Telangana Digital Initiatives: కీలకమవుతున్న డిజిటల్ అక్షరాస్యత
ABN, Publish Date - Sep 25 , 2025 | 06:04 AM
చాలా మంది చదవటం, రాయటం రావడమే అక్షరాస్యత అనుకుంటారు. డిజిటల్ అక్షరాస్యతపైనా ఇలాంటి అపోహలే వున్నాయి. ‘నాకు స్మార్ట్ ఫోన్ వాడకం తెలుసు. వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాను. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలున్నాయి. వీడియోలు తీసి...
చాలా మంది చదవటం, రాయటం రావడమే అక్షరాస్యత అనుకుంటారు. డిజిటల్ అక్షరాస్యతపైనా ఇలాంటి అపోహలే వున్నాయి. ‘నాకు స్మార్ట్ ఫోన్ వాడకం తెలుసు. వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాను. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలున్నాయి. వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాను... కాబట్టి నాకు డిజిటల్ అక్షరాస్యతవున్నట్టే’ అని చాలామంది భావిస్తుంటారు. కానీ అది సరిపోదు. మన నిత్యజీవితావసరాల్లో ఎన్నింటికి మనం యాప్స్‌ను వాడుకోగలుగుతున్నాం అనేది మన డిజిటల్ అక్షరాస్యత స్థాయిని తెలియజేస్తుంది.
ప్రయాణాలకు టిక్కెట్లు కావాలి, అత్యవసరంగా ఫుడ్ కావాలి, బయటకు వెళ్లడానికి క్యాబ్ కావాలి... వీటన్నిటికీ తత్తరపడకుండా సమర్థవంతంగా యాప్స్ ఉపయోగించుకోగలుగుతున్నామా? మనకు తెలిసిన సమాచారం అవునో కాదో నిర్ధారించుకోవాలి... ఇంటర్నెట్‌ను పూర్తి స్థాయిలో శోధించగలుగుతున్నామా? అసలు సాగులో ప్రాథమిక పాఠాలు మొదలుకొని సంక్లిష్టమైన సైన్సు విషయాల వరకూ ఆన్‌లైన్‌లో అందుబాటులో వుంటాయని మనకు తెలుసు... వాటిని మన అవసరం మేరకు వాడుకోగలుగుతున్నామా?
బ్రిటిష్ శాస్త్రవేత్త హెర్బర్ట్ స్పెన్సర్ ప్రతిపాదించిన ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ (Survival of the Fittest) సిద్ధాంతం అందరికీ తెలుసు. పర్యావరణ మార్పులకు అనుగుణంగా మనుగడ సాగించగల జీవులే కొనసాగుతాయనీ, అలా లేనివి కనుమరుగవుతాయని దాని సారాంశం. డిజిటల్ అక్షరాస్యత కూడా అంతే. ప్రపంచం వేగంగా మారిపోతున్నప్పుడు మనం దానికి దీటుగా రూపొందాలి. విద్యార్థులు, పట్టభద్రులు, రైతులు, కార్మికులు, గృహిణులు... ఒకరేమిటి, అన్ని వర్గాలవారూ దీన్ని సాధించి తీరాల్సిన లక్ష్యంగా భావించకపోతే దూసుకుపోతున్న ప్రపంచం మనల్ని జాలిగా చూస్తుంది. టెక్నాలజీ ప్రపంచంలో మనకు చోటుండదు. వెనకబడి పోతాం.
మన దేశంలో ప్రస్తుతం 80.6 కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. ఈ ఏడాది ఆఖరుకు అది 90 కోట్లు దాటుతుందన్న అంచనా వుంది. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఇప్పటికే 98.5 కోట్లకు చేరుకున్నాయి. అందులో వైర్‌లెస్ వాటా 93.5 కోట్లయితే, వైర్ కనెక్షన్‌వి 4.5 కోట్లు. ఈ విస్తృతి మన దేశానికి ఒక ఖ్యాతిని తెచ్చింది. ప్రపంచ ఆన్‌లైన్ జనాభా వరసలో మనం రెండో స్థానంలో వున్నాం. ఇదంతా నగర, పట్టణ ప్రాంతాల వ్యవహారం అనుకోనవసరం లేదు. గ్రామీణ భారతంలో 40 కోట్లమంది ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. అంటే డిజిటల్ విభజన చెరిగిపోవటం ఇక ఎంతో దూరంలో లేదు! 96 శాతం 5జీ కవరేజ్‌లోకి వెళ్లాక డిజిటల్ ఉపకరణాలు మన జీవితంలో విడదీయరాని భాగం అయ్యాయి. చెల్లింపులు మొదలుకొని ఆరోగ్య పరిరక్షణ వరకూ అన్నీ ఆ ఉపకరణాలతో ముడిపడివున్నాయి.
మనకు దృగ్గోచరంకాని కొన్ని వ్యవస్థలు సమష్టిగా పనిచేయటం, మన దగ్గరుండే యాప్‌లు సమన్వయంతో మనకు కావలసిన ఫలితాలను రాబడతాయని అవగాహన చేసుకోవటం డిజిటల్ అక్షరాస్యతలో ప్రధానమైన భాగం. ఉదాహరణకు మీరు క్యాబ్ బుక్ చేసినప్పుడు ఆ యాప్ గూగుల్ మ్యాప్స్ యాప్‌కు తనంత తాను అనుసంధానించుకుని ఏ దిశగా రావాలో, ఎటు వెళ్లాలో సూచిస్తుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. మీరు యూపీఐ ద్వారా చెల్లించినప్పుడు ఆ క్షణంలోనే మీ బ్యాంకు ఆ లావాదేవీని నిర్ధారిస్తుంది. కొన్ని సాఫ్ట్‌వేర్ లింక్స్– వాటిని మనం డిజిటల్ బ్రిడ్జిలందాం– తమలో తాము ‘సంభాషించుకోవటం’ వల్ల ఇదంతా సాధ్యమవుతోంది. ఒక రెస్టారెంట్‌లోకి మీరు వెళ్లారనుకుందాం. అక్కడ ఇష్టమైనది ఆర్డర్ ఇస్తారు. వెయిటర్ మీ ఎంపికలను రాసుకుని కిచెన్‌లో ఇస్తాడు. వారు వెంటనే ఆర్డర్ చేసినవన్నీ అతనికివ్వగా, మీరు కూర్చున్నచోటకు ఆ ఆహారపదార్థాలు వస్తాయి. మీకు ఆ హోటల్‌లో కిచెన్ ఎక్కడుందో తెలియదు. చేసేవారెవరో కూడా తెలియదు. అయినా కోరుకున్నవి మీ చెంత వుంటాయి. యాప్‌ల అంతర్గత సంభాషణ అలాగే ఉంటుంది. ఇలాగే మీ–సేవ ద్వారా వచ్చే ధ్రువీకరణ పత్రాలు, ఆన్‌లైన్ క్లాస్‌రూంలు, సాగుకు తోడ్పడే ఏఐ ఉపకరణాలు... ఇవన్నీ మీ ఫోన్ లేదా మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లలో తెరవెనుక పరస్పర సంక్లిష్ట సంభాషణల ద్వారా కోరినవి మీ ముందు పరుస్తాయి.
డిజిటల్ అక్షరాస్యతలో ఐచ్ఛికం (ఆప్షనల్) అనే మాటే లేదు. అది తప్పనిసరి. వచ్చే అయిదు, పదేళ్లలో ఏ రంగంలో– అది సాగు కావొచ్చు, చదువు కావొచ్చు– ఉపాధి కావాలన్నా డిజిటల్ నైపుణ్యాలు ఉండి తీరాలి. రైతులు ఏఐ ఆధారిత ముందస్తు పంట సమాచారాన్ని, మార్కెట్ల గురించిన ఇన్ఫర్మేషన్‌ను పొందక తప్పదు. విద్యార్థులు హైబ్రిడ్ తరగతుల్లో నేర్చుకోవటం తప్పనిసరవుతుంది. పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌పై ఆధారపడతాయి. ఆఖరికి సీనియర్ సిటిజన్‌లు కూడా డిజిటల్ హెల్త్ రికార్డులు ఉపయోగించవలసివస్తుంది. వ్యక్తులుగా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందటానికి కావొచ్చు, ఇతరులతో సమానంగా ఆర్థిక లబ్ధి పొందటం, జ్ఞానాన్ని సాధించటం వగైరాలకు కావొచ్చు– అందుకు డిజిటల్ అక్షరాస్యత తప్పనిసరి. సమూహాలకైతే మెరుగైన పారదర్శకత, సమర్థవంతమైన పాలన, ఆర్థిక ప్రగతి సాధనకు ఇది అవసరం.
డిజిటల్ సాధికారత వరకూ చూస్తే దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. టీ–ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్‌ను ప్రభుత్వం అనుసంధానం చేయగలిగింది. మారుమూల ప్రాంతాల్లోనివారికి సైతం చదువు, ఈ–గవర్నెన్స్, ఆరోగ్య పరిరక్షణ వగైరాలను అందుబాటులోకి తెచ్చింది. మీ–సేవ వేదికగా 150 రకాల సేవలను అందిస్తోంది. ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు, బిల్లుల చెల్లింపులు, దరఖాస్తులు... ఒకటేమిటి దాదాపు సమస్తం ఇప్పుడు ప్రజల మునివేళ్లపై ఉన్నాయి. డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం తీసుకుంది. మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం ద్వారా ఏఐలో, ఇతరేతర సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల్లో యువతను తీర్చిదిద్ది భవిష్యత్తరాల ఉద్యోగ యోగ్యత సామర్థ్యాన్ని పెంచటమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల్లో విద్యార్థులకు, యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందే అర్హతలను అందించడంలో టాస్క్ (తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) ముందంజలో వుంది.
సమ్మిళిత వృద్ధికి డిజిటల్ అక్షరాస్యత ఒక పునాదిగా ఎంత అవసరమో దేశానికి తెలంగాణ మార్గనిర్దేశం చేస్తోంది. టీ–ఫైబర్, టీ వర్క్స్, టీ హబ్, మీసేవ, టాస్క్, ప్రపంచ భాగస్వామ్యాల ద్వారా భవిష్యత్తును అందిపుచ్చుకోవటం కాదు... దాన్ని నిర్మించటం ఎలాగో దేశానికి తెలంగాణ చేసి చూపుతోంది. 20వ శతాబ్దంలో సంప్రదాయ అక్షరాస్యత మాదిరే 21వ శతాబ్దంలో డిజిటల్ అక్షరాస్యత మనుగడకు సంబంధించిన నైపుణ్యంగా మారింది. దాన్ని ఎంత వేగంగా స్వీకరించగలిగితే అంత త్వరగా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి
వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News
Updated Date - Sep 25 , 2025 | 06:04 AM