Telangana Agriculture Scientists: మా శాస్త్రవేత్తలు ఏ పాపం చేశారు
ABN, Publish Date - Dec 30 , 2025 | 05:03 AM
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల కృషి వల్ల తెలంగాణ ‘విత్తన భాండాగారం’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ సోన తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక...
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల కృషి వల్ల తెలంగాణ ‘విత్తన భాండాగారం’గా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ సోన తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలలో దాదాపు 75లక్షల ఎకరాలలో సాగవుతోందని అంచనా. ఇవే కాకుండా చెరుకు, పత్తి, పశుగ్రాస రకాలతో పాటు రైతులకు ఉపయోగపడే వంగడాలు, పలు పంటలలో ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసింది. పంటలలో సూక్ష్మధాతు లోపనివారణ, భూసార పరీక్షల కిట్‌లు, వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ, జీవ నియంత్రణల ద్వారా పంటల తెగుళ్లు నివారణ, జీవ ఎరువుల ఉత్పత్తి, వ్యవసాయ యాంత్రీకరణ వంటి ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసింది.
పదేళ్లుగా విశ్వవిద్యాలయం అరకొర నిధులతో నెట్టుకొస్తోంది. వరి వంగడాలపై ప్రతి వరి విత్తన బస్తాకు ఒక రూపాయి రాయల్టీ ఇచ్చినట్లైతే వ్యవసాయవర్సిటీ దేశంలోనే అత్యంత సంపన్నంగా మారేది. రాయల్టీలకు, పేటెంట్లకు ఆశించని శాస్ర్తవేత్తలను ఇప్పుడు, ప్రభుత్వాలు ఆర్థికభారంగా పరిగణించటం బాధాకరం. గత జనవరిలో రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల బోధన సిబ్బందికి పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. అయితే ఆ జీవోను వ్యవసాయ, అనుబంధ వర్సిటీలకు వర్తింపజేయలేదు. ప్రత్యేక యూనివర్శిటీలైన కాళోజి ఆరోగ్యవిశ్వవిదాలయం, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాల్లో కూడా పదవీ విరమణ వయసు 65గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వ్యవసాయ పరిశోధనా సిబ్బందికి పదవీ విరమణ వయసు 62 ఏళ్లు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, యూనివర్సిటీలలోని బోధనేతర సిబ్బందికి పదవీ విరమణ వయసు 61 కాగా, శాస్త్రవేత్తలకు మాత్రం రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా 60గా ఉంది.
ప్రస్తుతం వ్యవసాయ యూనివర్సిటీ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది. 100 మందికి పైగా కాంట్రాక్టు బోధన సిబ్బందితో నడుపుతున్నారు. దాదాపు 400 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాల్సిన అవసరం ఉంది. పైగా 2026లో యూనివర్సిటీ కళాశాలలు అక్రిడిటేషన్ పొందాల్సి ఉంది. ఈ సమయంలో ఆర్థిక భారం అనుకోకుండా వ్యవసాయ శాస్త్రవేత్తల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలి.
డా. బి.విద్యాసాగర్
మాజీ అధ్యక్షులు, తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం
ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..
Updated Date - Dec 30 , 2025 | 05:03 AM