TET Supreme Court Verdict: సీనియర్ టీచర్లకు టెట్ తిప్పలు
ABN, Publish Date - Oct 15 , 2025 | 01:32 AM
ఉపాధ్యాయులందరూ సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగం నుంచి రిటైర్ కావాలని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది...
ఉపాధ్యాయులందరూ సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులు కావాలని లేదా ఉద్యోగం నుంచి రిటైర్ కావాలని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అయిదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్ కావాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు వెల్లడించింది. 2010 ఆగస్టు 23కు ముందు దేశవ్యాప్తంగా నియామకమైన ఉపాధ్యాయుల్లో దాదాపు 25 లక్షలమంది టీచర్ల ఉద్యోగాలకు టెట్ గండం పొంచి ఉంది. ‘ఉపాధ్యాయులకు ప్రమోషన్ కోసమే కాకుండా సర్వీసులో కొనసాగాలంటే కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాల’ని చెప్తూనే... రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం మానవతా దృక్పథంతో ‘అయిదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు, మిగిలిన వారికి టెట్ పాస్ కావడానికి తీర్పు తేదీ నుంచి రెండేళ్లు సమయం ఇస్తున్నట్లు’ సుప్రీంకోర్టు తెలిపింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో విడుదల చేసిన టెట్ మార్గదర్శకాల ఉత్తర్వులు జీవో 51లోని పేరా–11లోనూ, తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో విడుదల చేసిన టెట్ గైడ్‌లైన్స్ జీవో 36లోని పేరా–12లోనూ... 23 ఆగస్ట్ 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయించినట్లు స్పష్టంగా పేర్కొంది. టెట్ రాయడానికి వయోపరిమితి 18 – 44 ఏళ్లుగా నిర్ణయించింది. అందుకే 2010 నాటికి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు మరొక పోస్టు కోసం ప్రత్యక్ష నియామకం ద్వారా డీఎస్సీ/ టీఆర్టీ రాయాలనుకున్నవారు మినహా ఎవరూ గత 15 ఏళ్లుగా టెట్ రాయాలనే ఆలోచనే చేయలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ప్రమోషన్లలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు 2024 మే 3న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పలు ఉపాధ్యాయ సంఘాలు ఢిల్లీ వెళ్లి NCTE చైర్మన్‌కు విన్నవించాయి. దీంతో రాష్ట్ర విద్యాశాఖ కోరిన విధంగా టెట్ ఎవరెవరికి అవసరమో స్పష్టతనిస్తూ ఆ జాతీయ సంస్థ వివరణ ఉత్తర్వులు (F.No. NCTE/23/2024 – Academic Section– HQ/124856) ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రమోషన్ ద్వారా పాఠశాల స్థాయి మారిన సమయంలో మాత్రమే టెట్ తప్పనిసరి. ‘పీఎస్, హైస్కూలు హెచ్‌ఎం పోస్టులు టెట్ నిబంధనల పరిధిలో లేవు కాబట్టి ప్రమోషన్లు ఇవ్వడానికి టెట్ అవసరమా లేదా అనే అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలి’ అని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. అప్పుడు కూడా సర్వీసులో కొనసాగడానికి టెట్ అవసరమని పేర్కొనలేదు.
సుప్రీంకోర్టు మెయిన్ కేసులో ఉన్న అసలు వివాదం ‘మైనారిటీ విద్యాసంస్థల్లో టీచర్ల నియామకానికి టెట్ అవసరమా? కాదా?’ అన్నది తేల్చకుండా రాజ్యాంగ ధర్మాసనానికి పంపించి, ఉపాధ్యాయులు పదోన్నతి పొందటానికి, సర్వీసులో కొనసాగడానికి టెట్ పాస్ కావాలని తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పు ప్రకారం ఆరేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయుడు రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం నుంచి తొలగించబడతాడు. కానీ అయిదేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయుడు టెట్ మినహాయింపుతో ఆ తర్వాత మూడేళ్లూ సర్వీసులో కొనసాగుతాడు. ఇదొక పెద్ద అనామలీ. టెట్ సిలబస్, అర్హత మార్కుల నిర్ణయం కూడా అశాస్త్రీయంగా ఉంది.
ఉపాధ్యాయుల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి విద్యాహక్కు చట్టం అమలుకు ‘పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి కాకుండా’ సవరణ ఉత్తర్వులు పొందాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్షను ప్రాస్పెక్టివ్‌గా అమలు చేసే విధంగా కేంద్రం ‘విద్యాహక్కు చట్టం– సెక్షన్ 23’ను సవరించాలి. టెట్ సిలబస్‌ను, అర్హత మార్కులను సవరించాలి. టెట్ పరీక్షను ఈ రెండేళ్ళలో వీలైనన్ని ఎక్కువసార్లు నిర్వహించాలి. లేదా ఏపీలో ఇన్ సర్వీస్ టీచర్లకు గతంలో ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్ నిర్వహించిన విధంగా ప్రత్యేక టెట్‌ను నిర్వహించాలి.
చావ రవి, ప్రధాన కార్యదర్శి, ఎస్టీఎఫ్ఐ
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 15 , 2025 | 01:32 AM