CPM CH Baburao: పవర్ జోలికొస్తే... పవర్ పోతుంది
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:19 AM
నాడు పవర్(విద్యుత్) జోలికి వచ్చి.. పవర్(అధికారం) కోల్పోయిన చంద్రబాబు ఇప్పటికైనా ఆ విషయాన్ని గుర్తుంచుకుని పవర్(విద్యుత్) జోలికి రాకుండా ఉంటే మంచిదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు.
అదానీకి, మోదీకి దాసోహమైన చంద్రబాబు, పవన్, జగన్
విజయవాడ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నాడు పవర్(విద్యుత్) జోలికి వచ్చి.. పవర్(అధికారం) కోల్పోయిన చంద్రబాబు ఇప్పటికైనా ఆ విషయాన్ని గుర్తుంచుకుని పవర్(విద్యుత్) జోలికి రాకుండా ఉంటే మంచిదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. ఏపీసీపీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం కార్యకర్తలు స్మార్ట్‌మీటర్లు వద్దంటూ మెడలో ఫ్లకార్డులు ధరించి ఆందోళన చేశారు. బాబూరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే విద్యుత్ విషయంలో మాట తప్పి ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందన్నారు. తొలి అడుగులోనే తప్పటడుగులు వేసి ప్రజలను ముంచిందన్నారు. విద్యుత్ బాదుడు ఉండదని హామీ ఇచ్చి రూ.15,485 కోట్ల సర్దుబాటు చార్జీల భారం వేయడం సరి కాదన్నారు. గతంలో స్మార్ట్ మీటర్లు పగులగొట్టాలని పిలుపునిచ్చిన కూటమి నేతలే నేడు మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇవ్వడం వెనకున్న అంతర్యమేంటో చెప్పాలని ప్రశ్నించారు. రూ.1,750 కోట్లు గత ప్రభుత్వానికి ముడుపులు ఇచ్చి అదానీతో చేసుకున్న ఏడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని కూటమి సర్కార్ కొనసాగిస్తూ ఆ పాపంలో వాటా పంచుకుంటోందని తీవ్ర ఆరోపణలు చేశారు.