Unnao Rape Case: ఇదేమి న్యాయం
ABN, Publish Date - Dec 26 , 2025 | 12:41 AM
కుల్‌దీప్‌సింగ్ సెంగార్ అనే ‘ఉన్నావ్’ ఉన్మాదిని ఢిల్లీ హైకోర్టు వదిలేసినందుకు దేశం ఆగ్రహిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన అత్యాచార ఘటనలో శిక్షపడిన ఈ బీజేపీ మాజీ ఎమ్మెల్యే– ఏవో కొన్ని నిర్వచనాలు...
కుల్‌దీప్‌సింగ్ సెంగార్ అనే ‘ఉన్నావ్’ ఉన్మాదిని ఢిల్లీ హైకోర్టు వదిలేసినందుకు దేశం ఆగ్రహిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన అత్యాచార ఘటనలో శిక్షపడిన ఈ బీజేపీ మాజీ ఎమ్మెల్యే– ఏవో కొన్ని నిర్వచనాలు, సాంకేతిక కారణాలు అడ్డుపెట్టుకొని–శిక్ష నుంచి సులువుగా తప్పించుకోవడం సమాజానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. సమస్తవ్యవస్థల సమర్థతనీ, మానవత్వాన్నీ, న్యాయాన్నీ పరీక్షించిన కేసు ఇది. సర్వోన్నత న్యాయస్థానం రంగంలోకి దిగితే తప్ప దర్యాప్తులు, విచారణలు వేగం పుంజుకోని, కొలిక్కిరాని కేసు ఇప్పుడు ఏకంగా కొట్టుకుపోవడం విషాదం. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కొందరు న్యాయవాదులు కేసు వేయడంతోపాటు, సీబీఐ కూడా ఆ దిశగా అడుగులు వేస్తూండటం ఉపశమనం కలిగించే పరిణామాలు.
బాధితురాలు మళ్ళీ న్యాయం కోసం పోరాడవలసి వస్తోంది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని కోర్టు అర్ధంతరంగా వదిలేసినందుకు నిరసనకు దిగిన బాధితురాలిని, ఆమె తల్లిని పారామిలటరీ బలగాలు ఈడ్చిపారేశాయి. న్యాయం కోరుతున్నవారిపట్ల అన్యాయంగా, అమానవీయంగా వ్యవహరించాయి. ఉన్నావ్‌లో ఉండాల్సిన ఆమెకు దేశరాజధానిలో ఏమి పని అంటూ, ఆమె మళ్ళీ రాజకీయం చేస్తున్నదన్న అర్థంలో బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సోనియా, రాహూల్‌ని కలిసినంతమాత్రాన ఇన్ని దీర్ఘాలు తీయనక్కరలేదు. ప్రధానినీ, హోంమంత్రినీ కలుసుకొని తన గోడుచెప్పుకోవాలన్న ఆమె అభీష్టం నెరవేర్చడానికి బీజేపీ నాయకులు సహకరిస్తే ప్రజలు మరీ సంతోషిస్తారు. కుల్‌దీప్‌సింగ్ సెంగార్ జైలు నుంచి బయటకు వస్తే తన చావు ఖాయమన్న ఆమె భయం సరైనది. అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్‌సింగ్ అప్పటికి మైనర్ అయిన ఈ బాధితురాలిని ఎత్తుకుపోయి, నిర్బంధించి అనేకరోజులు పాటు అత్యాచారానికి పాల్పడటమే కాదు, ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశాడు. సెంగార్, ఆయన మనుషుల చేతికి చిక్కుతూ, తప్పించుకుంటూ, మరోపక్క పోలీసు రక్షణ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించక ఆమె నిత్యం నరకం అనుభవించింది. స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుకు నిరాకరించి, మహాశక్తిమంతుడైన సెంగార్‌తో రాజీపడమనేవారు. ఒక బలమైన నాయకుడిపై అలుపెరగని పోరాటం చేస్తున్నందుకు ఈ బలహీనురాలు కన్నతండ్రినీ కోల్పోయింది. రెండు దశాబ్దాల నాటి అక్రమ ఆయుధాల కేసును తవ్వితీసి పోలీసులు అతడిని స్టేషన్‌కు తెచ్చి, సెంగార్ ముఠాతో కలసి చావగొట్టారు.
తండ్రిని రక్షించుకోవడం కోసం ఈమె ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఆత్మాహుతికి సిద్ధపడిన మర్నాడే అతను పోలీసు దెబ్బలతో మరణించాడు. దేశం యావత్తూ అట్టుడికిపోవడంతో బీజేపీ ఎట్టకేలకు అతడిని సస్పెండ్‌చేసింది. వేలాదిమంది మద్దతుదారులు, ఠాకూర్ నేతల సమక్షంలో సెంగార్ అరెస్టు సైతం ఎంతో ఆర్భాటంగా గౌరవంగా జరిగింది. జైల్లో పడ్డాక కూడా అతడు తన వేట ఆపలేదు. 2019 జూలైలో ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. కేసులో ప్రధానసాక్షి అయిన ఆమె అత్తతో పాటు మరో సమీప బంధువు మరణించారు. న్యాయవాదికి తీవ్రగాయాలైనాయి. చావుబతుకుల మధ్య ఉన్న బాధితురాలు ఢిల్లీ ఎయిమ్స్‌లో అనేక నెలలు చికిత్స తీసుకుంది. ఈ ఘటనకు ముందే సెంగార్ మనుషుల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉన్నదని ఆమె లేఖ రాసినా, అది తనకు చేరనందుకు అప్పటి సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ రంజన్‌గోగోయ్ తెగ ఆశ్చర్యపోయారు. సెంగార్‌పై నమోదైన అత్యాచారం, హత్యాయత్నం ఇత్యాది కేసులన్నీ సుప్రీంకోర్టు చొరవతో ఆ తరువాత ఢిల్లీకి తరలినప్పటికీ, సీబీఐ అనంతరకాలంలో వెనకడుగువేసి హత్యారోపణను ఉపసంహరించుకుంది. పోలీసులు, సీబీఐ సక్రమంగా వ్యవహరించనందుకు తప్పుబడుతూనే ట్రయల్ కోర్టు సెంగార్‌కు జీవితఖైదు విధించింది. చావును జయించి బాధితురాలు అతికష్టంమీద సాధించిన ఆ న్యాయాన్ని ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు లాగేసుకుంది. ఎమ్మెల్యే ప్రభుత్వాధికారి కాదు, కనుక పోక్సో చట్టంలో సెక్షన్ 5 వర్తించదన్న కారణంతో అతడి జీవిత ఖైదును సస్పెండ్ చేసింది. సమస్త వ్యవస్థలూ కలసికట్టుగా తొక్కిపెట్టినా, ఎదురొడ్డి పోరాడిన ఆమెను బలహీనపడకుండా కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్‌లో రిజెక్ట్.. సీన్ కట్ చేస్తే.. డబుల్ సెంచరీ చెలరేగాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. మరో హిందువు దారుణ హత్య..
Updated Date - Dec 26 , 2025 | 12:41 AM