ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

The Final Act of Armed Struggle: ఆఖరి అంకంలో సాయుధ పోరాటం

ABN, Publish Date - Dec 04 , 2025 | 03:26 AM

హిడ్మా ఎన్‌కౌంటర్‌, పెద్ద ఎత్తున మావోయిస్టుల అరెస్టులు, లొంగుబాట్లతో పీపుల్స్‌వార్‌/ మావోయిస్టు పంథా ముగింపు దశకి వచ్చింది. చరిత్ర పునరావృతమైనట్లయింది. 1968లో విజయవాడలో...

హిడ్మా ఎన్‌కౌంటర్‌, పెద్ద ఎత్తున మావోయిస్టుల అరెస్టులు, లొంగుబాట్లతో పీపుల్స్‌వార్‌/ మావోయిస్టు పంథా ముగింపు దశకి వచ్చింది. చరిత్ర పునరావృతమైనట్లయింది. 1968లో విజయవాడలో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి, కొల్లా వెంకయ్య తదితరుల నాయకత్వంలో వెలసిన ఏపీసీసీసీఆర్‌ ద్వారా సాయుధ పోరాట పంథాకు జరిగిన అంకురార్పణ శ్రీకాకుళం, వరంగల్‌, జగిత్యాల, ఇంద్రవెల్లి మీదుగా దేశమంతా పాకింది. ఈ క్రమంలో సీపీ గ్రూప్‌, పీపుల్స్‌వార్‌, లిన్‌పియావో/ రెడ్‌ఫ్లాగ్‌ (రవూఫ్‌), పైలా గ్రూప్‌, జీవీ గ్రూప్‌, ఫణిబాగ్చి వర్గం, కేఆర్‌ గ్రూప్‌, జనశక్తి, చలమన్న గ్రూప్‌, ఆర్‌వోసీ– అలా చీలికలు పీలికలవుతూ ఝార్ఖండ్‌ అడవుల్లోని ఎంసీసీతో కలిసిపోయింది. ఒక సమయంలో నేపాల్‌లోని ప్రచండ వర్గం నుంచి శ్రీలంకలోని ఎల్‌టీటీఈ వరకు సంబంధాలు పెట్టుకుని రెడ్‌ కారిడార్‌ ఏర్పరిచింది.

ఏదో ఒక నాటికి దుర్భేద్య స్థావరాలు అవసరమవుతాయనే కొండపల్లి సీతారామయ్య దూరాలోచన మేరకు వింధ్యారణ్యాల్లోని ఆదివాసీ ప్రాంతాల్లో వైద్యులు, టీచర్ల రూపంలో 1980ల నుంచే బేస్‌ ఏర్పరచుకున్నారు. ఆ స్థావరాలే ఇప్పటిదాకా ఉద్యమ నాయకత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. ఒకానొక సమయంలో అసలీ దావానలాన్ని ఆపగలమా అనే సందేహం పాలకవర్గాల్లో కలిగింది. కానీ ఊహించని స్థాయిలో విరుచుకుపడిన టెక్నాలజీ కారణంగా, ఆత్మరక్షణ వ్యూహాలతో ఉద్యమ విస్తరణ వెనుకబడడంతో సాయుధ పోరాటం చివరికొక అనాథలా ముగియడం సామాజిక విషాదం.

భారతదేశంలో సాయుధ పోరాటాలు, మావోయిస్టు పార్టీ పాత్రలపై ఏదో ఒక రోజు సమగ్ర చరిత్ర లిఖితమవుతుంది. ఈ ఉద్యమం మిగిల్చిన నెత్తుటి మరకలు, త్యాగాలు, అరాచకాలు, అన్నివైపులా జరిగిన ప్రాణనష్టం, క్రమేపీ కుంచించుకుపోయిన మేధావి వర్గం పోషించిన పాత్ర, జరిగిన వాగ్వాదాలు, పంథాల మధ్య ఘర్షణలు ఎలాగూ అక్షరాలకెక్కుతాయి. అరవయ్యేళ్ల సాయుధ పోరాట ఆలోచనా స్రవంతిలో, కీలక సమయాల్లో జరిగిన నిర్ణయాల గురించి విపులంగా పరిశోధిస్తే, తప్పొప్పులను తూకం వేసుకోవడమే కాక, రాబోయే తరాల ఆలోచనలకు ఒక దిక్సూచి దొరుకుతుంది.

చైనాను మావో నడిపిన రోజుల్లో ముందడుగు (గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌), సాంస్కృతిక విప్లవం పేరిట జరిగిన అరాచక ఆలోచనలు, సాయుధ పోరాటాలని అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకు ఎగుమతి చెయ్యాలన్న నిర్ణయంలో భాగంగా భారతదేశంలో సాయుధ పోరాటానికి పునాది వేసి, రాళ్లు పేర్చింది అప్పటి ‘గ్యాంగ్‌ ఆఫ్‌ ఫోర్‌.’ అలా విదేశీ ఉత్ర్పేరకాల మూలాలున్నప్పటికీ, చారు మజుందార్‌, వెంపటాపు సత్యం, కొండపల్లి సీతారామయ్య లాంటి అతి సాధారణ వ్యక్తులు అన్ని లక్షల మందిని సాయుధ విప్లవం వైపు, అజ్ఞాత జీవితం వైపు, త్యాగాలు, మరణాల వైపు నడిపించగలిగారంటే, అప్పటి ప్రధాన రాజకీయ స్రవంతి, పాలనా యంత్రాంగం, ప్రజల సమస్యలు, ఆలోచనల పట్ల ఎంత గుడ్డితనంతో వ్యవహరించాయో అర్థమవుతుంది.

మావో బతికుండగానే నక్సల్బరీ వసంత గర్జన కలకత్తా వీధుల్లో శవమై తేలింది. శ్రీకాకుళ రైతాంగ పోరాటం అనుకోకుండా జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌తో నిశ్శబ్దమైపోయింది. చండ్ర పుల్లారెడ్డి మరణానంతరం కూడా పరిమిత హింసతో ఆ గ్రూపు కొనసాగింది. కానీ పోలీసులతో తలపడడానికి, కవ్వింపు చర్యలకు దూరంగా ఉంది. కానీ వీటన్నిటికీ నేపథ్యంలో కొండపల్లి మొదలెట్టిన పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ మొదటి నుంచీ దూకుడుతనాన్నే ప్రదర్శించింది. మరి గతంలో వచ్చి పోయిన పాలపొంగుల్ని, వాస్తవ విప్లవ పరిస్థితుల్ని సరిగ్గానే అంచనా వేసిందా? 1976లో మావో మరణానంతరం గ్యాంగ్‌ ఆఫ్‌ ఫోర్‌ని తరిమికొట్టి, డెంగ్‌ నాయకత్వంలో చైనా పూర్తిగా సంస్కరణవాదం వైపు మళ్లడాన్ని ఏ మాత్రం సరిగ్గా అర్థం చేసుకుంది? ఎమర్జెన్సీలో జరిగిన అణచివేతకు ప్రతీకారంగా యువ విప్లవకారులు అరాచక హత్యల వైపు మళ్లినప్పుడు మేధావి వర్గం ఏ మేరకు గైడ్‌ చేసింది? భారత రాజకీయాల్లో భార్గవ కమిషన్ల వాతావరణం శాశ్వతమనుకున్నారా?

అతివాద, మితవాద వర్గాల ఘర్షణల్లో ప్రతిసారీ అతివాదులదే పైచేయి అయింది. అతివాదాన్ని సమర్థించే మేధావి వర్గ పరిమాణం కృశించిపోతుండగా, మితవాద మేధావులు క్రమేపీ విత్‌డ్రా అయిపోయారు. 1990 సోవియట్‌ యూనియన్‌ పతనం నుంచి నేర్చుకున్నదేమిటి? చరిత్ర గమనాన్ని గుర్తించారా? కొండపల్లిని బహిష్కరించడం, తర్వాత వరుసగా కర్నూలులో కన్నబీరన్‌, గుంటూరులో బాలగోపాల్‌ నిష్ర్కమణ... సాయుధ పోరాటాన్ని ఏ దుస్సాహసాల వైపు నడిపించాయి?

ఒక పక్క ఎన్నికలు బహిష్కరించమని పిలుపులిస్తూ, పోలింగ్‌ స్టేషన్ల మీద దాడులు చేస్తూ, బ్యాలెట్‌ బాక్సులు ధ్వంసం చేస్తూ, ఇంకో పక్క 1983, 85 ఎన్నికలలో ఎన్టీఆర్‌ను, 1989లో చెన్నారెడ్డిని, 1994లో మళ్లీ ఎన్టీఆర్‌ను సమర్థించి, 1999, 2004లో తెలుగుదేశానికి బద్ధ వ్యతిరేకంగా పనిచేసి ఏం సాధించారు? వీళ్లతో ఎప్పటికయినా ప్రమాదమే అని అన్ని ప్రధాన పార్టీలకూ సంకేతాలివ్వడం తప్ప! తీరా 2009 నాటికి ఎన్నికలలో ఏ ప్రభావమూ చూపలేని పరిస్థితికి దిగజారిపోయారు.

1995లో ఉత్తర తెలంగాణను విముక్త గెరిల్లా ప్రాంతంగా ప్రకటించుకుని, ప్రత్యేక తెలంగాణకు పిలుపునిచ్చారు. దాన్ని వీవీ, బాలగోపాల్‌, కోదండరామ్‌, హరగోపాల్‌, గద్దర్‌లు విస్తృతంగా ప్రజల్లోకి, విద్యార్థుల్లోకి తీసుకెళ్లారు. కానీ తీరా తెలంగాణ ఏర్పడే నాటికి ఆ ప్రాంతాల్లో సాయుధ పోరాట దళాలే కనుమరుగైపోయి, పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. మరి ప్రత్యేక తెలంగాణ పోరాటం ఏ దోపిడీ వర్గాల ప్రయోజనం కోసం చేసినట్టు?

ఇలా చరిత్ర చౌరస్తాలో ఎన్నోసార్లు నిలబడ్డా, సాయుధ పంథాను, వాస్తవ పరిస్థితులను, ప్రపంచ గమనాన్ని, టెక్నాలజీ ప్రభావాన్నీ ఎప్పుడూ సీరియస్‌గా సమీక్షించకుండా, విప్లవ బద్ధకాన్ని ప్రదర్శించడం వల్లే, ఈ వారించదగిన ప్రాణనష్టం, పరువు నష్టం జరిగాయేమో అని ఆలోచించాల్సిన సమయమిది. పూర్తిగా అశక్తులై... అవకాశమివ్వండి, చర్చలకొస్తాం అని అభ్యర్థించే స్థాయికి రావడం వెనుక వ్యూహాత్మక తప్పిదాలు, మేధావి వర్గాల ఉపసంహరణ, కొట్టుకుపోయే ధోరణులు ఎంతవరకు కారణమో విశ్లేషించుకోవాలి.

పునరాలోచించుకోమన్న వారందరినీ అన్యవర్గ ధోరణి ప్రభావితులనో, విప్లవ ప్రతీఘాత శక్తులనో, రివిజనిస్టులనో పక్కకు నెట్టేయడం వల్ల నష్టం జరిగింది ఎవరికి? రీగన్‌, థాచర్‌ల ప్రభావం, సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నాల నేపథ్యంలో బ్రిటిష్‌ లేబర్‌ పార్టీయే తనను తాను పునర్నిర్వచించుకుని, న్యూ లేబర్‌గా అవతరించగా లేనిది, కీలక సమయాల్లో ఎంఎల్‌ పార్టీలు అటువంటి రాజకీయ బాధ్యత ఎందుకు తీసుకోలేదు?

నష్టపోయారు, ఓడిపోయారు కాబట్టి అపహాస్యం చెయ్యడం అనాగరికం. ఇరువైపులా పోయిన ప్రాణాలన్నీ మనవే. చరిత్రలోని ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరిస్తే, భవిష్యత్తులో మరిన్ని కష్టాలు, నష్టాలు తప్పవు. స్వాతంత్ర్య పోరాటంలో మిలిటెంటు రాజకీయాల వల్ల జరిగిన ప్రాణ నష్టాలతో పోలిస్తే, తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన నష్టాలు ఎక్కువ. దానితో పోలిస్తే మావోయిస్టు సాయుధ ఉద్యమంలో జరిగిన ధన, ప్రాణ నష్టాలు కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఈ మూడింట్లో ఏవీ నిరుపయోగంగా జరగలేదు. అన్నిటివల్లా సమాజానికి ఎంతో కొంత మేలే జరిగింది. కానీ అంతకన్నా తక్కువ త్యాగాలు, నష్టాలతో, ప్రత్యామ్నాయ పోరాట మార్గాలలో ఎక్కువ మేలు జరిగే అవకాశాలు ఉన్నాయా అని ఇప్పటికైనా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇన్ని పోరాటాలు చేసి, ఇన్ని త్యాగాలు చేసి, చివరకు రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను ఎటువంటి శక్తులకు అప్పజెప్పాం?

తుపాకులు, మందుపాతర్లు, ప్రజాకోర్టులు మాదకద్రవ్యాల్లాంటివి. అలాగే బూటకపు ఎన్‌కౌంటర్లు కూడా. ఒకసారి అలవాటుపడితే వెనక్కి రావడం కష్టం. ప్రజల మెదళ్లలో నెగళ్లు రాజేసి, వాళ్లనే ఆలోచనాపరుల్ని చేయనంతకాలం రాజకీయాలను అవుట్సోర్సింగ్‌కి ఇచ్చేయడానికే అలవాటుపడతారు. సమస్యలు వారివి అయినపుడు పరిష్కారాల కోసం ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పని కూడా వారిదే. దానికోసం విస్తృత స్థాయిలో త్యాగాలు చెయ్యనక్కరలేదు. వకాల్తా పుచ్చుకుని ప్రాణ త్యాగాలు చేసినంత మాత్రాన ప్రేక్షకుల ఆలోచనాస్థాయి మారదు. బల ప్రయోగంతో బానిసల్ని చెయ్యగలరు గానీ, బలవంతాన ఎవర్నీ స్వతంత్రుల్ని చెయ్యలేం. ఈ సుదీర్ఘ పోరాట ప్రయోగంతో ‘చితి’కిపోయిన ప్రాణాలకు, కుటుంబాలకు లాల్‌ సలాం.

ఎ.బి. వెంకటేశ్వరరావు

ఇవి కూడా చదవండి

ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్

సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..

Updated Date - Dec 04 , 2025 | 03:26 AM