Debate Over Renaming MGNREGA: ఉపాధికి కొత్త రూపు
ABN, Publish Date - Dec 17 , 2025 | 04:11 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుమార్పుకు వ్యతిరేకంగా డిసెంబరు 17న దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీజీ చిత్రపటాలతో ఈ నిరసన...
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుమార్పుకు వ్యతిరేకంగా డిసెంబరు 17న దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీజీ చిత్రపటాలతో ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహించబోతున్నదట. ప్రధాని మోదీకి గాంధీ ఆలోచనలు, పేదలు హక్కులు నచ్చవని, సరిగ్గా ఇరవైయేళ్ళక్రితం కాంగ్రెస్ తెచ్చిన ఈ బృహత్‌పథకం గాంధీజీ గ్రామస్వరాజ్ దార్శనికతకు సజీవరూపమే కాక, కోట్లాది మంది గ్రామీణపేదలకు జీవనాధారంగా నిలిచిందని, కొవిడ్ మహమ్మారి కాలంలో ఆర్థికభద్రత కల్పించిందని రాహుల్‌గాంధీ గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే పలువిధాల బలహీనపడిన ఈ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చివేయడానికి నిర్ణయించుకుంది. ‘జీ రామ్ జీ’ అంటూ బీజేపీ తన కొత్త పథకంలో గాంధీ పేరుతోపాటు, మొత్తం ఉపాధికే ఎసరుపెట్టబోతోందని కాంగ్రెస్ హెచ్చరిక.
ఊపాధికి హామీపడిన పాతచట్టాన్ని ఉపసంహరించడం వెనుక అనేక సరికొత్త ఆదర్శాలూ లక్ష్యాలూ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. రెండు దశాబ్దాలనాటి పరిస్థితులు ఇప్పుడు గ్రామాల్లో లేవు కనుక, మారిన సామాజికార్థిక వాస్తవాలకు అనుగుణంగా బిల్లును తీర్చిదిద్దామని ప్రభుత్వం అంటోంది. గాంధీ పథకం కంటే ఈ రామ్ జీ పథకం మెరుగైనదని, మరింత ఉపాధినిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో తాగు, సాగునీటి వనరులను మెరుగుపరుస్తుందని, ఉమ్మడి వసతులు, మౌలికసదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం దక్కుతుందని ప్రభుత్వం చెబుతోంది. పేరు ఎందుకు మార్చాలన్న కాంగ్రెస్ ప్రశ్నను అటుంచితే, గత పథకం ఆదర్శాలూ, ఆశయాలు ఈ కొత్త పథకంలో నీరుగారి, స్ఫూర్తి కొనసాగని పక్షంలో ప్రజలు కచ్చితంగా ప్రశ్నిస్తారు. కొత్తబిల్లులో ఈ పథకం మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ పెరిగిందని, ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులన్న అంశం సహా చాలా అధికారాలు కేంద్రం దఖలుపరచుకోవడం ప్రమాద సంకేతాలని విపక్షాలు అంటున్నాయి.
ఇటీవలే ఈ పథకం పేరును పూజ్యబాపు గ్రామీణ్‌రోజ్‌గార్ యోజనగా మార్చి, పనిదినాల సంఖ్యను నూటపాతిక చేసి, ఒక రోజు కనీసవేతనాన్ని 240 రూపాయలకు సవరించిన ప్రభుత్వం ఇంతలోనే మనసు ఇలా ఎందుకు మార్చుకుందో తెలియదు. కార్మికచట్టాలను లేబర్ కోడ్స్‌గా మార్చేసినట్టుగా, ఈ పేర్లమార్పిడి ఉద్యమంలో భాగంగానే ఇదీ జరిగిందని అనుకోలేం. పథకం అమలయ్యే ఆయా రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాలను కేంద్రమే ఎంపికచేయడం, ఏయే రాష్ట్రాల్లో ఎంతమేరకు అమలు జరగాలో నిర్దేశించడం, కేటాయించే నిధుల పరిమాణాన్ని నిర్ణయించడం వంటివి గాంధీ పథకం దిశదశ పూర్తిగా మారాయనడానికి నిదర్శనం. పదిశాతం వాటాకే బొక్కబోర్లాపడుతున్న రాష్ట్రాలు ఇకపై నలభైశాతం బరువు నెత్తినెత్తుకోవడంతోనే పథకం ఎంత ఘనంగా సాగబోతోందో అర్థమవుతుంది. పనులు, వాటి తీరుతెన్నులు, నిలిపివేత సమయాలు, కేటాయించే నిధులూ సర్వమూ ముందుగానే నిర్ణయమైపోతున్నందున ఇంతకాలమూ డిమాండ్ ఆధారిత పథకంగా ఉన్నది కాస్తా సప్లయ్ ఆధారితమైపోతోంది. సంక్షేమం ఒక హక్కుగా ఉన్న గాంధీ పథకాన్ని మోదీ ప్రభుత్వం దాతృత్వ కార్యక్రమంగా నీరుగార్చిందని విమర్శకులు అంటున్నారు. పంచాయితీలు, రాష్ట్రాల చేతుల్లోంచి నిర్ణయాధికారాలను స్వాధీనం చేసుకుంటున్న కేంద్రం, అనేకరెట్ల ఆర్థికభారాన్ని మాత్రం రాష్ట్రాల మీద రుద్దింది. రాజ్యాంగబద్ధంగా దక్కిన పనిహక్కును ఈ కొత్తబిల్లుతో కార్మికులు కోల్పోతున్నారు. ఇప్పటివరకూ స్వగ్రామంలోనే ఉపాధిని డిమాండ్ చేసి సాధించుకున్న గ్రామీణులు ఇకపై తమ గ్రామానికి కేంద్రం పని కేటాయించని పక్షంలో వలస పోవలసి రావచ్చు. పథకం పేరులో ఇంకా గ్యారంటీ మిగిలివున్నా, లోతుగా చూస్తే దేనికీ గ్యారంటీ లేని రీతిలో మార్పు తెలివిగా జరిగింది. కొత్తచట్టంతో రాష్ట్రాల మీద యాభైవేలకోట్ల రూపాయల అదనపు భారం పడవచ్చునని ఓ అంచనా.
బిల్లు ఉపసంహరించుకోవాలన్న విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకున్నా, స్టాడింగ్ కమిటీకి పంపి అది తన చిత్తశుద్ధిని రుజువుచేసుకోవచ్చు. సభాముఖంగా విస్తృతమైన చర్చలు జరిపి, తదనుగుణమైన మార్పుచేర్పులు చేసి, అన్ని పార్టీల మద్దతుతో బిల్లును గట్టెక్కించినప్పుడే ఈ భారీ ప్రజాసంక్షేమ పథకం విలువ, గౌరవం నిలబడతాయి. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ గాంధీ పేరు ఇష్టంలేక తొలగించినా, తమకు ఎంతో ప్రీతిపాత్రమైన ‘రామ్’ అన్న సంక్షిప్త రూపాన్ని ఉపయోగిస్తున్నందుకైనా పాలకులు ఈ కొత్తపథకం ద్వారా నిరుపేదలకు, అన్నార్తులకు అన్యాయం జరగకుండా చూస్తే అంతే చాలు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News
Updated Date - Dec 17 , 2025 | 04:11 AM