Urdu Education Language Policy: ఉర్దూ భాషకు అసలైన స్వర్ణోత్సవాలు కావాలి
ABN, Publish Date - Dec 30 , 2025 | 05:12 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమి ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘సురూర్–ఏ–ఉర్దూ’ (ఉర్దూ ఆనందోత్సవ హేల) పేరుతో ప్రభుత్వం స్వర్ణోత్సవాలు నిర్వహించడం స్వాగతించదగ్గ విషయం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమి ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘సురూర్–ఏ–ఉర్దూ’ (ఉర్దూ ఆనందోత్సవ హేల) పేరుతో ప్రభుత్వం స్వర్ణోత్సవాలు నిర్వహించడం స్వాగతించదగ్గ విషయం. ఉర్దూను పరిరక్షించడంతో పాటు ఉర్దూ సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలన్న ఉన్నత ఆశయంతో 1975 డిసెంబర్ 31న నాటి ప్రభుత్వం జీవోను తెచ్చింది. దీని ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి గల ఉర్దూ అకాడమిని ఏర్పాటు చేసింది. అకాడమి బోర్డు ప్రతిపాదనల ప్రకారం, రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా అమలు చేయాలి. ఉర్దూ భాషాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టాలి. కానీ అకాడమి ఏర్పాటు చేసినంత ఉత్సాహాన్ని దాని పాలనలో ప్రభుత్వం చూపలేకపోయింది. నిధుల కేటాయింపుల్లో కోత విధించడంతో, పలు పథకాలు అమలు కాలేదు.
ఇటీవల ఉర్దూ మహోత్సవాలను ప్రభుత్వం తరఫున నిర్వహించిన సందర్భంగా మన రాష్ట్రంలో ఉర్దూ భాషా అకాడమి తీరు తెన్నులను ఓసారి చూద్దాం. భాష అనేది ఏ మతానికీ సంబంధించినది కాదు. ఉర్దూ భాషలో రాణించిన కవులు మతాలకు అతీతంగా ఉన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో ఉర్దూ ద్వారా లభించిన ప్రోత్సాహం ప్రతి ఉద్యమకారుడికీ స్ఫూర్తినిచ్చింది. కానీ స్వాతంత్ర్యానంతరం, దేశ భాషల కంటే ఎక్కువగా ఆంగ్లం అభివృద్ధి చెందింది. ఈ దశలో, ప్రాంతీయ భాషలను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు సైతం అంతంత మాత్రమే కృషి చేస్తున్నాయన్నది అక్షర సత్యం. డా. సి.నారాయణరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉర్దూ భాషలో ఎంతో నిష్ణాతులని గర్వంగా చాటుకోవచ్చు.
రాష్ట్రంలో ఉన్న ముస్లిం జనాభాలో 80శాతం మందికి ఉర్దూ మాతృభాషగా ఉంది. రాజ్యాంగంలోని 350 అధికరణ మేరకు వారికి మాతృభాషలో విద్యనభ్యసించే ప్రాథమిక హక్కు ఉన్నా, అది అమలు కావడం లేదు. వారిలో ఉర్దూ మాధ్యమంగా విద్యనభ్యసిస్తున్నవారు పదిశాతం మాత్రమే. ఉర్దూ ప్రాథమిక పాఠశాలలు అతి తక్కువగా ఉండటం, ఉన్న కొద్ది ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత కూడా ఓ ప్రధాన కారణం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఉర్దూ ఉపాధ్యాయులను నియమించడం హర్షణీయం. నాలుగు దశాబ్దాలుగా అంతో ఇంతో అమలవుతూ వచ్చిన ఉర్దూ భాషాభివృద్ధి పథకాలకు గత ప్రభుత్వం చరమగీతం పాడింది. నిధుల కొరత సాకుతో ఏకంగా ఉర్దూ అకాడమి మూతపడేలా చేసింది.
ఉర్దూ అకాడమి నూతన చైర్మన్‌గా ఇటీవల ఫరూక్ శుబ్లీ నియమితులుకావడం సంతోషకరం. ఉర్దూ భాషాభివృద్ధికి తగిన ప్రణాళికలతో అకాడమి ముందుకు సాగాలి. భాషతో పాటు, సాహిత్యాన్ని వ్యాప్తి చేసేందుకు వీలుగా సెమినార్లు, మషాయిరాలు (కవి సమ్మేళనాలు) నిర్వహించాలి. ఉర్దూ భాషను ప్రోత్సహించే సంస్థలను, ఉర్దూ కవులను, రచయితలను ప్రోత్సహించాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రలో ఆంగ్లం, తెలుగు భాషలతో పాటు ఉర్దూ భాషకూ స్థానం కల్పించాలి. ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులపై ఉర్దూలో పేర్లు లేకపోవడం శోచనీయం. గతంలో మాదిరిగా ఉర్దూ డీటీపీ సెంటర్లను ప్రభుత్వం బాధ్యతతో నిర్వహించాలి. అకాడమి ఆధ్వర్యంలో ‘భౌమీ జబాన్’ మ్యాగజైన్‌ను పునరుద్ధరించాలి. ఉర్దూ విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కాలర్‌షిప్‌ల రూపంలో ఆర్థిక సాయం అందజేయాలి. ఉర్దూ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలి.
గత రెండేళ్లుగా నామమాత్రంగా జరుపుతున్న జాతీయ ఉర్దూ దినోత్సవం (నవంబర్ 9)ను ఉర్దూ అకాడమి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించాలి. ఉర్దూ విశ్వవిద్యాలయానికి దశాబ్దం క్రితం శంకుస్థాపన జరిగినా, నేటికీ భవన సముదాయాలు పూర్తికాలేదు. ఉర్దూ విశ్వవిద్యాలయం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. ఉర్దూ భాషలో ప్రావీణ్యులైన వీసీ, ప్రొఫెసర్లను నియమించాలి. విశ్వవిద్యాలయం అభివృద్ధికి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలి. యూజీసీ తదితర కేంద్ర సంస్థల నుంచి నిధులు రాబట్టుకునే కృషి జరగాలి. ఉర్దూ యూనివర్సిటీకి అనుబంధంగా ఉర్దూ మీడియం కళాశాలలు ఏర్పాటు చేసి, వివిధ గ్రూపుల్లో విద్యా బోధన జరిగేలా చూడాలి.
ప్రతి జిల్లాకు ఒక ఉప విద్యాధికారి హోదా కలిగిన ఉర్దూ అధికారిని, ప్రతి డివిజన్‌కు ఒక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ రేంజ్ అధికారిని నియమించాలి. ఉర్దూ అకాడమి ఆధ్వర్యంలో ఉర్దూ పాఠ్యపుస్తకాలు, డైరీలు ముద్రించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ అంగన్వాడీ సెంటర్లు, బాల్వాడీలు, సిరీస్ సెంటర్లను పునరుద్ధరించాలి. ఉర్దూ అకాడమి వార్షిక ప్రణాళికను రూపొందించి క్షేత్ర స్థాయి వరకు అమలయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలి. ఈ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకున్నప్పుడే ఉర్దూ అకాడమి స్వర్ణోత్సవాలకు సార్థకత. ఆ అభివృద్ధి దిశలో ఏపీ ఉర్దూ అకాడమి రాణించి, దేశంలోనే ఉత్తమ ఉర్దూ అకాడమిగా నిలవాలని ఆశిద్దాం.
షేక్ అబ్దుల్ సమద్
ఇవి కూడా చదవండి..
బట్టలు లేకుండా తాగుతూ, తూగుతూ.. బ్రిటన్‌లో వెరైటీ న్యూ ఇయర్ పార్టీ..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ Qల మధ్యలో O ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..
Updated Date - Dec 30 , 2025 | 05:12 AM