Literary Significance: కవి కులాబ్ధి సోముడు
ABN, Publish Date - Jul 07 , 2025 | 05:57 AM
‘‘ఒకడు నాచన సోమన్న’’ అన్నారు విశ్వనాథ. అద్వితీయుడు (unique) అని ఆయన భావన. ‘‘మాట నేర్పు మీద, మానవ ప్రకృతి మీద, గడుసుదనం మీదనే సంవిధాన సౌధాన్ని నాచన సోమన్న నిర్మించాడు. ఇంతగా గడుసుతో...
‘‘ఒకడు నాచన సోమన్న’’ అన్నారు విశ్వనాథ. అద్వితీయుడు (unique) అని ఆయన భావన. ‘‘మాట నేర్పు మీద, మానవ ప్రకృతి మీద, గడుసుదనం మీదనే సంవిధాన సౌధాన్ని నాచన సోమన్న నిర్మించాడు. ఇంతగా గడుసుతో సంవిధాన నిర్వహణ చేసిన తెలుగు కవులు లేనేలేరని చెప్పవచ్చు,’’ అని కూడా విశ్వనాథ వ్యాఖ్యానించారు.
నాచన సోమన క్రీ.శ.1344ప్రాంతంవాడు. ఎఱ్రాప్రగడకు సమకాలికుడు; ఒకరకంగా కొద్దిగా చిన్నవాడు. సోమన రాసిన ‘ఉత్తర హరివంశం’ ఒక ప్రబంధం. కాగా అప్పటికే ఎర్రన రాసిన ‘హరివంశం’ ఉన్నది. ఎర్రనది పురాణ కావ్యమైతే సోమనది ప్రబంధ శైలి. ఎఱ్రాప్రగడ తన ‘హరివంశా’న్ని ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. కాని సోమన తన ప్రబంధాన్ని నరాంకితం చేయకుండా తిక్కన లాగా హరిహరనాథుడికి సమర్పించాడు.
నిజానికి హరివంశం భారతానికి ఖిలం. అంటే పరిశిష్టం. సంస్కృత హరివంశాన్ని తిక్కన తన అనువాదంలో చేర్చలేదు. ఇది కలిపితేనే భారతం మహా భారతం ఔతుందని పెద్దలంటారు. వ్యాసకృతంగా పేర్కొనే ఈ పవిత్ర గ్రంథాన్ని ఇప్పటికీ నేపాల్ న్యాయస్థానాల్లో సాక్షులు తల మీద పెట్టుకుని ప్రమాణం చేస్తారు. హరివంశంతో భారతం సంపూర్ణతను సంతరించుకుంటుంది.
అప్పటికే ఎర్రన రాసిన హరివంశం ఉండగా, నాచన సోముడు మళ్ళీ రాయడం ఎందుకు? కారణాలు ఊహించాల్సిందే. ఎర్రన హరివంశం సోమన దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు; వచ్చినా సంతృప్తిని ఇవ్వకపోయివుండవచ్చు; పురాణంగా కాక, ప్రబంధ ధోరణిలో రాయాలని భావించి వుండవచ్చు. ఇకపోతే, మనకు లభ్యమవుతున్న సోమన ‘ఉత్తర హరివంశం’లో సాధారణంగా ఉండాల్సిన అవతారిక, కావ్యం చివరలో గద్య లేవు. ఇవి వుంటే ఎన్నో వివరాలు తెలిసేవి. అందువల్ల సోముడు పూర్వహరివంశం, ఉత్తర హరివంశం– రెండూ రాసాడని ఊహించడానికి చాలా అవకాశం వున్నది.
సంస్కృత హరివంశంలో వున్న ఎన్నో విషయాలు మనకు ఈ ‘ఉత్తర హరివంశం’లో కనిపించవు. ఎర్రన వదిలేసిన హంసడిభోపాఖ్యానం ఇందులో కనిపిస్తుంది. అందువల్ల పూర్వహరివంశం సోమన రాసి వుండవచ్చు. నిజానికి ఉత్తర హరివంశం కూడా మనకు పూర్తిగా దొరకడం లేదు. సోమన ‘హరవిలాసం’, ‘వసంత విలాసం’, ‘ఆదిపురాణం’ అనే రచనలు చేసాడని లాక్షణికులు అన్నారు. కాగా, ఇవేమీ ఇప్పుడు లభ్యం కావు.
సోమన ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడు. వీటిని తదనంతర కవులు ఎన్నిటినో అనుసరించారు. మచ్చుకు సోముని మొదటి పద్యం – ‘‘శ్రీ సర్వమంగళాకుచవాసంతీ’’ అని ప్రారంభమవుతుంది. ఇందులో అమ్మవారి వక్షోజాల ప్రశంస వున్నది. ఇలాంటిది పూర్వకవుల్లో అగుపించదు. కావ్యం మొదట్లో అమ్మవారి పాలిండ్లను స్తుతించడం సోమన ఒరవడి దిద్దిందే. అందువల్ల మొట్టమొదటి ‘చంటబ్బాయ్’ నాచన సోముడే అని చెప్పాలి.
సోమన రాసిన 1487 సద్యాల్లో సామెతలు, జాతీయలు, పలుకు బళ్ళు మనకు బళ్ళనిండా దొరుకుతాయి. సజీవమైన జాతీయాల్ని, నిత్యజీవితంలోని మాటల్ని వాడాడు. ‘లంజ’, ‘మిండరికం’ లాంటి శబ్దాలు సైతం కనిపిస్తాయి. పురాణ ధోరణి నుంచి తన కావ్యాన్ని ప్రబంధ ధోరణిలో తీర్చిదిద్దాడు సోమన. ఇతని పాత్రలు సమకాలీన మనస్తత్వాలతో కానవస్తాయి. సారస్వతం కన్నా ఈయన రచనలో చమత్కారమే ఎక్కువ.
అందుకే – ‘‘ఈ కథలు వ్రాయుటలో నాచన సోమన్న తన కావ్యమునకొక మహాప్రయోజనమభిలషించెను. ఇట్టి దానికి ప్రబంధ ధ్వనియని పేరు. ఈ ప్రబంధ ధ్వని విషయము మహోత్తాలమైన కొలది ప్రధానముగా కవి మహాకవి యగుచున్నాడు’’ అని విశ్వనాథ వివరించారు. అందువల్లే ఇతణ్ణి చాలామంది అనంతర కవులు పద్య రచనా విధానంలో పూర్తిగా అనుసరించారు. నరకాసుర వథ వృత్తాంతంలో సత్యభామ యుద్ధం చేస్తూండగా నాచన ఆమెను ఇలా వర్ణించాడు:
మ. అరిజూచున్ హరిజూచు జూచుకములందందంద మందార కే
సరమాలా మకరంద బిందు సలిలస్యందంబులందంబులై
తొరుగం, బయ్యెదకొం గొకింత దొలగన్ దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్
(హరివంశం – 1 – 162)
– ఇదే ఘట్టంలో తన భాగవతంలో బమ్మెర పోతన ఇలా అనుకరించారు:
మ. పరుజూచున్ వరుజూచు నొంప నలరింపన్ రోష రాగోదయా
విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్ గన్నుల గెంపు సొంపు బరగన్ జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచున్ జంద్రాస్య హేలాగతిన్
(భాగవతం – 10 – ఉత్తర – 178)
నాచన క్రమాలంకారాన్ని సైతం పోతన అందంగా అనుసరించాడు. రచనాశిల్పపరంగా ‘సంవిధాన చక్రవర్తి’ అనే బిరుదు నాచన సోమునికి సార్థకమవుతుందని విశ్వనాథ వ్యాఖ్యానించారు. అత్యంత దుష్కర ప్రాసను వాడి కంద పద్యానికే వన్నె తెచ్చిన విధానం ‘‘ప్రాగ్జ్యోతిషంబు గదిసి దృగ్జ్యాంటకృతులు లేక దితిజుల మీదన్ దృగ్జ్యోత్స్న జేవురింపగ దిగ్జ్యాగగనాంతరంబు దివురగ నార్చెన్’’ (1–143) అనే దాంట్లో మనకు కనపడుతుంది.
పురాణ అంశాన్ని తాత్త్విక దశలోకి తీసుకెళ్ళి, శివకేశవుల్ని పోలుస్తూ, ఛేకానుప్రాసం, విషయం, అంత్యానుప్రాసాలంకారాలలో ఒక విచిత్రమైన సీస పద్యాన్ని రాసాడు సోమన (2–180). పెంచడం, తుంచడం హరిహరులు ఇద్దరూ సమానంగా చేస్తున్నారని చెప్పాడు:
అభ్రంకషంబైన ఆలపోతు నితండు త్రుంచినాడీతండు పెంచినాడు
సాధుసమ్మతముగా సామజంబు నితండు కాచినాడీతండు త్రోచినాడు
బర్హిర్ముఖార్థమై పర్వతేశు నితండు తాల్చినాడీతండు వ్రాల్చినాడు
ఫణ పరంపర తోడి పన్నగేంద్రునితండు మెట్టినాడీతండు చుట్టినాడు
నేడు నాడును నాడును నేడు మనకు చూపచెప్పంగ చెప్పంగ చూపగలిగె
ననుచు కొనియాడ సంయమిజనుల కొదవె రజతగిరి మీద
హరిహరారాధనంబు
–కృష్ణుడు వృషభాసురుణ్ణి చంపాడు. కాగా, శివుడు ఎద్దును పెంచి వాహనంగా చేసుకున్నాడు. హరి ఏనుగును రక్షించాడు. ఐతే, శివుడు గజాసురుణ్ణి వధించాడు. విష్ణువు దేవతల కోసం కూర్మంగా పర్వతాన్ని మోసాడు. శివుడు మాత్రం త్రిపురాసురుల సంహారంతో మేరుపర్వతాన్ని విల్లుగా చేసుకుని, దాన్ని వంచాడు. హరి పామును పాన్పుగా చేసుకుంటే హరుడు మెడకు చుట్టుకున్నాడు. నాడూ నేడూ వీటిని కథలుగా విన్నాం – ఇప్పుడు చూస్తున్నాం – అని శివకేశవుల సమాగమంలోని పద్యం.
సీసపద్య రచనకు శ్రీనాథుణ్ణి ఎంతో స్తుతిస్తారు కాని, నాచన సోముడి రచనాశిల్పం అగ్రగణ్యమని తోస‍్తుంది (శ్రీనాథుడు క్రీ.శ.1370 ప్రాంతంవాడు). పద్యాల్లో సారస్వతం కన్నా చమత్కారమే ఎక్కువగా ఆయన సాహిత్య ధర్మంగా మారింది అనవచ్చు. వక్రోక్తికి ఉదాహరణగా ఒక గొప్ప పద్యం మనకు రెండో ఆశ్వాసంలో తటస్థిస్తుంది (176):
సీ. కుజము కుంజరముచే కూలునో కూలదో? కూల్చు కుంజరము
నీ కుజము గూల్చె
మ్రాను పేరేటిచే మడుగునో మడుగదో? మడుచు పేరేటి
నీ మ్రాను మడచె
కాలునో కాలదో ఒకనిచే సాలంబు? కాలు నీ సాలంబు కాల్చె నొకని
తునియునో పరశుచే తునియదో వృక్షంబు? తునియు
నీ వృక్షంబు తునిమె పరశు
గీ. వనుచు తమలోన చర్చించు అమర వరుల కభిమతార్థ
ఫలార్థమై ఉండవచ్చు
పారిజాతంబు నా మ్రోల పండియుండ నంద గంటి నా కోర్కెల నంద గంటి
– ఇక్కడ పునరుక్తులైన శబ్దాలతో అర్థభేదం కల్పించి క్రీడ సల్పాడు సోమన. ‘‘లోకంలో ఏనుగు చెట్టును కూలుస్తుందో లేదో కాని, ఈ వృక్షం (శివుడు) గజా సురుణ్ణి కూల్చేశాడు. పెద్ద నది చెట్టును చుట్టేస్తుందో లేదో కాని, ఈ చెట్టు (శివుడు) గంగను తలలో చుట్టేశాడు. ఒకడి వల్ల చెట్టు కాలుతుందో లేదో కాని, కాలుడు (శివుడు) మన్మథుణ్ణి కాల్చేశాడు. గొడ్డలి చెట్టుని నరుకుతుందో లేదో కాని, శివుడు పరశువు అనే దైత్యుణ్ణి నరికేశాడు.’’ దేవతలకు ఆయన ఫలవృక్షం కదా! అందుకే ఇక్కడ శివుణ్ణి వృక్షంతో పోల్చాడు.
ఉత్తర హరివంశం ఒక లోకోత్తర కావ్యం. కొద్దిపాటి కథలతో ప్రబంధ రచన చేయడం నాచన సోముడితోనే మొదలైంది. అయిదు కథల్లోని అంతరార్థాన్ని వివరించడంలో ఆయన మహాశిల్పాన్ని కనబరిచాడు. ప్రతి పద్యంలో శబ్దాలంకారమో చమత్కార వర్ణనో, పాండితీ శౌర్యమో మనకు గోచరిస్తుంది. మనసుకు హాయిని కలిగిస్తాయి సోముని పద్యాలు.
నాచన సోముడికి క్రమాలంకారం ఇష్టమని ఎన్నో పద్యాల వల్ల తెలుస్తుంది. అలా రాస్తూనే, చమత్కారాన్నీ, విరోధాభాసనీ ప్రదర్శిస్తాడు. మచ్చుకి:
పన్నగంబులరాజు పగవాడు కూడి నీ శయనంబు పయనంబు సంతరింప
దుగ్ధ వారాశి కూతురు ఆలు కూడి శరణంబు చరణంబు సవదరింప
తామర పగవాడు దయితుండు కూడి నీ బడిచూపు కుడిచూపు పరిఢవింప
చందురు చెలికాడు సయిదోడు కూడి నీ ఉల్లంబు మొల్లంబు ఉపచరింప
కంపమాన మనోధ్యానగతుల మానకేకతంబున్న మునులకు ఏకతంబు
లేక పొడగాన వచ్చు నీ లీల కాన అన్యులేనాట ధన్యులే అంబుజాక్ష!
మునులు కృష్ణుణ్ణి స్తుతించే పద్యం ఇది. ఇందులో శబ్దాల్ని ఒక ఆట ఆడించాడు సోమన. యథాసంఖ్యాలంకారంతో అలంకరించాడు. దీని భావం ఇది– ‘‘శత్రువులైన సర్పరాజు, గరుత్మంతుడు నీకు పాన్పు వాహనం అయ్యారు. తల్లీ కూతుళ్లైన లక్ష్మి, గంగ నీ వక్షస్థలాన్ని పాదాల్ని ఆశ్రయించారు. విష్ణువుకు సూర్యచంద్రాదులు కళ్లు. రెండింటికీ పడని తామరలు, కలువలు నీ చూపులు అయ్యాయి. మన్మథుడు, కౌస్తుభం నిన్ను సేవిస్తున్నాయి– రెండూ తోబుట్టువులు. నీ లీలలు ధ్యానించే మునులకు నిర్హేతుకంగా ఇలా తోస్తున్నాయి.’’
సుకుమార మధుర శైలితో మనల్ని అలరించే నాచన సోముడిని ఆలంకారికులు, లాక్షణికులు ఎన్నో విధాలుగా శ్లాఘించారు. అయితే, రావాల్సినంత కీర్తిప్రతిష్ఠలు ఆయనకు రాలేదు. వస్తుకళ, సమకాలీన జీవన చిత్రణ, శబ్దార్థాల చిత్రరచన వున్న ‘ఉత్తర హరివంశం’ అసంపూర్తిగా వుండటం దీనికి కారణం కావచ్చు. కాగా, సాహిత్యోపాసకులు, భాషాభిజ్ఞులు తప్పక చదవాల్సిన కావ్యం ఇది.
అప్పరుసు విజయ రామారావు
91770 86363
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు
Read Latest Telangana News and National News
Updated Date - Jul 07 , 2025 | 05:58 AM