Akhlaq Lynching Case: భయపెడుతున్న మౌనం
ABN, Publish Date - Nov 19 , 2025 | 02:06 AM
దేశంలో గో రక్షకుల ఉన్మాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మహమ్మద్ ఆఖ్లాఖ్ హత్యకేసులో నిందితులందరిపైనా ఆరోపణలు ఉపసంహరించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది....
దేశంలో గో రక్షకుల ఉన్మాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మహమ్మద్ ఆఖ్లాఖ్ హత్యకేసులో నిందితులందరిపైనా ఆరోపణలు ఉపసంహరించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ ఏలుబడిలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ నోయిడా పరిధిలోని బిసహాడ గ్రామానికి చెందిన యాభైరెండేళ్ళ ఆ వృద్ధుడి మూకహత్య జరిగిన దశాబ్దం తరువాత, అతడిని కొట్టిచంపిన వారిమీద అప్పట్లో పెట్టిన అన్ని ఆరోపణలనూ ప్రభుత్వం వెనక్కుతీసుకుంటున్నట్టు స్థానిక సెషన్స్‌కోర్టులో దరఖాస్తు దాఖలైంది. ఆగస్టు 26న తయారైన ఆదేశాలను గవర్నర్ ఇప్పటికే అనుమతించిన మేరకు ప్రభుత్వ న్యాయవాది కోర్టులో ఈ అభ్యర్థన దాఖలు చేశారు. దేశాన్ని కుదిపేసిన ఈ దారుణానికి అక్కడి బీజేపీ నాయకుడి కుమారుడు నాయకత్వం వహించాడు. ఈ వర్థమాన రాజకీయనాయకుడి ఆధ్వర్యంలో అఖ్లాఖ్ ఇంటి సమీపంలో నివసిస్తూండేవారే ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన రెండుమూడేళ్ళలోనే నిందితులంతా బయటకు వచ్చేసి, పదేళ్ళుగా నత్తనడకనసాగుతూ నామమాత్రంగా మిగిలిన ఈ కేసుమీద యోగి ప్రభుత్వం సమ్మెటదెబ్బ వేసింది.
ఇంతకూ యూపీ ప్రభుత్వం ఏ కారణాలతో ఈ కేసు ఉపసంహరించుకుంది? అఖ్లాఖ్ కుటుంబం చీటికీమాటికీ తన వాదనలూ సమాధానాలూ మార్చేస్తోందట. పోనీ, నిందితులు మారణాయుధాలతో దాడి చేశారా? కానేకాదు. బాధితుడికీ, నిందితులకు మధ్య పాతకక్షలున్నాయా? లేనేలేవు. వీరంతా దశాబ్దాలుగా సయోధ్యతో ఉన్నవారే. ఈ యువ గోరక్షకులు ఎక్కడపడితే అక్కడ తంతూవుంటే, అందివచ్చినవాటిని ఆయుధాలుగా వాడి శరీరాన్ని చీల్చేస్తూంటే, పుటుక్కున ప్రాణాలు వదిలేసిన ఆ ముసలి ముసల్మాన్‌తో వీరెవ్వరికీ కక్షలూ, కార్పణ్యాలూ లేవు. అందువల్ల, ఇంతటి బలమైన కారణాలు ఉండగా కేసు ఇంకా కొనసాగించడమేమిటని యోగి ప్రభుత్వం అనుకుంది. నిందితులమీద పెట్టిన హత్య, హత్యాయత్నం వంటివే కాదు, తీవ్రంగా గాయపరచడం, భౌతికదాడితో అవమానించడం, నేరపూరిత బెదిరింపు ఇత్యాది అనేకానేక సెక్షన్లు కూడా ఎత్తివేస్తేనే తగిన న్యాయం చేసినట్టవుతుందని యోగి ప్రభుత్వం భావించింది. పకడ్బందీగా పెద్దతలకాయలందరి సంతకాలతో, 321వ సెక్షన్ వాడుకొని పూర్తిగా కేసుమూసేయడానికి సిద్ధపడింది.
గోవును చంపి, మాంసాన్ని తెచ్చి అఖ్లాఖ్ తన ఫ్రిజ్‌లో దాచుకున్నాడన్న వాదనతో అతడినీ, కుమారుడినీ ఈ మూక ఇంట్లోనుంచి బయటకు లాగి కొట్టడం ఆరంభించింది. వారు దాడికి ఉపక్రమించగానే, అక్కడే ఉన్న గుడి లౌడ్‌స్పీకర్ ద్వారా అఖ్లాఖ్ గోహత్యకు పాల్పడ్డాడంటూ అదేపనిగా ప్రచారం కొనసాగింది. ఓ ఇరవైమంది మంద, అడ్డేవారూ ఆపేవారూ లేకుండా యథేచ్ఛగా సంహారాన్ని కొనసాగించింది. పదేళ్ళక్రితం అఖ్లాఖ్ హత్య జరగ్గానే కదిలిపోయి, రగిలిపోయిన దేశం, ఇప్పుడు కేసు ఉపసంహరణ నిర్ణయంమీద మౌనంగా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మూకదాడులు, అసహనం, గోమాంసం ఇత్యాది అంశాలమీద ప్రజాక్షేత్రంలో చర్చలు, మీడియా చానెళ్ళలో వాదోపవాదాలు సాగడమే కాదు, ‘నాట్ ఇన్ మై నేమ్’ తరహా ర్యాలీలు, అవార్డు వాపసీలతో దేశం కదిలిపోయింది. అన్ని రంగాలకు చెందిన మేధావులు, బాలీవుడ్ నటులు గళం విప్పారు. టెలివిజన్ చానెళ్ళు ఆగ్రహంతో ఊగిపోయాయి. ప్రధాని కాస్తంత ఆలస్యంగానే అయినా, విచారం వెలిబుచ్చవలసి వచ్చింది. గోరక్షణ పేరిట ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే ఇటువంటి దాడులను నియంత్రించనిపక్షంలో ఈ ఉన్మాదానికీ అడ్డూఆపూ ఉండబోదన్న హెచ్చరికలు ఆ తరువాత అనేకసార్లు నిజమైనాయి. వెలిసిపోయిన పాస్‌పోర్టు సైజ్ ఫోటోలో అమాయకంగా కనిపించే అఖ్లాఖ్ మొఖం మతోన్మాదానికీ, మూకదాడులకూ ప్రతీకగా మిగిలిపోయింది. అఖ్లాఖ్ మరణం నిజం కాదా? ఆ వృద్ధుడు వీరి చేతుల్లో మరణించలేదని యోగి ప్రభుత్వం అంటోందా?వంటి ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కానీ, అఖ్లాఖ్ కుటుంబానికి కనీస న్యాయం కాదు, ఘోరమైన అవమానం, అన్యాయం చేసినా నేటి సమాజం తమను నిలదీయదన్న ధైర్యం ఈ పదేళ్ళలో పాలకులకు బాగా ఒంటబట్టిందని అర్థం.
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News
Updated Date - Nov 19 , 2025 | 02:06 AM