Women Empowerment In Literature: మహిళలతోనే పుస్తకాల భవితవ్యం
ABN, Publish Date - Sep 28 , 2025 | 03:54 AM
అమెరికా రచయిత, ప్రజావక్త, తాత్విక యాత్రికుడు ఎరిక్ వీనర్ 2007లో ‘పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఎందుకు చదువుతారు?’ (వై ఉమెన్ రీడ్ మోర్ దేన్ మెన్) అనే వ్యాసం రాశారు. ‘రెండు సంవత్సరాల క్రితం విఖ్యాత బ్రిటిష్ నవలా...
అమెరికా రచయిత, ప్రజావక్త, తాత్విక యాత్రికుడు ఎరిక్ వీనర్ 2007లో ‘పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఎందుకు చదువుతారు?’ (వై ఉమెన్ రీడ్ మోర్ దేన్ మెన్) అనే వ్యాసం రాశారు. ‘రెండు సంవత్సరాల క్రితం విఖ్యాత బ్రిటిష్ నవలా రచయిత ఇయాన్ మెక్‌ఈవాన్ ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఒక మధ్యాహ్నం ఇయాన్, ఆయన కుమారుడు లండన్ లోని ఒక పార్క్‌లో పిచ్చాపాటీలో ఉన్న జనాల మధ్యకు వెళ్లి పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. కొద్ది నిమిషాలలోనే తండ్రీ కొడుకులు 30కి పైగా నవలలు ఉచితంగా ఇచ్చివేశారు. తీసుకున్నవారు దాదాపుగా అందరూ మహిళలే. వారందరూ ఎంతో ఉత్సుకతతో ఆ కానుకలు అందుకున్నారు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పురుషులు మాత్రం ఈ పుస్తక దానంపై కనుబొమలు ముడిచారు. దాతల ఉద్దేశాన్ని సంశయించారు. పుస్తక పఠనంపై అయిష్టతను చాటుకున్నారు’ అని వీనర్ ఆ వ్యాసంలో రాశారు. ఆ ప్రయోగానుభవంతో ‘మహిళలు చదవడం మానివేసినప్పుడు నవలా రచన అంతమవుతుంది’ అనే ఒక అభిప్రాయానికి ఇయాన్ వచ్చారని వీనర్ ముక్తాయించారు. మరి, మహిళలు విశేష చదువరులు అయినా సాహిత్య స్రష్టలయిన విద్యావతుల గురించి మనం మాట్లాడుకోవలసినంతగా ఎందుకు మాట్లాడుకోవడం లేదు?
ఈ ఏడాది కొంతమంది భారతీయ రచయిత్రులకు ప్రపంచ సాహిత్య జగత్తులో విశేష గౌరవాదరాలు లభిస్తున్నాయి. బాను ముస్తాక్ కథా సంకలనం ‘హార్ట్ ల్యాంప్’కు అంతర్జాతీయ బుకర్ పురస్కారం లభించింది. దక్షిణ భారతీయ రచయిత్రి ఒకరికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం ఇదే మొదటిసారి. కర్ణాటకలో ముస్లిం మహిళల జీవితాల గురించి కన్నడ భాషలో బాను ముస్తాక్ ప్రతిభావంతంగా రాసిన కథలను అంతే ప్రతిభావంతంగా దీపా భస్తీ ఆంగ్లంలోకి అనువదించారు. బుకర్‌తో లభించిన విశేష గౌరవాదరాలకు రచయిత్రి, ఆమె అనువాదకురాలు పూర్తిగా అర్హులే. వర్తమాన భారతీయ సాహిత్యచరిత్రలో బాను, దీపా కలిసికట్టుగా అంతర్భాగమయ్యారు.
రెండు దశాబ్దాల క్రితమే తన నవల ‘The Inheritance of Loss’కు బుకర్ పురస్కారాన్ని పొందిన మరో భారతీయ రచయిత్రి కిరణ్ దేశాయి. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. ఆమె కొత్త నవల ‘The Loneliness of Sonia and Sunny’ ఈ ఏడాది బుకర్ పురస్కారానికి అత్యంత అర్హమైన నవలల్లో ఒకటిగా ఉన్నది. ఈ నవలా రచనకు ఆమె రెండు దశాబ్దాల సుదీర్ఘకాలాన్ని తీసుకున్నారు. ‘ఏ క్రమశిక్షణతో మీరు ఇరవై సంవత్సరాల పాటు ఈ నవలా రచనలో నిమగ్నమయ్యారు?’ అని ఆమెను ప్రశ్నించాను. ‘ఇన్ని సంవత్సరాల సృజనాత్మక కృషి మూలంగా నాలో ప్రగాఢంగా అంతస్థగితమైన క్రమశిక్షణనే నేను అనుసరించాను. ప్రతి ఉదయం నేను నేరుగా రచనా వ్యాసంగంలో నిమగ్నమవుతాను. నాకు అదొక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. మరింత నిష్ఠగా, మరింత మెరుగ్గా నా సృజనాత్మక కృషికి అది తోడ్పడుతుంది. ప్రతి రోజూ నేను ఒక చీమగా, ఒక తేనెటీగగా, ఒక వానపాముగాపనిచేస్తాను. వాస్తవ జీవితానుభవాలు కళాత్మక జగత్తులోకి పరివర్తనమవుతుంటాయి...’. కిరణ్ దేశాయి తల్లి ప్రముఖ రచయిత్రి అనితా దేశాయి తాజా నవల ‘రోసారిటా’ విశేష ఆదరణ పొందుతోంది. తల్లీకూతుళ్ల మధ్య సంబంధాలు, జ్ఞాపకాలు, ఒంటరితనం మొదలైన విషయాలతో ఆసక్తికరంగా చదివించే ఈ నవల గత ఏడాది ప్రచురితమయింది. స్వేచ్ఛ, కళాత్మక జీవితం అన్వేషణలో భారత్ నుంచి మెక్సికోకు వెళ్లిన ఒక మహిళ గాథే ‘రోసారిటా’. ఎనిమిదిన్నర దశాబ్దాల పైబడిన వయసులో అనితా దేశాయి సాహిత్య సృజన నుంచి మనమందరమూ స్ఫూర్తి పొందాలి.
బుకర్ పురస్కార గ్రహీతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం తప్పనిసరిగా అరుంధతీరాయ్ గురించి ప్రస్తావించుకోవాలి. బుకర్ పురస్కారాన్ని పొందిన ప్రప్రథమ భారతీయ రచయిత్రి ఆమె. 1997లో ఆమె మొదటి నవల ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’కు బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె ఇటీవలి పుస్తకం ‘మదర్ మేరీ కమ్స్ టు మి’ తల్లి మేరీ రాయ్ గురించిన జ్ఞాపకాల సముచ్ఛయం. తన అసాధారణ బాల్యం గురించి అరుంధతి కథనం పాఠకులను ఏకాగ్ర చిత్తంతో చదివిస్తుంది. బహుశా అది ఒక రచయితను సృష్టించడం గురించి కూడా కావచ్చు. అరుంధతి ఇలా రాశారు: ‘జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు అయిన లక్ష్యాలు, సంకల్పాలు, కుటుంబ సంబంధాలు, స్నేహితులు, శారీరక, మానసిక ఆరోగ్యం, మనశ్శాంతి మొదలైన వాటికి నా జీవితం ఒక పాదసూచిక మాత్రమేనని భావిస్తున్నాను. నా జీవితం ఎప్పుడూ విషాదమయంగా గడవలేదు. తరచు ఉల్లాసకరంగా సాగింది. బహుశా ఇది నాకు నేను చెప్పుకున్న అబద్ధమూ కావచ్చు. పవనాలు బలంగా వస్తున్న చోట నా గుడారాన్ని వేసుకున్నాను. ఆ పవనాలు నా హృదయాన్ని నా శరీరం నుంచి నిర్మలం చేస్తాయని ఆశించాను. బహుశా నేను రాయదలుచుకున్నది జీవన ప్రస్థానంలో నాలో రూపొందిన వ్యక్తి నా యువ ఆత్మకు నమ్మక ద్రోహం గురించి.. అదే జరిగివుంటే అదేమీ చిన్న పాపం కాదు. అయితే దాని మంచి చెడ్డల గురించి ఒక నిశ్చిత అభిప్రాయాన్ని వ్యక్తం చేయగల స్థితిలో నేను లేను’.
నేను ఇంతవరకు సాహిత్య సృజన చేస్తున్న మహిళల గురించి ప్రస్తావించాను (ఈ రచయిత్రులు ఇప్పటికే సుప్రసిద్ధులని, వారి గురించి రాయనవసరం లేదని నా స్నేహితుడు ఒకరు వాదించారు. అయితే నేను అతనితో ఏకీభవించలేదు. సాహిత్య రచనలు చేసేవారి గురించి పదేపదే మాట్లాడుకోవల్సి ఉందని నేను విశ్వసిస్తున్నాను). రచయిత్రుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పుస్తకాలను పాఠకుల వద్దకు తీసుకువెళుతున్న మహిళల గురించి కూడా ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలలో మహిళలు ప్రారంభిస్తున్న స్వతంత్ర పుస్తక దుకాణాలు, గ్రంథాలయాల సంఖ్య పెరిగిపోతోందని నా స్నేహితులు చెప్పారు. ఈ మహిళల లక్ష్యం ఏమిటి? పుస్తకపఠనంపై ఆసక్తి చూపే విద్యావంతులు అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉంచడమే వారి ధ్యేయం. ఆన్‌లైన్ కొనుగోళ్ల విషయం ఎలా ఉన్నప్పటికీ వివిధ నగరాలలో చాలా మంది మహిళలు పుస్తకాల కొనుగోలుదారులు, పాఠకులతో సంభాషిస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. యువజనులు, వృద్ధులకు కొత్త పుస్తకాలు అందిస్తున్నారు. సృజనాత్మక ఇంద్రజాలంతో సమ్ముగ్ధం చేసే పుస్తకాలకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. పుస్తక పఠనం, పుస్తక రచన, పుస్తకాల సృష్టి భవితవ్యం మహిళలేనా? నాకు తెలియదు. వారే అయినపక్షంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలి కుమారుడిగా, మహా చదువరి అయిన ఒక మహిళ భర్తగా నేను ఒక విషయాన్ని దృఢ విశ్వాసంతో చెప్పగలను: మన జీవితాలను ఆక్రమించుకుంటున్న కృత్రిమ మేధ (ఏఐ)ను పుస్తకాలు జయించి చిరకాలం మన భావజగత్తును అలరిస్తాయి.
డెరెక్ ఓబ్రియన్
పార్లమెంటు సభ్యుడు (టీఎంసీ)
(ఇండియన్ ఎక్స్‌ప్రెస్)
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News
Updated Date - Sep 28 , 2025 | 03:54 AM