Stray Dogs India: వీధికుక్కలపై సుప్రీంది ధర్మాగ్రహమే
ABN, Publish Date - Aug 22 , 2025 | 05:47 AM
ఢిల్లీలో ఉన్న వీధి కుక్కల్ని తరలించి రక్షిత కేంద్రాల్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. వీధి కుక్కల బారిన పడి గాయాల పాలైన, ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి...
ఢిల్లీలో ఉన్న వీధి కుక్కల్ని తరలించి రక్షిత కేంద్రాల్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. వీధి కుక్కల బారిన పడి గాయాల పాలైన, ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఈ విధంగా ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, కారణం పరిశీలిస్తే ఇది ధర్మాగ్రహమే అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇది ఢిల్లీకి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. దేశమంతా ఎదుర్కొంటున్నది. సమస్య ఎంత తీవ్రమైనదంటే తీర్పు వచ్చిన వారంలోనే నాలుగైదు కుక్క కాట్లు, ఒక మరణం సంభవించినట్లు వార్తలొచ్చాయి.
దేశ వ్యాప్తంగా కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క రాజధాని నగరంలోనే అవి పది లక్షలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రాబిస్ మరణాల్లో 37 శాతం భారత్‌లోనే ఉన్నాయి. ఒక్క ఏడాదిలో భారత్‌లో నమోదైన కుక్క కాట్ల కేసులు 37 లక్షలంటే, సమస్య తీవ్రత ఎంతలా ఉందో తెలుస్తోంది. ఇవి నమోదైన లెక్కలు మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో జరిగి, రికార్డ్ కానివి ఇంకా ఎక్కువగా ఉంటాయి. బాధితులు ఎక్కువగా బాలలు, వృద్ధులే.
మనిషికి నేస్తమైన కుక్క... వాటి జనాభా, ఆరోగ్యం విషయాల్లో నిర్వహణా లోపం వల్ల శత్రువుగా పరిణమిస్తోంది. అదుపులేని స్థితికి, ప్రజారోగ్యానికి సవాల్ విసిరే స్థాయికి చేరుకుంటోంది. వీటి జనాభా, ఆరోగ్యం విషయాలు రాష్ట్ర పరిధిలోని అంశాలు. ముఖ్యంగా స్థానిక సంస్థల పాత్ర అధికం. కేంద్రం చట్టాల్ని, కొంత నిధుల సాయాన్ని మాత్రమే చేయగలదు. ఉన్న చట్టాల మేరకు కుక్కల పట్ల కొంత శ్రద్ధ వహించాలి. ఒక ప్రాంతంలో ఉన్న వాటిలో డెబ్భై శాతం వాటిని పట్టుకుని, జనాభా నియంత్రణ శస్త్రచికిత్స చేసి, టీకా వేసి ఆ ప్రాంతంలోనే విడిచి పెట్టాలి. ఈ ప్రక్రియను సరిగా నిర్వహిస్తే వాటి జనాభాతో బాటు, ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. అయితే కింది స్థాయిలో సిబ్బంది కొరత, అలసత్వం, నిధుల లేమితో అలా జరగడం లేదు. ప్రమాదకరంగా, వ్యాధిగ్రస్తంగా తయారైన వాటిని వెంటనే గమనించి తగు చర్యలు తీసుకోవాలి. ఇంట్లో పెంచుకునేవారు కూడా, వాటి ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాలి. ఒక్క స్థానిక సంస్థలకే కాకుండా, జంతు సంరక్షణ సంస్థలకు, సామాన్య ప్రజలకు కూడా ఇందులో బాధ్యత ఉంది. సక్రమంగా వ్యవహరించని స్థానిక ప్రభుత్వాలని, సంబంధిత అధికారుల్ని జవాబుదారీ చెయ్యాలి.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జంతు సంరక్షణ బోర్డు ద్వారా ఒక్కొక్క కుక్కకు శస్త్రచికిత్సకు 800 రూపాయలు చొప్పున, వెటర్నరీ ఆస్పత్రులలో సౌకర్యాలు సమకూర్చుకోవడానికి వన్ టైమ్ నిధులు విడుదల చేస్తామని రాష్ట్రాలకు తెలియజేసింది. రాష్ట్రాలు కూడా సమగ్ర కార్యాచరణ చేపట్టి, సమస్య పరిష్కారం వైపు ఆలోచించాలి. వీధి కుక్కల కోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు నెలకొల్పడం గానీ, నిర్వహించడం గానీ ఆచరణ సాధ్యం కాని విషయం. శాస్త్రీయంగా రుజువైన మార్గాల ద్వారా వాటి జనాభాను అదుపులో ఉంచడం, ఆరోగ్యాన్ని కాపాడడం అవసరం. ఇప్పటికే సమస్య చేయి దాటిపోతున్న కారణంగా అత్యవసరంగా ప్రణాళికల్ని అమలుచేయాలి. విలువైన మానవ ప్రాణాలు వీధి కుక్కల పాలు కాకూడదు. వీటిని సమూలంగా తుడిచిపెట్టేయడం కూడా మానవత్వం కాదు. మచ్చికయిన జంతువుతో సమాజానికి సహాయం జరగాలా, సమస్య రావాలా అన్నది మనిషి చేతిలోనే ఉంది.
డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 22 , 2025 | 05:47 AM