Special Revision: సర్ సమస్యకు తప్పుడు పరిష్కారం
ABN, Publish Date - Aug 21 , 2025 | 06:12 AM
ఓటర్ జాబితాలలోని సమస్యలకు ప్రత్యేక సమగ్ర సవరణే (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –ఎస్‌ఐఆర్) పరిష్కారమని భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇది పాత వాదనే...
ఓటర్ జాబితాలలోని సమస్యలకు ప్రత్యేక సమగ్ర సవరణే (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ –ఎస్‌ఐఆర్) పరిష్కారమని భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇది పాత వాదనే. అయితే బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో మోసాలను రాహుల్‌గాంధీ బహిర్గతం చేసిన తరువాత ప్రత్యేక సమగ్ర సవరణే నిశ్చితమైన పరిష్కారమని సీఈసీ మరింతగా నొక్కి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు వలలో పడ్డాడని బీజేపీ సామాజిక మాధ్యమాల గణాలు భావించాయి. ఓటర్ జాబితాలలోని లొసుగుల గురించి ఆయనెలా ఫిర్యాదు చేస్తున్నారు? వాటన్నిటినీ ప్రక్షాళన చేసేందుకే చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణకు ప్రతిపక్షనేత ఎందుకు మద్దతునివ్వడం లేదు? ఇత్యాది ప్రశ్నలు గుప్పించాయి. సీఈసీ సైతం ఇదే ఆలోచనాసరళిని అనుసరించారు. మూడు రోజుల క్రితం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు ఆ విషయాన్ని స్పష్టం చేసింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బహుశా, ‘యస్ మినిస్టర్’ను చూసి ఉండకపోవచ్చు. ఆ సుప్రసిద్ధ రాజకీయ వ్యంగ్య ధారావాహిక ఆ అప్రమాణిక ఆలోచనా సరళిని ‘రాజకీయవేత్త తర్క పద్ధతి’ అని అభివర్ణించింది. అదిలా ఉంటుంది. ‘మనం ఏదో ఒకటి చేయాలి; ఆ నిర్దిష్ట పని ఇదే; కనుక మనం దాన్ని చేయాలి’. ఒక మౌలిక ప్రశ్నను అడగకపోవడమే ఈ ఆలోచనా సరళిలోని తార్కిక దోషం: మనం చేయవలసిన ఆ ‘ఏదో ఒకటి’, మనం చేయవలసిన ‘నిర్దిష్ట పని’గా మనకు సూచించినదేనా? రాహుల్‌గాంధీని అపహసిస్తున్నవారు సరిగ్గా అడగని ప్రశ్న ఇదే: మనం చేయవలసిన పని ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ఓటర్ జాబితాలలోని లొసుగులు, మోసాలు, తప్పులను తొలగించేందుకు చేపట్టవలసిన ‘నిర్దిష్ట చర్యేనా?’ సమాధానమేమిటి? ఇదీ అని భావిస్తే సరిపోదు. మన ఓటర్ జాబితాలలోని సమస్యలకు ప్రత్యేక సమగ్ర సవరణ తప్పనిసరి, తగిన ఫలితాలనిచ్చే సరైన పరిష్కారమనే నమ్మకం దురదృష్టవశాత్తు ఎవరికీ కలగడం లేదు. అయినా సీఈసీ వాదనను, దానిలో తర్క బద్ధత ఉందని భావించి, నిశితంగా పరీక్షిద్దాం.
మన ఓటర్ జాబితాలలో తీవ్ర లోపాలు ఉన్నాయని అంగీకరిస్తూ మన తార్కిక విమర్శను ప్రారంభిద్దాం. ఓటర్ జాబితాల ‘సమగ్రత’ విషయంలో భారత ఎన్నికల వ్యవస్థ ప్రశస్తంగా ఉందనడంలో సందేహం లేదు. అయితే ఆ జాబితాల ‘కచ్చితత్వం’ లేదా ‘నిర్దుష్టత’ ఉండవలసిన రీతిలో లేదనేది ఒక వాస్తవం. ఇదేమీ కొత్త సమస్యకాదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఓటర్ జాబితాలలో కచ్చితత్వం ఉండవలసిన రీతిలో ఉండడం లేదు. ఆ జాబితాలలో మార్పులు, చేర్పుల విషయమై ఆరోపణలు పెద్దగా లేకపోవడం వల్ల వాటిలో కచ్చితత్వం తక్కువగా ఉందన్న వాస్తవం ప్రజల దృష్టికి రాలేదు. మహారాష్ట్ర, మహదేవపురలో ఓటర్ జాబితాలలోని మోసాలను బహిర్గతం చేసిన తరువాత ఆ తీవ్ర లోపం దేశవ్యాప్తంగా ప్రజల దృష్టికి వచ్చింది.
ఓటర్ జాబితాలలో లొసుగులు, లోపాలు తొలగించేందుకు ఎన్నికల సంఘం గత కొద్ది సంవత్సరాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న సీఈసీ వాదనను కూడా అంగీకరిద్దాం. యథాలాపంగాచేసే ఓటర్ జాబితాల సవరణ పరిష్కారం కాదు, కాబోదు. ఎందుకని? పౌరబాధ్యతల స్పృహ ఉన్నవారు తమ పేర్ల చేర్పుకు లేదా తీసివేతకు లేదా దిద్దుబాటుకు, నివాస ప్రదేశాల మార్పు గురించి తెలియజేయడానికి నివేదించిన అభ్యర్థనలకే ఈ సవరణ ప్రక్రియ పరిమితమవుతుంది. వార్షిక సంగ్రహ సవరణ మెరుగైనది. భారీ సంఖ్యలో చేర్పులు, తీసివేతలను సమగ్రంగా సమీక్షించేందుకు ఈ ప్రక్రియలో అవకాశమున్నది.. అయినా ఇది కూడా సంతృప్తికరమైన పరిష్కారం కాదు. ఎందుకని? ఈ సంగ్రహ సవరణ సమయంలో బీఎల్‌ఓ (పోలింగ్ బూత్ స్థాయి అధికారి) ప్రతి ఇంటికి వెళ్లి యథార్థాలు తెలుసుకోవలసిన అవసరముండదు. ఏమైనా ప్రస్తుత విధానంలో సంవత్సరాలుగా అనేక లొసుగులు లోపాలు కొనసాగుతున్నాయి.
ఈ వాస్తవాల దృష్ట్యా పరిస్థితులను చక్కదిద్దేందుకు ఒక నిర్దిష్ట చర్య చేపట్ట వలసిన అవసరమున్నది. ఆ నిర్దిష్ట చర్య మరింత సమగ్రంగా, క్రమబద్ధంగా ఉండాలి. అదే సమయంలో అది మరింత పారదర్శకంగా, న్యాయబద్ధంగా కూడా ఉండితీరాలి. సాధారణ సవరణలు, వార్షిక సంగ్రహ సవరణలతో పాటు ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టవలసిన అవసరమున్నది. ఈ ప్రత్యేక సమగ్ర సవరణలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలి. కొత్త ఓటర్లను నమోదు చేయాలి. మృతులు, ఇతర ప్రదేశాలకు వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించాలి. ఇలా ఓటర్ జాబితాలను సవరించవలసి ఉన్నది. ఇదంతా ప్రామాణిక పద్ధతులలో జరగాలి. మరి బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఈ బాధ్యతలనే నిర్వర్తిస్తున్నది కదా అని ఆ ప్రక్రియను సమర్థిస్తున్నవారు తప్పక ప్రశ్నిస్తారు. నేను వారితో ఏకీభవించడం లేదు. వాస్తవమేమటంటే ఎన్నికల సంఘం బిహార్‌లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణకు మనకు అవసరమైనదీ, మన ఎన్నికల చట్టాలను రూపొందించినవారు ఉద్దేశించిందీ కాదు. ఈ ‘ప్రత్యేక’ సమగ్ర సవరణ తప్పనిసరైనదీ కాదు, ఓటర్ జాబితాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సరిపోయేదీ కాదు. అనవసరంగా స్టెరాయిడ్లు, ప్రమాదకరమైన పదార్థాలు కలిసిన ఔషధమది. మనం ఎదుర్కొంటున్న సమస్యకు ఆ ‘సర్’ పరిష్కారం కాదు. అది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఇప్పటికే చేసింది కూడా. బిహార్ ‘సర్’ ఎన్నికల చట్టం ఉద్దేశ్యంతో గానీ, ప్రత్యేక సవరణ స్ఫూర్తితో గానీ ముడివడి ఉన్న ప్రక్రియ కాదు. ఈ విషయాలను మరింత వివరంగా పరిశీలిద్దాం.
బిహార్‌లో చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రకారం సంభావ్య ఓటర్లు అందరూ ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తిచేసి ఇవ్వాలి. ఇవ్వనిపక్షంలో తమంతట తామే ఓటరుగా నమోదు అయ్యేందుకు అనర్హులవుతారు. భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని నిబంధన ఇది. దీనికి ఏ విధమైన చట్ట ప్రాతిపదిక లేదు. చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నా వాస్తవానికి మన ఎన్నికల వ్యవస్థలో ఒక మౌలిక మార్పు అని చెప్పి తీరాలి. గతంలో ఓటర్ల నమోదుకు ప్రభుత్వమే చొరవ చూపేది. ఇప్పుడు ఓటరుగా నమోదు కాదలుచుకున్న వారే అందుకు సొంతంగా శ్రద్ధ చూపాలి. అంటే వయోజనులను ఓటరుగా నమోదు చేసే బాధ్యత ఎన్నికల అధికారులకు ఉండదు. ప్రత్యేక సమగ్ర సవరణ ఆ బాధ్యతను ఓటర్ల పైనే మోపింది. ఓటర్ల నమోదులో ఇటువంటి మార్పు పర్యవసానాలు ఎలా ఉంటాయి? పేద ప్రజలు, అవిద్యావంతులు, వలస జీవులు, మైనారిటీలు, మహిళలు ఓటర్లుగా నమోదు కావడం గణనీయంగా తగ్గిపోతుందనేది పలు దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రతి ఒక్క సంభావ్య ఓటర్ కూడా ఓటరుగా నమోదయ్యేందుకు తన అర్హతను నిరూపించుకునేందుకై వివిధ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి తీరాలి. ఓటర్‌గా నమోదయేందుకు పలు డాక్యుమెంట్లను విధిగా సమర్పించవలసిరావడమనేది ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఈ కొత్త నిబంధనకు చట్టబద్ధమైన ఆధారమేమీ లేదు. అంతేకాదు పౌరసత్వ భావనను వ్యతిరేకిస్తుంది. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రకారం ఓటరుగా నమోదుకాగోరువారు తమ తల్లిదండ్రుల పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలు సమర్పించాలి. ఇది పౌరసత్వ భావనను తారు మారు చేస్తుంది. తన పౌరసత్వాన్ని రుజువు చేసుకునే బాధ్యతను ఓటర్‌పైనే మోపుతుంది. ఈ అసంబద్ధతల సంచిత ప్రభావం సామూహికంగా ఓటుహక్కు తొలగింపు అనడంలో సందేహం లేదు. ఎన్నికల సంఘం నిర్దేశించిన అసంబద్ధ నిబంధనల వల్ల చాలామంది తమ ఓటుహక్కును కోల్పోతారు. బిహార్‌లో ‘సర్’ సాధిస్తుంది ఇదే కాదూ? ప్రత్యేక సమగ్ర సవరణ విధిగా ఓటర్ జాబితాల కచ్చితత్వాన్ని మెరుగుపరిచి తీరాలి. కానీ అలా జరగడం లేదు. ఈ బాధ్యతపై అసలు శ్రద్ధ పెట్టడం లేదని కూడా చెప్పాలి. ప్రతి ఇంటికీ వెళ్లి నిర్వహించే ఎన్యూమరేషన్‌లో తొలగింపులకు ఇచ్చే ప్రాధాన్యాన్ని అదనపు చేర్పులకు కూడా ఇవ్వాలి. బిహార్‌లో ఇలా జరగలేదు. జూన్ 25– జూలై 25 మధ్య నిర్వహించిన ఎన్యూమరేషన్‌లో 65 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లను ఓటర్ జాబితాల నుంచి తొలగించారు. అయితే అదనంగా ఒక్క పేరును కూడా ఆ జాబితాలలో చేర్చలేదు. నిజంగా ఇది సమగ్ర సవరణ కానేకాదు. అది సమగ్ర తొలగింపు ప్రక్రియ. ఇదొక నిష్ఠుర సత్యం.
ఓటర్ జాబితాల నుంచి నిర్దిష్ట ఓటర్ల పేర్లు తొలగించే ముందు వారు ‘మృతులు’, ‘ఇతర ప్రదేశాలకు శాశ్వతంగా వెళ్లిపోయినవారు’, ‘జాడ తెలియడం లేదు’ అని నమోదు చేసేముందు ఎన్నికల సంఘం నెలకొల్పిన సవివరమైన మార్గదర్శకాలను అనుసరించి ఉండవల్సింది. ఈ ప్రకారం ప్రామాణిక చట్టబద్ధ ప్రక్రియ (నోటీస్, విచారణ, అప్పీల్)ను అనుసరించి ఉన్నట్టయితే చాలా మంది ‘మృత’ ఓటర్ల ఫిర్యాదులకు గురికావల్సిన ఇబ్బంది ఎన్నికల సంఘంకు ఇప్పుడు ఉండేదికాదు.
ఓటర్ జాబితాల నాణ్యతను నిర్ధారించేందుకు వాటిని స్వతంత్ర తనిఖీకి నివేదించి ఉండవల్సింది. వాటి ‘సంపూర్ణత్వం’పై సమాచారమున్నది గానీ, వాటి ‘కచ్చితత్వం’పై సమాచారం లేదు. సువ్యవస్థిత, ఉన్నత ప్రమాణాల గణాంకాల వ్యవస్థలు ఉన్నా మన ఓటర్ జాబితాల నాణ్యత నిర్ధారణ లోపభూయిష్ఠంగా ఉండడం భారత్‌కు అప్రతిష్ఠాకరం. జనన మరణాల రిజిస్టర్‌పై స్వతంత్ర నమూనా తనిఖీ ఉన్నట్టుగానే ఓటర్ జాబితాల విషయంలో కూడా ఉండి తీరాలి. ప్రత్యేక సమగ్ర సవరణతో పాటు ఓటర్ జాబితాలలోని మోసాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై న్యాయసమ్మతమైన, విశ్వసనీయ విచారణ కూడా జరగాలి. అయితే ఈ విచారణ ఓటర్ జాబితాలను రూపొందించే బాధ్యతలలో పాల్గొంటున్న వారిచే జరిపించకూడదు. ఇది జరిగే పనేనా? ఎన్నికల సంఘం అందుకు అనుమతించదని చెప్పవచ్చు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఈ వార్తలు కూడా చదవండి..
వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను అరెస్ట్
Read Latest AP News and National News
Updated Date - Aug 21 , 2025 | 06:12 AM