ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Can Vijay Outshine Udhayanidhi: విజయ్ వర్సెస్ ఉదయనిధి

ABN, Publish Date - Sep 23 , 2025 | 01:11 AM

ఒక్క చెట్టును గట్టిగా ఊపితే పది మంది నటులు కింద పడతారనీ, పైగా వాళ్లంతా తెల్ల పంచెలు కట్టుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారనీ తమిళనాడులో సరదాగా వినిపించే ఒక జోక్‌. నాడు ఎంజీఆర్ దూసుకొచ్చారు. తర్వాత జయలలిత డీఎంకేను...

ఒక్క చెట్టును గట్టిగా ఊపితే పది మంది నటులు కింద పడతారనీ, పైగా వాళ్లంతా తెల్ల పంచెలు కట్టుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారనీ తమిళనాడులో సరదాగా వినిపించే ఒక జోక్‌. నాడు ఎంజీఆర్ దూసుకొచ్చారు. తర్వాత జయలలిత డీఎంకేను గట్టి దెబ్బకొట్టారు. రజనీకాంత్ వద్దామనుకుని చాలా పర్యాయాలు వెనక్కి తగ్గారు. కమల్ హాసన్ వచ్చారు. ఒంటరిగా ఏమి చేయలేక డీఎంకే పంచన చేరి రాజ్యసభ సీటు తీసుకుని పక్కన కూర్చున్నారు. ఈసారి ఇళయ దళపతి (యువ నాయకుడు) విజయ్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ తర్వాత అగ్రనటుడిగా అందిపుచ్చుకున్న ఇమేజ్‌తో జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ తమిళ రాజకీయ యవనికపై అడుగుపెట్టగానే ఆయన అభిమానుల్లో ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం పెల్లుబికింది. డీఎంకే, అన్నాడీఎంకేతో విసిగిపోయిన తటస్థులకు విజయ్ ఆశాకిరణంగా కూడా కనిపిస్తున్నారు.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరం లేవు. అన్నాడీఎంకే ముక్కలైంది. బీజేపీ దూరం జరిగింది. డీఎంకే బలంతో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ మరోసారి సిద్ధమవుతోంది. వీళ్లందరినీ దాటుకుని ముందుకు వెళ్లేందుకు విజయ్ రంగంలోకి దిగారు. ఆయన వచ్చిన టైమ్, టైమింగ్‌ కూడా ఆమోదయోగ్యంగానే ఉంది. పార్టీ పెట్టిన రెండేళ్ళలోపే ఆయన ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే వేడిలో వేడిగా గెలిచెయ్యాలన్నది ఆయన ఆలోచన కావచ్చు.

విజయ్‌ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) వ్యవస్థాపన ఒక కీలక సమయంలోనే జరిగింది. అన్నాడీఎంకేలో తీవ్ర విభేదాలతో ఆ పార్టీలో ఐదు గ్రూపులు తయారై మాజీ సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వానికి ఎసరు వచ్చిన తరుణంలోనే విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. పైగా అన్నాడీఎంకేను ఛిన్నాభిన్నం చేస్తే మహారాష్ట్ర తరహాలో తాము బలపడే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేసుకుంటున్న తరుణంలోనే విజయ్ నేనున్నానని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాట 18శాతం ఓట్లు రావడం కూడా కీలకాంశమే అవుతుంది. ఎంజీఆర్, జయలలిత అభిమానుల్లో ఒక వర్గం ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వంపై విసుగుచెంది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారు. ప్రతీసారీ వాళ్లు బీజేపీవైపే ఉండకపోవచ్చు. విజయ్ వైపుకు వాళ్లు తమ దృష్టిని మళ్లించే అవకాశాలు కూడా లేకపోలేదు.

ఎన్నికలకు నాలుగు నెలల సమయం ఉండగానే విజయ్ తన జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. తిరుచ్చిలో జరిగిన తొలి పర్యటనతో ఆయన నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా పరిణతి చెందుతున్న సంకేతాలను ఇచ్చింది. ఎయిర్‌పోర్టు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సభాస్థలికి వెళ్లేందుకు నాలుగు గంటలు పట్టిందంటే అభిమానుల సందోహం ఎంతగా ఉన్నదో అర్థమవుతున్నది. తటస్థులే గాక ఇతర పార్టీల అభిమానులు, ముఖ్యంగా యువకులు, టీనేజర్లు ఎక్కువగా వచ్చారు. తమిళ గ్రామీణ ప్రజానీకం ఈసారి విజయ్ వెంట నడించేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి తోడు సినీ గ్లామర్‌తో జనాకర్షణ ఖాయం. అయినా విజయ్‌కు కొన్ని పరిమితులున్నాయి. జెండాలు పట్టుకున్న వాళ్ళంతా అనుకూల ఓటర్లు కాదన్నది ఆయన గుర్తించాలి. గెలిస్తే తాను ఏం చేయబోతున్నానో విజయ్‌ బహిరంగంగా చెప్పగలిగినప్పుడే జనం ఆకర్షితులవుతారు. తన పార్టీ విధానాలేమిటో ఆయన వివరించగలగాలి. సీఎం స్టాలిన్ సహా, రాజకీయ ప్రత్యర్థులంతా అడుగుతున్నది కూడా అదే. విజయ్ రాజకీయ విధానాలేమిటి అన్నదే వారి తొలి ప్రశ్న.

విజయ్ ఎవరికి పోటీ, విజయ్‌కు ఎవరు పోటీ? ఈ ప్రశ్న మదిలో మెదిలిన వెంటనే స్టాలిన్ తనయుడైన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గుర్తుకు వస్తారు. తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ ఆయన దిశానిర్దేశం కోసమే ఎదురు చూస్తుంటారని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. స్టాలిన్‌కు కూడా వయసు మీరుతున్న తరుణంలో ఏదో ఒక రోజున డీఎంకేకు ఉదయనిధి మాత్రమే వారసుడు అవుతారనే నిర్ణయానికి ఆ పార్టీ నాయకులు, కేడర్ వచ్చారు. అందుకే విజయ్ పార్టీ పెట్టిన వెంటనే డీఎంకే ప్రచార యంత్రాంగం మొత్తం అలర్టయ్యింది. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఉదయనిధికి ఇమేజ్ పెంచే ప్రక్రియ మొదలైంది. ఉదయనిధి చేపట్టే కార్యక్రమాలతో రీల్స్, ప్రోమోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్‌ను ఎక్కడా డైరెక్ట్‌గా కౌంటర్ చేయకుండా తెలివిగా వ్యవహరిస్తూ ఉదయనిధిని తమిళనాడుకు ఏకైక నాయకుడిగా నిలబెట్టే చర్యలు మొదలయ్యాయి.

ఉదయనిధి కూడా తన తాత కరుణానిధి, తండ్రి ఎంకే స్టాలిన్ తరహాలోనే నాస్తికుడు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. విజయ్ అలా కాదు. ఆయన క్రైస్తవుడు. హిందూ మతంపై కూడా గౌరవాభిమానాలున్నాయి. రాష్ట్ర పర్యటన కోసం చెన్నై నుంచి స్పెషల్ ఫ్లయిట్‌లో తిరుచ్చి వెళ్తూ రాహుకాలం చూసుకుని మరీ ముందే బయలుదేరారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఉదయనిధికి రాజకీయ అనుభవం ఉంది. కుటుంబ వారసత్వంగా కూడా రాజకీయం రక్తంలో లీనమై ఉంది. రాజకీయాలు చూస్తూ పెరిగిన కారణంగా ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తర్ఫీదు పొందారు. విజయ్‌కు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. సినిమాల్లో డైలాగులతో ఫేమస్ అయ్యారు. కాకపోతే విజయ్ ధైర్యవంతుడు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలరని ఆయనతో బాగా పరిచయం ఉన్నవాళ్లు చెబుతారు. అయినా ఎన్నికలు వస్తే ఎలా ముందుకు వెళ్లాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలో విజయ్‌ ఇంతవరకు నిర్ణయించుకోలేకపోతున్నారు. ఒంటరిగా గెలవడం కష్టమని మాత్రం విజయ్‌కు అర్థమైంది. ఇప్పటికిప్పుడయితే తమిళనాడులోని అన్ని పార్టీలు విజయ్‌ను తమ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నాయి. ఆయనతో పొత్తుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

డీఎంకే వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. విజయ్‌ను పెద్ద నాయకుడిగా పరిగణించేందుకు ప్రయత్నించడం లేదు. ఎక్కడా ఉదయనిధి వర్సెస్ విజయ్ అన్న ఆలోచన రాకుండా చూస్తోంది. స్టాలిన్‌కు రాజకీయ వారసుడైనంత మాత్రాన విజయ్‌తో డైరెక్టుగా రింగులోకి దిగాలా అన్నది డీఎంకే ఆలోచన. అటువంటి ప్రచారమే మొదలైతే– అనవసరంగా విజయ్‌కు పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుందని వాళ్లకు తెలుసు. అందుకే అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామిని తమ ప్రధాన ప్రత్యర్థిగా డీఎంకే పరిగణిస్తోంది. ఆయన పదికాలాల పాటు ప్రతిపక్షనేత హోదాలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ఉదయనిధి ఇటీవల చెప్పుకున్నారు. ఒక గీతను చిన్నదిగా చేసేందుకు మరో పెద్ద గీత గీసినట్లుగా విజయ్‌ను తక్కువ చేసేందుకు పళనిస్వామిని డీఎంకే తమ ప్రత్యర్థిగా నిలబెడుతోంది. వాటన్నింటినీ తట్టుకుని విజయ్ రాజకీయాల్లో రాణిస్తారని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఎంజీఆర్, జయలలిత నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు!

ఏ. బొల్లంరాజు

సీనియర్ జర్నలిస్ట్‌

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 01:12 AM