Money Power In Elections: మిగిలేది ధనస్వామ్యమే
ABN, Publish Date - Dec 19 , 2025 | 02:07 AM
ప్రతి ఎన్నికల సమయంలోనూ దేశమంతా ఒకే మోసపూరిత రాజకీయ నాటకం పునరావృతమవుతున్నది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకే పరిమితం కాకుండా, నేడు గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు...
ప్రతి ఎన్నికల సమయంలోనూ దేశమంతా ఒకే మోసపూరిత రాజకీయ నాటకం పునరావృతమవుతున్నది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకే పరిమితం కాకుండా, నేడు గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ధన–కుల–అధికారాల మార్కెట్‌గా మారిపోయింది. రాజకీయ పార్టీలు ప్రజల ఆశలను, సమస్యలను ఒకే ఒక్క కొలమానంతో కొలుస్తున్నాయి– అదే ఓటు! ఆ ఓటుకు బదులుగా డబ్బు, మద్యం, బిర్యానీ, బంగారం, భూమి... ఏదైనా వాగ్దానం చేయగలుగుతున్నారు. ఆ వాగ్దానాల ఖర్చు మళ్లీ ప్రజల మీదే మోపుతామని వారికీ తెలుసు. ఈ వ్యవస్థను ఎన్నికలు అని పిలవడం కూడా మోసమే. నిజానికి ఇది ‘నీ ఓటుకు ధర ఉంది, నీ భవిష్యత్తుకు విలువ లేదు’ అనే క్రూర రాజకీయతత్వం.
గ్రామస్థాయిలో ఈ రూపం మరింత భయంకరంగా మారింది. లక్షలు కాదు, కోట్లు ప్రకటించే ఏకగ్రీవాల ప్యాకేజీలు, నామినేషన్ల ఉపసంహరణకు ఒప్పందాలు, బెదిరింపులు, ఇవన్నీ ఇప్పుడు ‘సాధారణ రాజకీయ ప్రక్రియ’గా మారాయి. పాఠశాలలు కూలిపోతున్నా, నాణ్యమైన విద్య అందకపోయినా, యువతకు ఉపాధి లేకపోయినా, గ్రామాల్లో హింస పెరుగుతున్నా, ఇవి అభ్యర్థుల చర్చలోకి రావు. వారికి ప్రజల జీవితం ముఖ్యం కాదు; పదవి, ఆ పదవితో వచ్చే లాభాలు, అధికారం మాత్రమే ముఖ్యం.
నిజమైన ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల సమస్యలను అధ్యయనం చేస్తారు. భూమి లేని వారికి భూమి, నాణ్యమైన విద్య, ఆరోగ్య హక్కు, ఉపాధి భద్రత, సామాజిక న్యాయం, కుల వివక్ష నిర్మూలన, నీరు–రోడ్లు–అభివృద్ధి వంటి అంశాలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు ఉంటాయి. కానీ నేడు ఆ స్థానాన్ని కుల గుడులు, కుల భవనాలు, గంపగుత్తగా నగదు పంపిణీ ఆక్రమించింది. ఇవన్నీ సమస్యల పరిష్కారాలు కావు, ఓట్ల కొనుగోలు పథకాలు మాత్రమే.
ఎన్నికలు ఒకప్పుడు ప్రజల హక్కు. నేడు అవి మద్యం వ్యాపారుల పెట్టుబడి, కాంట్రాక్టర్ల లాభ గణితం, భూదందా రాజకీయం, కుల సమీకరణ హింస, ఇవన్నీ కలిసిన ఒక ప్యాకేజీ వ్యవస్థ. ఇలా కొనసాగితే ప్రజాస్వామ్యం మిగలదు; ధనస్వామ్యమే మిగులుతుంది. మార్పు ఎక్కడ నుంచి వస్తుంది? ప్రజలు ఆలోచించడం ప్రారంభించిన క్షణం నుంచే! ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటు వేయటం, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిన్న చర్య కాదు, ఒక రాజకీయ విప్లవం. కులం, మతం, పార్టీ, డబ్బు... అనే సంకెళ్లను విదిలించుకుని పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడం, అదే నిజమైన ప్రజాఉద్యమం. ఎన్నికల వ్యవస్థ మారాలంటే ముందుగా ప్రజల వైఖరి మారాలి. ప్రజాస్వామ్యం అంటే పాలకుల రాజ్యం కాదు, ప్రజల రాజ్యం. అది తిరిగి సాధించాల్సిన బాధ్యత మనందరిది.
– పి.ఉజ్వల, పి.చరిత
ఇంజనీరింగ్, ఇంటర్ విద్యార్థినులు, హైదరాబాద్
Also Read:
జోగి రమేష్ బ్రదర్స్‌కు దక్కని ఊరట
పాలిచ్చే స్త్రీలు థైరాయిడ్ మందులు తీసుకోవచ్చా?
Updated Date - Dec 19 , 2025 | 02:07 AM