India China Relations: చైనాతో భారత్ వ్యూహాత్మక చెలిమి
ABN, Publish Date - Sep 16 , 2025 | 01:46 AM
‘అమెరికాతో శత్రుత్వం ప్రమాదకరం. అయితే, అమెరికాతో స్నేహం ప్రాణాంతకం’ అని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి, అంతర్జాతీయ రాజనీతిజ్ఞుడు హెన్రీ కిస్సింజర్ ఓ సందర్భంలో అన్నారు. అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వస్తువులపై...
‘అమెరికాతో శత్రుత్వం ప్రమాదకరం. అయితే, అమెరికాతో స్నేహం ప్రాణాంతకం’ అని అమెరికా విదేశాంగశాఖ మాజీ మంత్రి, అంతర్జాతీయ రాజనీతిజ్ఞుడు హెన్రీ కిస్సింజర్ ఓ సందర్భంలో అన్నారు. అమెరికాకు భారత్ ఎగుమతి చేసే వస్తువులపై ఆ దేశం 50 శాతం సుంకాలు విధించడాన్ని బట్టి అది నిజమని మరోసారి నిరూపితమైంది. భారతదేశానికి అమెరికా గొప్ప మిత్ర దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నో సందర్భాల్లో ప్రకటించారు. తనకు ట్రంప్ గొప్ప స్నేహితుడని, భారత్–అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కావడం తన ఘనతేనని కూడా చెప్పుకొన్నారు. అయితే, మోదీ అర్థం చేసుకోవాల్సిన వాస్తవం బోలెడుంది. అధ్యక్ష పీఠం మీద ఎవరు కూర్చున్నా అమెరికా అమెరికానే. ఆ దేశ విదేశాంగ విధానం దాని ప్రయోజనాల కేంద్రంగానే ఉంటుంది తప్ప, ప్రపంచం కోణం నుంచి కాదు.
ఈ మధ్య కాలంలో అమెరికా మనకు బాగా సన్నిహితమైందంటే దానికి కారణం చైనాయే. డ్రాగన్ దూకుడును నిలువరించడానికి అమెరికాకు భారత్ అవసరమైంది. భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికి వీలవుతుందని అగ్రరాజ్యం భావించింది. అందులో భాగంగానే భారత్‌తో సత్సంబంధాలను పెంచుకున్నది. ఇది గుర్తించని మన ప్రధానమంత్రి అమెరికాలో ట్రంప్‌కు మద్దతుగా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇది భారత విదేశాంగ విధానంలో ఊహించని మార్పు.
ఇక చైనా విషయాన్నే చూద్దాం. నా ఇటీవలి పర్యటనలో మౌలిక సదుపాయాల కల్పనలో చైనా ప్రగతిని చూస్తే ఆశ్చర్యమనిపించిది. మూడు దశాబ్దాల్లోనే చైనా పేద దేశం నుంచి ప్రపంచ పారిశ్రామిక పవర్‌హౌజ్‌గా ఎదిగింది. మరే దేశంతోనూ సంబంధం లేకుండానే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించింది. మనం వాడే గూగుల్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్, పేమెంట్ వ్యవస్థలను కాకుండా చైనా తమ ప్రజల కోసం ప్రత్యేక యాప్‌లను సొంతంగా తయారు చేసుకున్నది. ప్రపంచానికి కావలసిన అరుదైన ఖనిజాలన్నీ చైనా నుంచే ఎగుమతి అవుతున్నాయి. కంప్యూటర్లలో వాడే మైక్రోచిప్‌ల తయారీలో ఇవి కీలకం. సాంకేతికత, సమాచార భద్రత, బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇలా అన్నిరకాల సేవలకు మైక్రోచిప్‌లు కావాల్సిందే. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఈ చిప్‌లపై ఆధారపడబోతున్నాయి. ఈ అంశంలో చైనాకు అరుదైన ఖనిజాల రూపంలో ప్రకృతి వరం ప్రసాదించింది.
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం భారత్ – అమెరికా సంబంధాలకు, మోదీ – ట్రంప్‌ల స్నేహానికి పరీక్షగా నిలిచింది. వాస్తవానికి అమెరికా కంటే రష్యా దౌత్యపరంగా భారత్‌కు ఎంతో కీలక దేశం. రక్షణ అవసరాలపరంగా రష్యాపైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతున్నది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో, భారత్‌కు వ్యతిరేకంగా ఐరాసలో జరిగిన చర్చల్లో, ఓటింగ్ సమయాల్లో రష్యా మనకు మద్దతుగా నిలిచింది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షలను కూడా దాటుకొని భారత్ రష్యా వద్ద చమురు కొంటున్నది. ఇది ట్రంప్ ఆగ్రహానికి కారణమై, భారత్‌పై సుంకాలతో విరుచుకుపడుతున్నారు.
నెహ్రూ కాలం నుంచి పీవీ నరసింహారావు హయాం వరకు భారత్ అన్ని దేశాలతో సమదూరం (అలీన విధానం) పాటించింది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఓ వైపు అమెరికా కూటమి, మరోవైపు సోవియట్ కూటమి ఉన్న సమయంలోనూ భారత్ సమదూరం పాటించింది. టెక్నాలజీ అంతగా లేని కాలంలో ఈ విధానం బాగానే పనిచేసింది. కానీ, ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతున్నది. ఆహార పదార్థాలు, చమురు, వాణిజ్య అవసరాల కోసం ఒక దేశంపై మరో దేశం ఆధారపడక తప్పని పరిస్థితి. మరోవైపు, అమెరికా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ పవర్ సెంటర్ క్రమంగా మారుతున్నది. ఆసియాలో చైనా శక్తిమంతంగా మారి అమెరికాకు సవాలు విసురుతున్నది. పశ్చిమ దేశాల్లోనూ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఈ తరుణంలో భారత్ కూడా తన విదేశాంగ విధానాన్ని క్రమంగా మార్చుకుంటూ వచ్చింది. అలీన విధానం (నాన్ అలైన్‌మెంట్) నుంచి అన్ని దేశాలతో ‘సత్సంబంధాలు’ (మల్టీ అలైన్‌మెంట్) అనే విధానాన్ని ఎంచుకున్నది. అందుకే ఏక కాలంలో అమెరికా, చైనా, రష్యా దేశాలతో సంబంధాలు కొనసాగించింది. 2020 వరకు ఇది బాగానే సాగింది. ఆ ఏడాది జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
గల్వాన్ ఘర్షణతో భారత్, చైనా మధ్య దూరం పెరిగింది. అమెరికాకు ఇండియా మరింత దగ్గరైంది. అయితే, విదేశాంగ విధానం కంటే ట్రంప్–మోదీ స్నేహం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అదే సమయంలో భారత్‌ను అమెరికా వ్యూహాత్మకంగా చైనా వ్యతిరేక కూటములు, చర్యల్లో భాగస్వామిని చేయడం ప్రారంభించింది. గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో దేశీయంగానూ మోదీకి పెద్దగా వ్యతిరేకత ఎదురవ్వలేదు. కానీ, ఇజ్రాయెల్–గాజా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలతో అంతర్జాతీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ యుద్ధాల్లో భాగస్వాములైన అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగిన భారతదేశం ప్రస్తుతం నిర్ణాయక కూడలిలో నిలబడింది. ఈ సందర్భంలో భారత్ వ్యూహాత్మకంగా స్వయం ప్రతిపత్తితో వ్యవహరించాలి. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాలి. మిత్ర దేశాల (అమెరికా) ఒత్తిడికి తలొగ్గవద్దు.
ప్రస్తుతం ప్రపంచం మల్టీ పోలార్ వరల్డ్‌గా మారుతున్నది. మరోవైపు, సైబర్ ముప్పు పెరుగుతున్నది. ఏఐ, అంతరిక్షంలో పోటీతత్వం మొదలైంది. సార్వభౌమత్వ పరిధి అనేది భౌగోళిక సరిహద్దులను మించిపోయింది. సముద్ర జలాలపై ఆధిపత్యం, సమాచార, సాంకేతిక సార్వభౌమత్వం, సప్లయ్ చైన్ సెక్యూరిటీ ప్రపంచ దేశాల ఆర్థికవ్యవస్థలకు అత్యంత కీలకంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదాల కారణంగా చైనాను దూరం చేసుకోవడం భారత్‌కు శ్రేయస్కరం కాదు. చర్చల ద్వారా సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుంటూనే చైనాతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలి. అంతేకాకుండా మోదీ ప్రచారం చేస్తున్న ఆత్మనిర్భరతను ఆచరణలో వేగవంతం చేయాలి. ఆర్థికంగా బలపడినప్పుడే సార్వభౌమత్వం సాధ్యపడుతుంది. వాస్తవానికి అమెరికాకు చైనానే గట్టి పోటీదారు. కానీ, మిత్రదేశమైన ఇండియాపైన విధించిన సుంకాలను ట్రంప్ చైనాపై విధించే సాహసం చేయలేకపోయారు. దీనికి కారణం, చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం, ప్రపంచ సప్లయ్ చైన్‌లో దాని వాటా. దీన్ని మనం గమనించాలి. చైనాతో సత్సంబంధాలను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను మోదీ ఆలస్యంగానైనా గుర్తించినట్టున్నారు. ట్రంప్ సుంకాల హూంకరింపుల వేళ ఆయన చైనాకు వెళ్లి ఎస్‌సీవో సదస్సులో పాల్గొన్నారు. తద్వారా, అమెరికా ఒత్తిడికి తలొగ్గబోమన్న సంకేతం ఇచ్చారు. ఇది భారత విదేశాంగ విధానంలో కీలక మలుపు. ఈ స్వయం నిర్ణయాధికారాన్ని మోదీ అలాగే కొనసాగించాలి. అలా కాకుండా, ‘మీరు మమ్మల్ని దూరం చేసుకుంటే మేం చైనాకు దగ్గరవుతాం’ అని సందేశం ఇవ్వకూడదు. చైనాతో భారత్ నిజమైన, పరస్పర విశ్వాసం పెంపొందేలా స్నేహ సంబంధాలు కొనసాగించాలి.
‘మన మిత్రులను మనం ఎంచుకోవచ్చు. కానీ, మన పొరుగున ఎవరుండాలన్నది మనం నిర్ణయించలేం. వారిని మార్చలేం’ అని వాజపేయి అనేవారు. చైనా మన పొరుగు, శక్తిమంతమైన దేశమన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎన్ని విభేదాలున్నా దాన్ని విస్మరించలేమన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవాలి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాల పెంపు కోసం రెండు దేశాల్లోని ప్రధాన నగరాల మధ్య నేరుగా విమాన సర్వీసులను నడిపించాలి. రెండు దేశాల పౌరులకు ప్రత్యేకమైన వీసా సౌకర్యాలు కల్పించాలి. భారతీయ విద్యార్థులకు చైనాలో మెరుగైన అవకాశాలు లభించేలా మాండరిన్ భాష నేర్పించాలి. చైనా సంస్థలతో వ్యాపార సంబంధాలు పెరగాలి. ఈ క్రమంలో న్యాయపరమైన సవాళ్లు ఎదురైతే పరిష్కరించుకోవడానికి భారతదేశంలోని న్యాయసంస్థలు చైనా చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. భారత విద్యార్థులు చైనాలోని విద్యాసంస్థలను, చైనా విద్యార్థులు భారత విద్యాసంస్థలను సందర్శించేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా రెండు దేశాల సంస్కృతులపై నవతరానికి అవగాహన వస్తుంది. ఇది ద్వైపాక్షిక సంబంధాల్లో ఎంతో దోహదం చేస్తుంది. ఈ కార్యక్రమాలను చేపడుతూనే జాతీయ నాయకత్వం బ్రిక్స్, ఎస్‌సీవో లాంటి సదస్సుల్లో తరచుగా పాల్గొని భారత్ గొంతుకను వినిపించాలి.
బోయినపల్లి వినోద్‌కుమార్
పార్లమెంటు మాజీ సభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For TG News And Telugu News
Updated Date - Sep 16 , 2025 | 01:46 AM