరుల జీవితాలను నిత్యం నియంత్రిస్తోంది. ఈ నియంత్రణకు అత్యంత క్రూరమైన రూపం సామాజిక బహిష్కరణ. ఒక వ్యక్తిని లేదా కుటుంబాన్ని సమాజం నుంచి కాదు, జీవితం నుంచే వెలివేయడం. ఈ అణచివేతను నేరంగా ప్రకటిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన ‘కర్ణాటక సోషల్‌ బాయ్‌కాట్‌ (ప్రివెన్షన్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ రిడ్రస్సల్‌) బిల్లు–2026’ను ఆహ్వానించాల్సిందే!

సామాజిక బహిష్కరణ అంటే పెళ్లిళ్లకు రానీయకపోవడం, దేవాలయాల్లో అడుగు పెట్టనీయకపోవడం, నీళ్లు వాడనీయకపోవడం, చివరకు శ్మశానంలో శవాన్ని పాతిపెట్టనీయకపోవడం వరకూ విస్తరించిన క్రూరత్వం. ప్రేమ వివాహాలు, భూమి వివాదాలు, పంచాయతీ ఎన్నికల సందర్భాల్లో కుటుంబాలపై బహిష్కరణలు విధించిన ఘటనలు ఈ చట్టం ఎందుకు అవసరమో స్పష్టంగా చూపిస్తున్నాయి. కుల పంచాయతీలు, కమ్యూనిటీ పెద్దలు విధించే బహిష్కరణలు అక్రమమనీ, వాటికి పాల్పడితే మూడేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా విధిస్తామనీ ఈ బిల్లు చెబుతోంది. ప్రతి జిల్లాలో సోషల్ బాయ్‌కాట్ ప్రొహిబిషన్ ఆఫీసర్, పోలీసులకు కేసులు నమోదు చేసే అధికారం... ఇవన్నీ కాగితాల మీద ధైర్యమైన ఏర్పాట్లే. కానీ అసలు ప్రశ్న ఒక్కటే: ఈ చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ కులానికి అతీతమా? సామాజిక బహిష్కరణకు గురైన వ్యక్తి న్యాయం కోసం ముందుకు రావాలంటే, ముందుగా తన కులానికి, తర్వాత తన గ్రామానికి, చివరకు తన జీవనాధారాలకే ఎదురు నిలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి స్థితిలో బతుకే పణంగా పెట్టి పోలీస్ స్టేషన్ తలుపు తడితే అప్పుడు పోలీసులు ఎవరి వైపు నిలుస్తారు– బాధితుడి వైపా? లేక అదే కుల నాయకుడు, అదే ఎమ్మెల్యే, అదే మంత్రి వైపా? భారతదేశంలో చట్టాలు సమస్య కాదు. అమలు చేసే వ్యక్తుల నైతికతే అసలు సమస్య. అదే కుల పంచాయతీలకు రాజకీయ రక్షణ, అదే ఎన్నికల వేళ కుల నాయకులతో ఒప్పందాలు, అదే అధికారులకు బదిలీ భయం. ఈ వ్యవస్థ మారకపోతే ఈ చట్టం కూడా భయపెట్టే శీర్షికగా మాత్రమే మిగిలిపోతుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ వాస్తవాన్నీ తప్పక ప్రశ్నించాలి. దళితులు, బీసీలు, మహిళలపై దాడులు, కుల బహిష్కరణలు జరుగుతున్నప్పటికీ ఇక్కడి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఇవి కుల చేర్పులకు–తొలగింపులకు పరిమితమైపోయాయి తప్ప, కుల అణచివేతను ఎదుర్కొనే సంస్థలుగా వ్యవహరించడం లేదు. రాష్ట్రస్థాయి కులసంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా ఎస్సీ–ఎస్టీ కమిషన్‌కు, బీసీలపై దాడులు, కుల బహిష్కరణల నివారణకు బీసీ సామాజిక రక్షణ చట్టం అవసరమని బీసీ కమిషన్‌ వారికి కులనిర్మూలన వేదిక వినతిపత్రాలు సమర్పించింది. ఎస్సీ–ఎస్టీ కమిషన్‌, బీసీ కమిషన్‌ల సంయుక్త చర్చను కోరినప్పటికీ స్పందన లేకపోయింది.

కర్ణాటకలో సామాజిక బహిష్కరణ చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అదే ధైర్యం ఎందుకు చూపడం లేదు? ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సామాజిక రక్షణ చట్టం గురించి ప్రకటనలు వస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? సమాధానం స్పష్టం. కుల రాజకీయాలే అధికార పార్టీల ఓటు బ్యాంకులు. కుల వ్యవస్థను ప్రశ్నిస్తే రాజకీయంగా నష్టం వస్తుందనే భయం. అందుకే చట్టాలు వస్తాయే తప్ప అమలు ఉండదు. ప్రకటనలు ఉంటాయి, కానీ సంకల్పం ఉండదు. సామాజిక బహిష్కరణ చట్టం అమలైతే మాత్రం చరిత్ర సృష్టిస్తుంది. నిజానికి చట్టం కన్నా, కుల ఆధారిత రాజకీయాలకు వ్యతిరేక రాజకీయ సంకల్పమే అసలైన పరిష్కారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా సామాజిక బహిష్కరణను నేరంగా ప్రకటించే చట్టాలు తీసుకురావడం అవసరం.

పాపని నాగరాజు

Also Read:

జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి

ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?

Updated Date - Dec 18 , 2025 | 05:58 AM