Indian Stock Market: మదుపరులూ పారాహుషార్
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:01 AM
అమెరికా ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ మాయాజాలం దేశీయ స్టాక్ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపింది. ఎఫ్ అండ్ ఓ విభాగంలో ఎక్స్‌పైరీ రోజుల్లో ఈ సంస్థ తన చేతివాటంతో భారీగా లాభాలను ఆర్జించినట్లు...

అమెరికా ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ మాయాజాలం దేశీయ స్టాక్ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపింది. ఎఫ్ అండ్ ఓ విభాగంలో ఎక్స్‌పైరీ రోజుల్లో ఈ సంస్థ తన చేతివాటంతో భారీగా లాభాలను ఆర్జించినట్లు సెబీ గుర్తించింది. మానవ ప్రమేయం లేని ఆల్గో ట్రేడింగ్‌తో జేన్ స్ట్రీట్ ఈ మోసాలకు పాల్పడినట్లు తేల్చింది. ఈ అక్రమ దందాతో బ్రోకర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లూ భారీగానే నష్టపోయారు. రిటైల్ మదుపరులు భవిష్యత్తులో ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే మరింత అప్రమ్తతంగా ఉండక తప్పదు. అవేమిటంటే..
పెద్ద సంస్థలదే హవా
మార్కెట్ సమాచారం పెద్ద పెద్ద ట్రేడింగ్ సంస్థలకు తెలిసినంతగా రిటైల్ ఇన్వెస్టర్లకు తెలియదు. ఆ మాటకొస్తే చిన్న చిన్న ట్రేడింగ్ సంస్థలకూ తెలియదు. కాబట్టి స్పష్టమైన సమాచారం ఉంటే తప్ప ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ జోలికి పోయి చేతులు కాల్చుకోవద్దు.
గుడ్డిగా నమ్మొద్దు
టెక్నాలజీ కూడా మాయగాళ్లకు తోడ్పడుతోంది. జేన్ స్ట్రీట్ సంస్థ కూడా అత్యాధునిక ఆల్గో ట్రేడింగ్ ద్వారానే ఎఫ్ అండ్ ఓ మార్కెట్లో అనైతిక పద్ధతులకు పాల్పడింది. కాబట్టి ఇండెక్స్‌లు మార్కెట్ వాస్తవ పరిస్థితులకు నిజమైన సూచికలని గుడ్డిగా నమ్మవద్దు. అందులోనూ ఎక్స్‌పైరీ రోజుల్లో అసలు నమ్మొద్దు.
సూచీల కదలికలపైనా జాగ్రత్త
రిటైల్ మదుపరులు ఇండెక్స్‌ల కదలికలపైనా జాగ్రత్త పడాలి. తన పంప్ అండ్ డంప్ వ్యూహంతో జేన్ స్ట్రీట్.. డెరివేటివ్స్ విభాగంలో సూచీలను ప్రభావితం చేసింది. డెరివేటివ్స్‌లో ఇన్వెస్ట్ చేసే రిటైల్ మదుపరులు సూచీల కదలికను బట్టి కాకుండా టెక్నికల్స్ ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది.
అవగాహన
ఎక్స్‌పైరీ రోజుల్లో సూచీలను గణనీయంగా పెంచటం, తగ్గించేందుకు జేన్ స్ట్రీట్.. ఆల్గో ట్రేడింగ్ ద్వారా పెద్ద మొత్తంలో పుట్ ఆప్షన్స్ కొనుగోలు చేసింది. వాటిని ఫ్యూచర్స్‌లో విక్రయించి భారీగా లాభపడింది. ఈ మాయ మంత్రాలు పెద్ద పెద్ద ట్రేడర్లకు తప్ప రిటైల్ మదుపరులకు తెలియవు. కాబట్టి రిటైల్ మదుపరులు ఎఫ్ అండ్ ఓ జోలికి పోకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఆస్తే లేనప్పుడు మనీలాండరింగ్ ఎక్కడిది?
పవర్ జోలికొస్తే... పవర్ పోతుంది