ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bambu Satyanarayana Sastry: ప్రజాపక్షాన ప్రశ్నించే బాంబు

ABN, Publish Date - Dec 04 , 2025 | 03:15 AM

విలక్షణ భావోద్యమకారుడు మేకా సత్యనారాయణ శాస్త్రి. పేరెన్నికగన్న పత్రికల్లో పనిచేసి కూడా ఎన్నడూ గుర్తింపును ఆశించని అరుదైన పాత్రికేయుడు. జిల్లా కోర్టులు మొదలుకొని సుప్రీంకోర్టు వరకూ...

విలక్షణ భావోద్యమకారుడు మేకా సత్యనారాయణ శాస్త్రి. పేరెన్నికగన్న పత్రికల్లో పనిచేసి కూడా ఎన్నడూ గుర్తింపును ఆశించని అరుదైన పాత్రికేయుడు. జిల్లా కోర్టులు మొదలుకొని సుప్రీంకోర్టు వరకూ అనేక ప్రజాపక్ష వ్యాజ్యాల్లో గెలిచి కూడా వృత్తి న్యాయవాదినని చెప్పుకోని వ్యక్తి. అన్యాయాన్ని ప్రశ్నించి నిగ్గదీసే ఆయన స్వభావానికి తగ్గట్టు ప్రజలు ఆయన్ను ప్రేమగా ‘బాంబు’ అనే పేరుతో పిలుచుకున్నారు. 1955 డిసెంబర్ 4న పార్వతీపురంలో మేకా కృష్ణమూర్తి, కృష్ణవేణి దంపతులకు రెండో సంతానంగా బాంబు జన్మించాడు. విద్యార్థి దశలోనే సామాజిక స్పృహ పెంపొందించుకున్నారు. గాంధేయ వాదం, సోషలిజం పునాదులుగా తన ప్రస్థానాన్ని నిర్దేశించుకున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎన్నో ఉద్యోగాలు చేశారు. నాస్తిక, హేతువాద సంఘాలు మొదలుకొని దళిత బహుజన, మానవహక్కుల సంఘాల వరకూ ఎన్నో సంస్థలతో కలిసి పని చేశారు. పిఠాపురంలో కులమతాలకు అతీతంగా ‘పీస్ హోమ్’ పేరిట సర్వధర్మ సమభావ మానవతా నిలయాన్ని స్థాపించారు.

బాంబు సంచలన జర్నలిస్టు. మహిమలు, అతీత శక్తులు ఉన్నాయని డాంబికాలు పలికిన అనేకమంది బాబాల బండారాన్ని బయటపెట్టారు. మతం వ్యక్తిగతం అని నమ్మిన బాంబు ‘ఆధ్యాత్మికత’ అదేదైనా అందరి క్షేమాన్ని కోరాలని అనేవారు. ముక్కు సూటితనం, నిక్కచ్చితత్వం, నిరాడంబరత కారణంగా అనేక పత్రికల్లో పనిచేసి కూడా జీవితాంతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే ఉన్నారు. ప్రశ్నించే స్వభావాన్ని వదలకుండా, మొక్కవోని స్వేచ్ఛాలోచనాపరుడిగానే బతికిన బాంబు ఓ గొప్ప అవిశ్రాంత సత్యాన్వేషి.

ఇదంతా ఒకెత్తయితే సామాజిక కార్యాచరణలో భాగంగా ఆయన చేసిన విస్తృత ప్రజా ఉద్యమాలు ఒకెత్తు. మద్య వ్యతిరేక ఉద్యమాన్ని గోదావరి జిల్లాల్లో ముందుండి నడిపించారు. మూఢ నమ్మకాలు, చేతబడులు, మహిమలకు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టారు. పెద్ద మల్లాపురం అటవీ ప్రాంతంలో ‘స్పందన’ గిరిజనాభివృద్ధి సంస్థతో చాలాకాలం పనిచేశారు. పిఠాపురంలోని కిర్లంపూడి షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిద సమస్యకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి విజయం సాధించారు. కె.జి బేసిన్ గ్యాస్ నిక్షేపాలను ప్రజాపరం చేయాలని నిరాహారదీక్ష చేశారు. తిరుపతి, అన్నవరం, ద్రాక్షారామం తదితర దేవస్థానాల్లో జరిగే అవకతవకలు వెలికితీయడం నుండి బహుళజాతి సంస్థల శీతల పానీయాలు, తినుబండారాల్లో జరిగే కల్తీ వరకూ... న్యాయస్థానాలలో వందలాది ప్రజాహిత వ్యాజ్యాలు (పిల్స్) వేసి పోరాడారు. మద్యం సీసాల మీద ఎమ్మార్పీ ధర వేయకపోవడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని హైకోర్టులో బాంబు దాఖలు చేసిన కేసు వల్లనే నాటి నుంచి మద్యం సీసాల మీద నిర్ణీత ధరలు వేస్తున్నారు.

సర్వ మానవ సమానత్వమే సిసలైన సనాతన ధర్మం అని నమ్మిన ఆయన, ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా చేశారు. ఎన్నడూ కులతత్వాన్ని పాటించలేదు సరికదా ఎన్నో జంటలకు కులాంతర, మతాంతర వివాహాలు చేశారు. అంతేకాదు, తన కుమారుడికి స్వాతంత్ర్య దినోత్సవం నాడు కులాంతర ఆదర్శవివాహం దగ్గరుండి జరిపించారు. మహోన్నత కార్మిక నేత ఎ.వి.కె చైతన్య, మొట్టమొదటి సోషలిస్టు నేత కందాళ సుబ్రహ్మణ్య తిలక్, హక్కుల నేత ఆచంట లక్ష్మణరావు వంటి మహామహులతో బాంబుకు సత్సంబంధాలు, బాంధవ్యాలు ఉండేవి. పత్రికాధిపతులతో సాన్నిహిత్యం ఉండేది. అయినా, వ్యక్తిగత ప్రయోజనం కోసం వాటిని ఉపయోగించుకోలేదు. ఆయన మీద మాత్రమే కాక, కుటుంబ సభ్యులు, పిల్లల మీద కూడా అక్రమార్కులు కేసులు పెట్టినా, దాడులు చేసినా వేటికీ ఆయన వెరవలేదు, వెన్నుచూపలేదు. 2022 ఫిబ్రవరి 28న బాంబు గుండెపోటుతో పిఠాపురంలో కాలం చేశారు. మరణానంతరం తన కళ్లను, ఇతర అవయవాలను దానమిచ్చారు. చనిపోయే నాటికి ఆయనకు సొంతిల్లు కూడా లేదు. జర్నలిస్టుగా, యాక్టివిస్టుగా, న్యాయవాదిగా, సామాజిక ఆలోచనాపరునిగా, రచయితగా, ఉద్యమకారుడిగా, పర్యావరణవేత్తగా, రాజకీయ విశ్లేషకునిగా, ఆధ్యాత్మికవాదిగా అనేక రంగాల్లో విశేషమైన కృషి చేసిన మేకా సత్యనారాయణ శాస్త్రి, ప్రజల మనసుల్లో ప్రజాపక్షంగా ప్రశ్నించే ‘బాంబు’గా నిలిచిపోయారు.

గౌరవ్

సామాజిక కార్యకర్త

ఇవి కూడా చదవండి

ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్

సచిన్ రికార్డు సాధ్యమయ్యేనా.. కింగ్ కోహ్లీ అరుదైన సెంచరీ ప్రత్యేకతలివే..

Updated Date - Dec 04 , 2025 | 03:15 AM