Andhra Pradesh Farmers: రైతు శ్రేయస్సుకు పాటుపడేదెవరు
ABN, Publish Date - Dec 05 , 2025 | 04:17 AM
అనాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి విలయాలకు నిలయమైంది. సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు పడతాయి. కానీ గత రెండు మూడు దశాబ్దాలుగా అక్టోబర్–నవంబర్–డిసెంబర్ నెలల్లో...
అనాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి విలయాలకు నిలయమైంది. సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు పడతాయి. కానీ గత రెండు మూడు దశాబ్దాలుగా అక్టోబర్–నవంబర్–డిసెంబర్ నెలల్లో తీవ్ర తుఫానులు వస్తున్నాయి. విపరీతంగా వానలు కురిసి, నదులు పొంగి, వరదలు రావడంతో పంటలు పూర్తిగా దెబ్బతినడం మనం చూస్తున్నాం. రైతులను కోలుకోలేని స్థితికి తీసుకొస్తున్న ప్రకృతి వైపరీత్యాలను నిలువరించేందుకు మనమేం చేయాలి?
నేడు వ్యవసాయం లాటరీ అయ్యింది. ప్రకృతి వైపరీత్యాలు ఒక ఎత్తయితే, మరోవైపు ప్రభుత్వ విధానాలు ఈ స్థితికి కారణం. మరీ ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో తరచూ తుఫాన్ల తాకిడికి పంటలు తీవ్రంగా నాశనమౌతున్నాయి. ఒక్కో సంవత్సరమైతే బాగా పండిన పంటలు కూడా చేతికి అందకుండా నీటిపాలు అవుతున్నాయి. ఒక్కోసారి పాక్షికంగా కొంత పంట చేతికందుతుంది. ఆ పంట భారీవర్షాల మూలాన నాసిరకంగా తయారవుతుంది. ఆ సరుకును వ్యాపారులు కొనరు. పెట్టిన పెట్టుబడి రాక, అప్పులు పెరిగిపోయి రైతు దిగాలుపడతాడు. ఈ స్థితిలో కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కానీ ఇంకొందరు ఆత్మవిశ్వాసంతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, వ్యవసాయాన్ని విడిచిపెట్టకుండా ఉంటారు. పరిస్థితి ఇలా ఉండబట్టే చాలా మంది రైతులు వ్యవసాయానికి దూరమౌతున్నారు.
వ్యవసాయరంగం లాభసాటి కాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది నగరాలకు వలస పోతున్నారు. నాడు ‘రైతేరాజు’ అనే పరిస్థితి నుంచి నేడు ‘రైతేకూలీ’ అని స్థితికి వారు నెట్టబడ్డారు. నిత్యమూ రైతు నామం జపం చేస్తూ రైతు రాజ్యం, రైతు సంక్షేమం అని గగ్గోలు పెడుతున్న పాలకవర్గాలు రైతుకేమాత్రమూ లాభాలు చేకూర్చలేకపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం, పెట్టుబడి రాయితీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాయి. ఇవేమీ రైతుల ఆత్మహత్యలను ఆపలేకపోతున్నాయి. వాస్తవంగా ఆలోచిస్తే రైతుకు కావలసింది పెట్టుబడి సాయాలు కాదు. సామ్రాజ్యవాద మార్కెట్‌లో విరివిగా లభిస్తున్న కల్తీ విత్తనాలు, నాసిరకం పురుగు మందుల కట్టడి. కల్తీ సరుకులను అమ్ముతున్న వ్యాపారులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి. పంట సమయానికి ఎరువులను సకాలంలో రైతులకు అందించాలి. రాయితీల పేరిట వ్యవసాయ శాఖ అందిస్తున్న అత్యాధునిక వ్యవసాయ పరికరాలను కేవలం రైతులకే అందివ్వాలి.
‘జై జవాన్–జై కిసాన్’ అన్న లాల్‌బహుదూర్ శాస్త్రి మాటలకు విలువనిస్తూ, రైతుల శ్రేయస్సుకై పాటుపడాలి. పండిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాలపై లేదా? మార్కెట్ హెచ్చుతగ్గులను నియంత్రించాల్సిన పనిలేదా? కార్పొరేట్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో నియంత్రిస్తూ, పలు సంస్కరణలను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలి. స్వామినాథన్ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలుపరచాలి. పలు పాశ్చాత్య దేశాలు వ్యవసాయ రంగాన్ని ఆదాయం లభ్యమయ్యే విధంగా తీర్చిదిద్దాయి. వారు విస్తార వ్యవసాయం చేయడంలో పలు ఆధునిక సాగు పద్ధతులు అవలంబిస్తున్నారు. భారతీయ శాస్త్రవేత్తలు కూడా ఆ దిశగా ఆలోచించి మరిన్ని ఆధునిక వ్యవసాయ పద్ధతులకు రూపకల్పన చేయాలి. మరిన్ని దిగుబడి వంగడాలను సృష్టించాలి. తద్వారా రైతు కంట కన్నీరుకు అడ్డుకట్ట వేయగలగాలి. అందరికంటే రైతులే తుఫానుల వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపడుతూనే మరోవైపు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలి.
పిల్లా తిరుపతిరావు
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 05 , 2025 | 04:17 AM