Sanatan Dharma or Social Justice: సనాతనమా సామాజిక న్యాయమా
ABN, Publish Date - Oct 16 , 2025 | 03:38 AM
భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై నిండు న్యాయస్థానంలో ఆయన విధి నిర్వహణలో ఉండగా జరిగిన బూటు దాడి అత్యంత ఆందోళనకరమైనది. దీని మీద దేశంలో ఆశించిన స్థాయిలో నిరసన వ్యక్తం కాలేదు. ముఖ్యంగా రాజ్యాంగ రక్షణ...
భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై నిండు న్యాయస్థానంలో ఆయన విధి నిర్వహణలో ఉండగా జరిగిన బూటు దాడి అత్యంత ఆందోళనకరమైనది. దీని మీద దేశంలో ఆశించిన స్థాయిలో నిరసన వ్యక్తం కాలేదు. ముఖ్యంగా రాజ్యాంగ రక్షణ బాధ్యత గల ప్రభుత్వం నుంచి, పాలక పక్షం నుంచి తగిన స్థాయిలో ఖండన వెల్లడి కాలేదు. ఈ దాడి చేసిన లాయర్ రాకేశ్ కిశోర్ సనాతన ధర్మాన్ని ప్రస్తావించారు. దానిని కాపాడడమే తన దాడి ఉద్దేశమని స్పష్టం చేశారు. నేడు దేశాన్ని పాలిస్తున్నవారు అదే ధర్మానికి అండగా నిలబడినవారు కావడం ఇక్కడ గమనించవలసిన విషయం. తాను కూడా దళితుడనేనని 71 సంవత్సరాల రాకేశ్ కిశోర్ ప్రకటించారు. దళిత కోణానికి ఎక్కువ ప్రాధాన్యం లభించకుండా చూడడానికి ఈ దాడి చేయించినవారు అందుకు దళితుడినే ఉపయోగించారని భావించవచ్చు.
ఈ వివాదం నేపథ్యంలోకి వెళ్తే– ఖజురహోలో ముఖం తొలగించిన దేవతామూర్తి విగ్రహం తాను ఇష్టంగా ఆరాధించే విష్ణువు విగ్రహమనీ, దానిని పూర్వస్థితికి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలనీ కోరుతూ రాకేశ్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో దావా వేశారు. ఈ విగ్రహం మధ్యప్రదేశ్‌లోని ఖజురహో సముదాయంలోని జవారి ఆలయంలో ఉన్నది. ఖజురహో ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ – యునెస్కో పరిధిలోనిది. మొగలాయీల కాలంలో దెబ్బతిన్నదని చెబుతున్న ఈ విగ్రహం శతాబ్దాలుగా భారత పురా సర్వే సంస్థ (Archeological Survey of India– ఏఎస్‌ఐ) నిరాదరణకు గురి అవుతున్నదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. తమ ఇష్టదైవం పరిపూర్ణ విగ్రహాన్ని ఆరాధించడానికి భక్తులకు గల ప్రాథమిక హక్కును ఇది ఉల్లంఘిస్తున్నదని అన్నారు. దేశ పౌరులకు ఆరాధనా స్వేచ్ఛను హామీ ఇస్తున్న రాజ్యాంగం 25వ అధికరణ కింద జనహిత వ్యాజ్యాన్ని పిటిషనర్ దాఖలు చేశారు.
దీనికి సమాధానంగా ‘ముఖం కోల్పోయిన పురాతన విగ్రహాన్ని అలాగే ఉంచవలసిన బాధ్యత తమపై ఉన్నదనీ, దాని స్థానంలో కొత్త దానిని చేర్చడం పురా సంపద పరిరక్షణ నియమాలనూ, ఆ మేరకు గల అంతర్జాతీయ వారసత్వ నిబంధనలనూ ఉల్లంఘించడమే అవుతుంద’నీ ఏఎస్‌ఐ స్పష్టం చేసింది. జస్టిస్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం ఇదే విషయాన్ని విశదీకరించి పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యం అనడానికి బదులు ప్రచార ప్రయోజన వ్యాజ్యం (publicity interest litigation) అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ‘మీరు గాఢమైన విష్ణుభక్తుడినని చెప్పుకుంటున్నారు కాబట్టి విగ్రహ పునరుద్ధరణకు ఆయన్నే ప్రార్థించండి’ అని విచారణ సమయంలో పిటిషనర్‌ను ఉద్దేశించి జస్టిస్ గవాయ్ అన్నారని తెలిసింది. ‘‘సనాతన ధర్మాన్ని అవహేళన చేయడాన్ని సహించబోము’’ అని లాయర్ రాకేశ్ కిశోర్ బూటు విసురుతూ అరిచారు.
తనపై దాడి సమయంలో గవాయ్ మెచ్చుకోదగిన ప్రశాంతతను, పరిణతిని ప్రదర్శించారు. ఆయన తలచుకుంటే రాకేశ్ కిశోర్ అరెస్టుకు ఆదేశించి ఉండవచ్చు, ఆగ్రహోదగ్రులు కావొచ్చు. కాని కోపం తెచ్చుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. పైపెచ్చు ‘‘ఇటువంటి ఘటనలను పట్టించుకోవద్దు, మేమూ పట్టించుకోవడం లేదు, ఇటువంటివి నన్ను ప్రభావితం చేయజాలవు’’ అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యా తీసుకోవద్దని కోర్టును ఆదేశించారు. అప్పటికీ పిటిషనర్ ఆధ్యాత్మిక విశ్వాసాలను, దైవ భక్తిని సీజేఐ అవహేళన చేశారనీ భక్తుల మనోభావాలను గాయపరిచారనీ ఆరోపించేవారు ఉంటారు. అత్యున్నత న్యాయస్థానం దేశ సెక్యులర్ మనుగడకు అభయమిచ్చే రాజ్యాంగానికి రక్షణ కోట. దేశంలోని ప్రార్థనాలయాలు స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఏ స్థితిలో ఉన్నాయో వాటిని అలాగే కొనసాగనివ్వాలని చెప్పుకున్న గాఢ సంకల్పానికి విరుద్ధంగా సాగుతున్న మతోన్మత్తత సమాజాన్ని విభజించి ఎంత అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నదో సీజేఐకి తెలుసు. అటువంటి మరో విపత్తు తలెత్తరాదన్న జాగరూకతతోనే పిటిషనర్‌ను నిరుత్సాహపరిచే వ్యాఖ్యలను ఆయన చేశారని బోధపడుతున్నది. విగ్రహాలను చెక్కేసి వాటి రూపు రేఖలను కప్పిపుచ్చి అన్యమత విగ్రహాలుగా మార్చడం గురించి చాలా చర్చ జరిగింది. బౌద్ధ విగ్రహాలను హిందూ దేవతల విగ్రహాలుగా మార్చారనే విమర్శ కొత్తది కాదు. ప్రస్తుత కేసులో విష్ణు విగ్రహంగా పిటిషనర్ పేర్కొంటున్న విగ్రహం కూడా బుద్ధ విగ్రహం అయి ఉంటే ఆశ్చర్యపోవలసినపని లేదని కొందరు మేధావుల అభిప్రాయం.
ఈ కేసులో పిటిషనర్ తన వాదనకు మద్దతుగా పేర్కొన్న రాజ్యాంగ అధికరణ 25 గురించి చూద్దాం. ఎటువంటి విశ్వాసాన్నైనా కలిగివుండే స్వాతంత్ర్యాన్ని భారత పౌరులకు ఈ అధికరణ ఇస్తున్నది. అలాగే శాంతిభద్రతలకు భంగం వాటిల్లని రీతిలో తన మతాన్ని అవలంబించే, దానిని ప్రచారం చేసుకునే స్వేచ్ఛనూ ప్రసాదిస్తున్నది. భారత రాజ్యాంగం 49వ అధికరణ జాతీయ ప్రాధాన్యం గల విగ్రహాలు, కళాఖండాలు, స్థలాలు మున్నగువాటిని కాపాడే బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతున్నది. తవ్వకాల్లో, ఇతరత్రా లభించిన విగ్రహాలను దొరికినవాటిని దొరికినట్టు భద్రపరచవలసిన బాధ్యత ఇందులో ఇమిడి ఉంది. వాటికి ఎటువంటి మార్పులు చేసినా సీజేఐ అన్నట్టు దానివల్ల వాటి సాధికారత దెబ్బతింటుంది. ఇది ఆర్టికల్ 49కి విరుద్ధం.
సర్వమత సమానత్వాన్ని కాంక్షించే రాజ్యాంగాన్ని విఫలం చేయించడానికి బీజేపీ పడుతున్న తాపత్రయం తెలిసిందే. సనాతనం కుల వ్యవస్థను పెంచి పోషించిందనీ, మెజారిటీ ప్రజలను శారీరక శ్రమకు పరిమితం చేసి, వారిని, స్త్రీలను విద్యకు, జ్ఞానానికి దూరంగా ఉంచిందనీ సామాజిక న్యాయవాదులు స్పష్టం చేస్తుండగా, సనాతనవాదులు అది ఎలా అబద్ధమో చెప్పలేకపోతున్నారు. కులవివక్ష, స్త్రీలపై అణచివేత అంతరించి దేశం ముందుకు పోవాలంటే సనాతనం వెనుకడుగు వేయాలి. దానిని కాపాడుకోవలసిన అవసరమేమిటో సనాతనవాదులు చెప్పలేకపోతున్నారు. దానికి బదులు ప్రగతివాదులపై దాడులకు సమకడుతున్నారు.
జస్టిస్ గవాయ్ ఇటీవల వియత్నాంలో ఒక సభలో మాట్లాడుతూ, కింది కులంలో పుట్టిన తాను రాజ్యాంగం వల్లనే సమానత్వాన్ని చవి చూసి పైకి వచ్చానని చెప్పుకున్నారు. ఇంత కాలానికి సనాతనాన్ని పునరుద్ధరించాలని కోరే శక్తులది పైచేయి అయింది. కింది కులాలకు అందిన ఈ సౌభాగ్యాన్ని వారికి దూరం చేసి దానిని నిర్మూలించాలని అవి చూస్తున్నాయి. సామాజిక దోపిడీని స్థిరపరచిన సంప్రదాయాన్ని, సనాతనాన్ని కనుమరుగు చేయడానికి అవసరమైన సాంస్కృతిక విప్లవం మన దేశంలో చోటుచేసుకోకపోవడమే ఇందుకు ముఖ్య కారణం. చైనాలో మావో తెచ్చిన సాంస్కృతిక విప్లవాన్ని ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా అది తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని గుర్తించకుండా ఉండలేం. అది చైనా సమాజంలోని సంప్రదాయ సామాజిక శ్రేణులను, హెచ్చు తగ్గులను తొలగించింది. శతాబ్దాలుగా ఊడలు తన్నుకున్న ఫ్యూడల్ ఆధిపత్య వర్గాల కాడిని కిందికి దించి, వారికి ప్రశ్నించడం నేర్పి గ్రామీణుల చేతి ఆయుధమైంది. అంతవరకు ఉన్నతవర్గాల గుప్పెట్లోగల విద్య, జ్ఞానం ప్రజాపరం అయ్యేలా చేసింది. హేతువుకు, శాస్త్రీయ విద్యకు ప్రాణం పోసింది. మన దేశంలో కూడా అటువంటిది రెక్క విప్పుకోవాలి. సనాతన వాదుల ఉక్కు కౌగిట్లో రాజ్యాంగనీతి విలవిలలాడుతున్నది. దీని ఫలితమే సీజేఐపై బూటు దాడి.
గార శ్రీరామమూర్తి
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 16 , 2025 | 03:38 AM