ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nobel Prize 2024: ఈసారి సాహిత్య నోబెల్‌ ఎవరికి

ABN, Publish Date - Oct 08 , 2025 | 01:58 AM

ఇదొక గమ్మత్తయిన ప్రశ్న. చాలా సంవత్సరాలుగా ఈ ప్రశ్నకు సమాధానంగా అంచనాలు కట్టినవారంతా కచ్చితంగా నూటికి నూరు శాతం తప్పుగానే రుజువయ్యారు. ఫలానావారికి...

ఇదొక గమ్మత్తయిన ప్రశ్న. చాలా సంవత్సరాలుగా ఈ ప్రశ్నకు సమాధానంగా అంచనాలు కట్టినవారంతా కచ్చితంగా నూటికి నూరు శాతం తప్పుగానే రుజువయ్యారు. ఫలానావారికి సాహిత్య నోబెల్ రాబోతోంది అని వార్తల్లో ఎక్కువగా నలిగిన ఏ పేరూ పురస్కారం అందుకున్న చరిత్ర లేదు. 2024లో హాన్ కాంగ్ పేరును ఎవరూ ఊహించనేలేదు, అంచనా కట్టలేదు. అదీ నోబెల్ కమిటీ అంటే! నోబెల్ నామినేషన్లు అత్యంత గోప్యంగా ఉంటాయి కనుక అంచనాలూ అంతే ఎక్కువగా ఉంటాయి.

అక్టోబర్ 9న సాహిత్య నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తారు. గెరాల్డ్ మర్ణేన్, లాస్లో క్రాస్నహొర్కాయ్, క్రిస్టినా రివెరా గార్జా, హరుకి మురకామీ, మిర్చియా కార్టారెస్కు, ఎన్రికే విలా మటాస్, థామస్ పించన్, కేన్ ష్యూయ్, మిగెల్ హౌల్బెక్, అలక్సిస్ రైట్ ఈసారి వినిపిస్తున్న పేర్లు. గూగీ వా థియాంగో కూడా జాబితాలో ఉన్నాడు.

ఈసారి మురకామీ పేరు ఎక్కువ వినపడుతోంది. వార్తల్లో ఉన్న పేరు వెనక్కు వెళ్లిపోతుంది అనే మూఢనమ్మకం ప్రకారం మరి మురకామీకీ రాకపోవచ్చు. పైగా నోబెల్ కమిటీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. మురకామీ తరహా రచనలు నోబెల్ కమిటీ ఇష్టాలకు తగినవి కావు. గార్షియాకు వచ్చినపుడు మురకామీకి ఎందుకు రాదూ అన్నది మరో వాదన. నోబెల్ కమిటీకి కేవలం సాహిత్యమే కాక రాజకీయ, భౌగోళిక లెక్కలు కూడా ప్రధానం. నిజానికి నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని చాలా సందర్భాలలో సాహిత్యం కంటే రాజకీయాలే ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ‘‘మోస్ట్ అవుట్‌స్టాండింగ్‌ వర్క్‌’’ అంటూనే ‘‘ఇన్ ఐడియల్ డైరెక్షన్’’ అని కూడా ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్ తన వీలునామాలో రాసిన వాక్యం రచయిత ఎంపికలో చాలా కీలకం. శైలీ నైపుణ్యం, ప్రజాదరణ మాత్రమే కాక, మానవతా విలువల ప్రతిరూపంగా ఉన్న రచనలకే నోబెల్ కమిటీ ప్రాధాన్యతనివ్వాలి. ఈ ‘‘ఐడియల్ డైరెక్షన్’’ అనే మాటకు కమిటీ తనదైన అర్థాలను చెపుతూంటుంది. అయినప్పటికీ ఇప్పటి వరకూ అధిక సంఖ్యలో పురస్కారాలు అందుకున్నది యూరోపియన్లే. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు దక్కింది చాలా తక్కువ. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ ఆధిపత్యం ఎక్కువ.

ఈసారి పురస్కారం విషయంలో కమిటీ రాజకీయ కోణంలో ఆలోచిస్తే గార్జాకు, సృజనాత్మకత కోణంలో ఆలోచిస్తే అనీ కార్సన్‌కు ఊహించని పేర్ల జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. సల్మాన్ రష్డీ పేరు కూడా జాబితాలో ఉంది. కానీ ఆయనకు వచ్చేదయితే ఈ పాటికే వచ్చివుండాలి. రాలేదు కనుక ఇప్పుడూ రాదు అని ఒక అంచనా. పైగా గత దశాబ్ద కాలంగా రష్దీ పేరు ప్రధానంగా వినపడడమే తప్ప, ఎప్పుడూ తుది జాబితాకు చేరింది లేదు. గత సాహిత్య నోబెల్ మహిళకు వచ్చింది కనుక ఈ విడత పురుషుడిదే అన్నది మరో తర్కం. కొన్ని మినహాయింపులతో నోబెల్ కమిటీ ఒకసారి మహిళ, ఒకసారి పురుషుడు అనే సమతుల్యాన్ని పాటిస్తూ ఉంటుంది. గత రెండు పురస్కారాలు వరుసగా మహిళలకే దక్కాయి. అయితే చైనాకు చెందిన కాన్ష్యు ఈ అడ్డంకులను అధిగమించి పురస్కారం అందుకోగల శక్తి ఉన్న రచయిత్రి అని ఒక వాదన. ఆమె రచనల్లోని తాత్వికత, సంస్కృతీ ప్రతిఫలనాలు, గాఢత, మానవీయ విలువలు కమిటీని కొన్ని సంప్రదాయాలను దూరం పెట్టేట్టుగా చేస్తాయని సాహిత్యలోకం నమ్ముతోంది. ఇటీవలి పురస్కారాలు ఆసియాకు దక్కాయి కనుక ఈసారి యూరప్, దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా, ఇటలీ, ఆఫ్రికన్‌ సృజనకారులకు ఎక్కువ అవకాశాలున్నాయి. కవి, గాయకుడిగా బాబ్ డిలాన్ విషయంలో జరిగిన గొడవ నేపథ్యంలో క్నాస్గార్డ్ పేరు తుది జాబితాలో పరిశీలనకు రావడం కష్టమే. కార్టరెస్కుకు యూరోపియన్ సాహిత్య ప్రపంచంలో పెద్ద పేరు. గొప్ప గౌరవం. అంతేగాక గత మూడేళ్లుగా ఈ పేరు జాబితాలోని మొదటి మూడు స్థానాల్లో ఉండడంవల్ల అవకాశం ఎక్కువగా ఉందన్న చర్చ జరుగుతోంది.

అంచనాల్లో ఉన్న పేర్లన్నింటిలో మురకామీకి పురస్కారం దక్కితే భారతీయులు ఎక్కువ సంతోషిస్తారేమో. ఎందుకంటే ఆయన ఇండియాలో అత్యంత ఎక్కువమంది పాఠకులను సంపాదించుకున్న రచయిత.

ఒక ఆశ్చర్యం ఏమిటంటే– ఎక్కడో చివరనే కావచ్చు, స్టేక్స్ తక్కువే కావచ్చు కానీ– అంచనాల జాబితాలో స్టీఫెన్ కింగ్ పేరు కూడా ఉంది. మన జ్ఞానపీఠం జాబితాలో యండమూరి లాంటి పేరు ఊహించగలమా. ఇదీ అలాంటిదే!

మొత్తంగా చూస్తే ఎంత అంచనాలు కట్టి, ఎన్ని ఊహాగానాలు చేసినా నోబెల్ కమిటీ సాహిత్య ప్రపంచాన్ని ప్రతీసారీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూనే ఉంటుంది. ఆ ఆశ్చర్యం ఏమిటో తెలియడానికి మరో 36 గంటలు. అంతే.

ప్రసేన్

ఈ వార్తలు కూడా చదవండి..

విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 01:58 AM