సుప్రీం అంతిమ అస్త్రం ఆర్టికల్ 142
ABN, Publish Date - May 08 , 2025 | 02:12 AM
సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అనే మూడో కన్నును తరచూ తెరవవలసి వస్తున్నది. ముఖ్యంగా పాలకుల, రాజకీయ నాయకుల స్వార్థ క్రీడ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం దాని వినియోగించక తప్పడం లేదు. 2024 ఫిబ్రవరిలో చండీగఢ్ మేయర్ ఎన్నిక...
సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 అనే మూడో కన్నును తరచూ తెరవవలసి వస్తున్నది. ముఖ్యంగా పాలకుల, రాజకీయ నాయకుల స్వార్థ క్రీడ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం దాని వినియోగించక తప్పడం లేదు. 2024 ఫిబ్రవరిలో చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఫలితంలో ఓడిపోయినట్టు ప్రకటించిన ఆప్ అభ్యర్థిని మేయర్ పదవికి ఎన్నికైనట్టు నిర్ధారించింది. అప్పుడు సుప్రీంకోర్టు ఇదే రాజ్యాంగ అధికరణను ప్రయోగించింది. మేయర్ ఎన్నికల నిర్వహణాధికారి అయిన బీజేపీ నాయకుడు అనిల్ మాసి తమ పార్టీకి అనుకూల పరిస్థితులు వచ్చేవరకు పోలింగ్ తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి కోర్టు జోక్యంతో 2024 జనవరి 30న జరిగిన ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఒకవైపు, బీజేపీ అభ్యర్థి మరోవైపు బరిలో మిగిలారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లలో 20 మంది ఆప్ అభ్యర్థికి, 16 మంది బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. కానీ నిర్వహణాధికారి అనిల్ మాసి బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. ఆప్ అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ అతనికి పడిన ఓట్లలో ఎనిమిదింటిని చెల్లనివిగా చేసి బీజేపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. ఇందుకోసం ఆ ఎనిమిది బ్యాలెట్ పత్రాలను తానే స్వయంగా పాడుచేసి వాటిని చెల్లని ఓట్లుగా ప్రకటించారు. ఆ విధంగా మెజారిటీ ఓటర్ల అభీష్టాన్ని కాలరాశారు. ఈ మోసాన్ని గమనించిన సుప్రీం కోర్టు ఆర్టికల్ 142 ద్వారా తనకు సంక్రమించిన విశేష అధికారాలను వినియోగించి బీజేపీ అభ్యర్థి ఎన్నికను రద్దు చేసింది. ఆప్ అభ్యర్థి గెలిచినట్టు తానే ప్రకటించింది.
తమిళనాడు గవర్నర్ దీర్ఘ కాలంగా తన వద్ద ఉంచుకొని బూజు పట్టించిన బిల్లులకు పచ్చ జెండా ఊపిన తాజా తీర్పును కూడా సుప్రీంకోర్టు 142వ అధికరణ నుంచి తనకు సంక్రమించిన ఎదురులేని అధికారాలతోనే ఇచ్చింది. పెండింగ్‌లోని 10 తమిళనాడు బిల్లులూ ఆమోదం పొందినట్టు తానే ప్రకటించింది. న్యాయమూర్తులు జె.బి.పార్థివాలా, ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. రాష్ట్రపతిని సైతం నియమబద్ధం చేయడం ఈ తీర్పులోని విశేషం. తిప్పి పంపిన బిల్లులను శాసనసభ మళ్ళీ ఆమోదించి పంపితే చెప్పుకోదగిన మార్పులుంటే తప్ప వాటిపై గవర్నర్ ఆమోద ముద్ర వేసి తీరవలసిందే అని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్లు తన పరిశీలనకు పంపిన బిల్లులను రాష్ట్రపతి మూడు మాసాలకు మించి తన వద్ద ఉంచుకోరాదనీ చెప్పింది. గవర్నర్లు తనకు పంపే బిల్లులను ముఖ్యంగా వాటి రాజ్యాంగబద్ధత మీద వారు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు రాష్ట్రపతి వాటిని సుప్రీంకోర్టు అభిప్రాయానికి పంపవచ్చునని మహోన్నత న్యాయ స్థానం సూచించింది. రాష్ట్రపతికే గీత గీసిన ఈ తీర్పు సహజంగానే పాలక బీజేపీ అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమైంది. ఆర్టికల్ 142 ప్రజాస్వామ్య శక్తుల మీద ప్రయోగానికి సుప్రీంకోర్టు చేతిలో 24 గంటలూ అమరిన అణు క్షిపణి అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ విరుచుకుపడ్డారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం రాష్ట్రపతినే ఆదేశించడమేమిటని హూంకరించారు. తమిళనాడు బిల్లులపై తీర్పు సందర్భంగా, వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసి, వాటిని నిలిపివేస్తామని చెప్పిన విషయంలోనూ బీజేపీ నేతలు అసహనాన్ని వెళ్ళగక్కుతున్నారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల పరిధుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నదనే నింద దూసుకొచ్చింది.
సుప్రీంకోర్టు తన ముందుకు వచ్చిన కేసులో పరిపూర్ణమైన న్యాయం చేయడం కోసం 142 ఆర్టికల్ దానికి విశేష అధికారాలను కట్టబెట్టింది. అమలులో ఉన్న ఎటువంటి నియమాలను, పద్ధతులనైనా పక్కనబెట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇచ్చింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు 142 ద్వారా బలంగా కాలు మోపి ఉండకపోతే ప్రజాస్వామ్యానికి ఎంత అన్యాయం జరిగి ఉండేదో! ఆ వ్యవహారంలో బీజేపీ పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోయిన బడుద్దాయి విద్యార్థిలా వ్యవహరించింది. ప్రజాస్వామ్య మూల స్తంభాన్ని పెరికివేసింది. ఆర్టికల్ 142 సకాలంలో కలుగజేసుకొని దానిని సరిజేసింది.
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో ప్రజల తీర్పును అమలు కానీయకుండా సైంధవ పాత్ర పోషిస్తున్నారు. అక్కడి ప్రజల సంస్కృతులను విశ్వాసాలను అవహేళన చేస్తున్నారు. బిల్లులను సంవత్సరాల తరబడి ఆపి ఉంచడం ద్వారా రాజ్‌భవన్ పాలనను నడిపిస్తున్నారు. వాటిని అకారణంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం ద్వారా దీర్ఘనిద్రలోకి నెట్టివేస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి దిక్కులు పిక్కటిల్లే స్వరంతో గొంతు చించుకునే కేంద్ర పాలకులు ఉపరాష్ట్రపతిని, తమ ఎంపీలను ప్రజాస్వామ్యం మీదికి ఉసిగొల్పుతున్నారే గాని గవర్నర్లను దారిలో పెట్టడం లేదు. అందుచేతనే సుప్రీంకోర్టు తరచూ 142 కత్తిని ఒరలోంచి తీసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసి వస్తున్నది. ఈ ఆర్టికల్‌ను అణు క్షిపణితో పోల్చాడంటే ఉపరాష్ట్రపతి ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకో అర్థం చేసుకోవచ్చు.
ఆర్టికల్ 142 మొదట్లో 118 అధికరణగా అవతరించింది. దీనిని 1949 మే 27న రాజ్యాంగ సభ ఆమోదించింది. వాస్తవానికి ఈ అధికరణను ఆ రోజున రాజ్యాంగ సభలో చర్చకు పెట్టారు. కానీ ఆ సభ దానిపై చర్చ చేపట్టకుండా నేరుగా ఆమోద ముద్ర వేసింది. పరిపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టుకు ఈ ఆర్టికల్ ద్వారా తిరుగులేని అధికారాలు కట్టబెట్టడం అవసరమేనని భావించి రాజ్యాంగ సభ ఎటువంటి చర్చ చేపట్టకుండా దానిని ఆమోదించిందని స్పష్టపడుతున్నది. అమల్లో గల చట్టాలు మౌనంగా ఉన్నచోట తగిన న్యాయం జరిగేలా చూడ్డానికి ఈ ఆర్టికల్ రూపుదాల్చింది. ప్రత్యేక సందర్భాల్లో ఎటువంటి నియమపాలనతో నిమిత్తం లేకుండా నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారాన్ని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు కట్టబెడుతుంది. ఆ దంపతులను తిరిగి కలిపి ఉంచడం ఎంతమాత్రం సాధ్యం కాని పని అని సుప్రీంకోర్టు సంతృప్తి చెందితే 6–18 నెలల కాలం వేచి చూడవలసిన అవసరం కూడా లేకుండా ఈ అధికరణ కింద నేరుగా విడాకుల ఉత్తర్వులు జారీ చేయవచ్చు. సకాలంలో ఫీజు కట్టలేక ప్రవేశ అర్హత కోల్పోయిన ఒక దళిత విద్యార్థిని ధన్బాద్ ఐఐటీలో చేర్పిస్తూ 2024 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ని ఉపయోగించింది. గతంలో భోపాల్ గ్యాస్ లీకేజీ ఘోర విషాదం కేసు అమలులో గల చట్ట పరిధి దాటి బాధితులకు అధిక పరిహారం చెల్లించేలా యూనియన్ కార్బైడ్ యాజమాన్యాన్ని ఆదేశించడానికి సుప్రీంకోర్టు 142నే ప్రయోగించింది. అయోధ్య వివాదం పరిష్కారంలోనూ, జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండరాదని ఇచ్చిన తీర్పులోనూ, పని స్థలాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి మార్గదర్శకాలు రూపొందించిన సందర్భంలోనూ... ఇంకా అనేక కేసుల్లో ఈ ఆర్టికల్ ఉపయోగపడింది. ప్రభుత్వాలు గాని, సంస్థలు గాని రాజ్యాంగాన్ని కాదని ఇష్టానుసారంగా వ్యవహరించడానికి సాహసించినప్పుడు ఆర్టికల్ 142కి పని చెప్పక తప్పని పరిస్థితి సుప్రీంకోర్టుకు కలుగుతున్నది. అంతేకాదు, రాజ్యాంగ మౌలిక నిర్మాణం సిద్ధాంతం పార్లమెంటు కంటే సుప్రీంకోర్టును ఉన్నతమైనది చేస్తున్నది.
కేశవానంద భారతి, కేరళ ప్రభుత్వం కేసులో 7:6 మెజారిటీ తీర్పు ద్వారా అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ మౌలికత సిద్ధాంతాన్ని స్థిరపరచింది. కొన్ని రాజ్యాంగ మౌలిక లక్షణాలను రాజ్యాంగ సవరణల ద్వారానైనా మార్చే హక్కు ఉండదని స్పష్టం చేసింది. పార్లమెంటు చేసిన అటువంటి రాజ్యాంగ సవరణలను సుప్రీంకోర్టు రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజ్యాంగానికి గల సర్వోత్కృష్టత, చట్టబద్ధ పాలన, ఫెడరలిజం, సెక్యులరిజం, న్యాయవ్యవస్థ స్వాతంత్య్రం, ప్రాథమిక హక్కులు వంటివి కొన్ని రాజ్యాంగ మౌలిక లక్షణాల కిందికి వస్తాయి. అందుచేత న్యాయవ్యవస్థ కంటే పార్లమెంటే గొప్పది, ఆర్టికల్ 142 అక్రమమైనది అనే వాదనలతో ఎంతమంది ధన్‌ఖడ్‌లు గింజుకున్నా ప్రయోజనం ఉండదు. అయితే అధికార పార్టీకి చెందిన ఇటువంటి ఉత్సవ విగ్రహాలు చీటికి మాటికి న్యాయ వ్యవస్థపై దాడికి సమకట్టడం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు ఉల్లంఘనలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి ముప్పునే సూచిస్తున్నాయి.
గార శ్రీరామమూర్తి
సీనియర్ పాత్రికేయులు
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Updated Date - May 08 , 2025 | 02:12 AM