CM Revanth Reddy ON ATC: తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:59 PM
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి యువతకు నైపుణ్యాన్ని అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University)ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మల్లెపల్లిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రారంభోత్సవం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించారని గుర్తుచేశారు.
ఐటీఐలు నిర్వీర్యం..
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదని చెప్పుకొచ్చారు. కోర్సులను అప్‌గ్రేడ్ చేయకపోవడంతో కాలక్రమేనా ఐటీఐలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలనే ఆలోచన చేశామని వివరించారు. ఇవాళ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇవాళ ప్రారంభించుకున్న 65 ఏటీసీలే నిదర్శనమని ఉద్ఘాటించారు. తెలంగాణలో 65 ఏటీసీలను పూర్తి చేశామని తెలిపారు. నేడు మరో 51 ఏటీసీలను మంజూరు చేశామని అన్నారు. ఏడాదిలోగా 51 ఏటీసీల నిర్మాణం పూర్తి చేస్తామని నొక్కిచెప్పారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవని చెప్పుకొచ్చారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి యువతకు నైపుణ్యాన్ని అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
నైపుణ్యంపై యువత ఫోకస్ పెట్టాలి..
‘సాంకేతిక నైపుణ్యంపై యువత ఫోకస్ పెట్టాలి. జర్మనీ, జపాన్ దేశాలు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. మా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోండి. డ్రగ్స్, గంజాయి ఈ సమాజానికి పట్టిన చీడ.. వ్యసనాలకు బానిస కాకండి. తల్లిదండ్రులకు బాధను మిగల్చకండి. ఏటీసీల్లో చదువుకున్న విద్యార్థులకు ఆర్టీసీలో అప్రంటీస్ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కి సూచిస్తున్నా. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2 వేలు స్కాలర్‌షిప్ అందించేలా ఆర్థికమంత్రిని ఒప్పిస్తాం. ఈ బాధ్యతను మంత్రి శ్రీధర్ బాబు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. యువత భవిష్యత్ కోసం మేము ప్రణాళికలు రచిస్తున్నాం. ఉద్యోగ అవకాశాలను ఇచ్చేందుకు జపాన్ సిద్ధంగా ఉంది. మనిషికి తెలివి, పని చేసే కమిట్‌మెంట్ ఉంటే.. ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. మీ భవిష్యత్‌కు పునాదులు వేస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News