Share News

M Modi Slams Congress: పాక్‌ ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ దన్ను

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:47 AM

కాంగ్రె్‌సకు ఓటుబ్యాంకు రాజకీయాలే ప్రధానమని.. జాతి ప్రయోజనాలు దానికి పట్టవని ప్రధాని మోదీ విమర్శించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో.. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)ల్లోని...

M Modi Slams Congress: పాక్‌ ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ దన్ను

భారత సైన్యానికి మాత్రం మద్దతివ్వలేదు జాతి వ్యతిరేకులు, చొరబాటుదార్లకు అండ ఓటుబ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం అసోం పర్యటనలో ప్రధాని మోదీ ఆగ్రహం శివభక్తుడిని.. హాలాహలం మింగగలను ప్రజలే నా యజమానులు.. దేవుళ్లు: మోదీ

  • ఓటుబ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం

  • చొరబాట్లతో సరిహద్దు రాష్ట్రాల జనాభా కూర్పు మార్చేందుకు కుట్రలు

  • జాతీయ భద్రతకు ఇది ముప్పు

  • అసోం పర్యటనలో ప్రధాని మోదీ ఆగ్రహం

  • శివభక్తుడిని.. హాలాహలం మింగగలను

  • ప్రజలే నా యజమానులు.. దేవుళ్లు: మోదీ

మంగల్‌దోయీ, సెప్టెంబరు 14: కాంగ్రె్‌సకు ఓటుబ్యాంకు రాజకీయాలే ప్రధానమని.. జాతి ప్రయోజనాలు దానికి పట్టవని ప్రధాని మోదీ విమర్శించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో.. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)ల్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి ఆ పార్టీ మద్దతివ్వలేదని.. పైగా పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాదులకు అండగా నిలిచిందని ఆరోపించారు. ఇవాళ చొరబాటుదారులకు, జాతి వ్యతిరేక శక్తులకు ఆ పార్టీ అతిపెద్ద సంరక్షకురాలిగా మారిందని.. వారు దేశంలో శాశ్వతంగా ఉండిపోవాలని భావిస్తోందన్నారు. ఈశాన్య భారత పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన అసోంలోని దరంగ్‌ జిల్లా మంగల్‌దోయీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చొరబాట్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో భూమిని ఆక్రమించుకుని జనాభా కూర్పును మార్చే కుట్రలు జరుగుతున్నాయని.. ఇది జాతీయ భద్రతకు ప్రమాదమని.. దీనిని బీజేపీ అనుమతించదని తేల్చిచెప్పారు. అసోం భూమిపుత్రుడు, ప్రసిద్ధ గాయకుడు భూపేన్‌ హజారికాకు కేంద్రం దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారత రత్న’ ప్రకటించినప్పుడు.. బీజేపీ గాయకులకు, డాన్సర్లకు అవార్డులిస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడొకరు చేసిన వ్యాఖ్యల వీడియోను సీఎం హిమంత బిశ్వ శర్మ శనివారం రాత్రి తనకు చూపారని ప్రధాని తెలిపారు. ‘1962లో చైనా దురాక్రమణ సమయంలో నాటి ప్రధాని నెహ్రూ అసోం ప్రజలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు మాయని మచ్చలా మిగిలాయి.


ఇప్పుడు హజారికాకు భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్‌ ఆయనకు చేసిన అవమానం పుండుపై కారం చల్లినట్లుగా ఉంది. ఇది నన్నెంతో బాధిస్తోంది’ అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉగ్రవాదం, అశాంతికి కాంగ్రెసే కారణమన్నారు. అసోం వారసత్వాన్ని, చిహ్నాలను విస్మరించిందని చెప్పారు. రాష్ట్రంలో చొరబాటుదార్లు ఆక్రమించుకున్న భూమిని విముక్తి చేసి.. స్థానిక రైతులు సాగు చేసే అవకాశం కల్పిస్తున్నారని సీఎం హిమంతను ప్రశంసించారు. చొరబాటుదార్ల నుంచి అసోంను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు. 21వ శతాబ్దంలో పాతికేళ్లు గడచిపోయాయని.. తదుపరి అధ్యాయం ఈశాన్య, తూర్పు భారతాలదేనని స్పష్టంచేశారు. దేశాభివృద్ధికి, పిల్లల ఉజ్వల భవిష్యత్‌ కోసం స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని పిలుపిచ్చారు. కాగా.. మంగల్‌దోయీలో ప్రధాని రూ.5,300 కోట్ల విలువ చేసే ఆరోగ్య, మౌలిక వసతుల ప్రాజెక్టులకు, రూ.1,200 కోట్లతో 2.9 కిలోమీటర్ల పొడవైన నరేంగీ-కురువా వంతెనకు శంకుస్థాపన చేశారు. దరంగ్‌ వైద్య కళాశాల-ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు. కామరూప్‌, దరంగ్‌ జిల్లాలు, మేఘాలయలోని రీ భోయ్‌లను కలుపుతూ 118.5 కిలోమీటర్ల పొడవైన గౌహతి రింగ్‌రోడ్డు ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. దీని అంచనా వ్యయం రూ.4,530 కోట్లు.

చమురు దిగుమతుల నియంత్రణ

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ముడిచమురు, గ్యాస్‌ కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని ప్రధాని చెప్పారు. ఈ దిగుమతులు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని నుమాలిగఢ్‌ ర్యాలీలో తెలిపారు. నుమాలిగఢ్‌లో తాను ప్రారంభించిన బయో ఇథనాల్‌ రిఫైనరీతో రైతులు, గిరిజనులకు మేలు కలుగుతుందన్నారు.


బిహార్లో నేడు మోదీ పర్యటన

ప్రధాని మోదీ సోమవారం ఉత్తర బిహార్లోని పూర్ణియాలో పర్యటించనున్నారు. రూ.36 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. పూర్ణియాలోనే కొత్తగా అభివృద్ధిచేసిన ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన జాతీయ మఖానా (తామర విత్తనాలు) బోర్డును కూడా ప్రారంభించనున్నారు.

శివభక్తుడిని.. హాలాహలం మింగగలను

బిహార్లో ఇటీవల కాంగ్రెస్‌, ఆర్‌జేడీలు తనను, తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మోదీ ప్రస్తావించారు. ‘నేను శివభక్తుడిని.. దూషణల హాలాహలాన్ని మింగుతాను. నేను ప్రజల ముందు బాధపడుతుంటే.. యావత్‌ కాంగ్రెస్‌ ఎకోసిస్టమ్‌ నాపై దాడిచేస్తుందని తెలుసు. ప్రజలే నా యజమానులు.. దేవుళ్లు.. నా రిమోట్‌ కంట్రోల్‌. వారి ముందు గాకపోతే ఎవరి ముందు నా బాధ చెప్పుకొంటాను? నా వద్ద మరే రిమోట్‌ కంట్రోలూ లేదు’ అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..

అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు

నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 15 , 2025 | 06:47 AM