Jubilee Hills By Election: టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
ABN , Publish Date - Sep 15 , 2025 | 08:07 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే.. ఆ ప్రభావం మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై.. మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఉంటుందని ఇప్పటికే ఆ యా పార్టీల అధినేతలంతా భావిస్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికలో గెలిచి.. జూబ్లీహిల్స్‌లో తమ ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదని మిగలిన పార్టీలకు బలమైన సాంకేతాలు అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రంగంలోకి దిగారు. ఆ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నేతలతో ఆయన సమావేశమవుతున్నారు.
సోమవారం ఉదయం 11. 00 గంటలకు తెలంగాణ భవన్‌లో వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో ఆయన భేటీ కానున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై డివిజన్ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు డివిజన్ల వారీగా ఇప్పటికే పలువురు నేతలను బీఆర్ఎస్ పార్టీ నియమించింది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు.
అదీకాక.. ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం నేతలతోపాటు పార్టీలోని కీలక నేతలు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చట్టాలని వారికి సీఎం స్పష్టం చేశారు. గత పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి డొల్లా అని ప్రజల్లోకి వెళ్లాలని వారికి సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేస్తుందని ఇప్పటికే నేతలకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
2023లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ గెలుపొందారు. అయితే గతంలో సైతం ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పలుమార్లు విజయం సాధించారు. అనారోగ్య కారణంగా ఇటీవల ఆయన మరణించారు. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇక ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య సునీతను బరిలో దింపేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఆలోచన చేస్తుందనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం.. నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ కూడా అభ్యర్థి ఎవరనేది మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ వర్సెస్ టీడీపీ మహిళా ఎంపీ
పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను
For TG News And Telugu News