ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

S R Sankaran: పేదల పక్షపాతి

ABN, Publish Date - Oct 22 , 2025 | 12:23 AM

ప్రజలను పురుగుల్లా చూసే నాయకులు, అధికారులు ఉన్న ఈ రోజుల్లో ఎస్‌.ఆర్‌. శంకరన్‌ జీవితాన్ని గుర్తు చేసుకోవడం ఎంతయినా అవసరం. నిరుపేదల ఐఏఎస్‌గా పేరు తెచ్చుకొన్న ఆయన సేవలు అనితరసాధ్యమైనవి...

ప్రజలను పురుగుల్లా చూసే నాయకులు, అధికారులు ఉన్న ఈ రోజుల్లో ఎస్‌.ఆర్‌. శంకరన్‌ జీవితాన్ని గుర్తు చేసుకోవడం ఎంతయినా అవసరం. నిరుపేదల ఐఏఎస్‌గా పేరు తెచ్చుకొన్న ఆయన సేవలు అనితరసాధ్యమైనవి. బ్యూరోక్రాటిక్‌ అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఆయన ప్రతిభ అద్వితీయమైనది. పేదల అభ్యున్నతి కొరకు 120 జీవోలను ఆయన రూపొందించి విడుదల చేశారు. తన కీలక నిర్ణయాలతో వ్యవస్థలో విశేషమైన మార్పులు తెచ్చారు. ప్రభుత్వ అధికార వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఆయన నిబద్ధత, కృషి అద్వితీయమైనవి. అందుకే ఆయన ఐఏఎస్‌ గాంధీగా ఖ్యాతికెక్కారు. కాలి నడకన సంచరిస్తూ, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకొన్నారు. పద్మభూషణ్‌ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు. వెట్టిచాకిరీ విధానం, సఫాయి కార్మిక వ్యవస్థల నిర్మూలనకు శంకరన్‌ విశేషంగా కృషి చేశారు. తన జీవితం మొత్తం దళిత, గిరిజన, అట్టడుగు వర్గాల సముద్ధరణకు పాటుపడ్డారు. వ్యక్తిగత జీవితం అంటూ లేకుండా పూర్తిగా సమాజానికే అంకితం అయ్యారు. విశ్రాంత జీవితంలో కూడా పేదలకు అండగా నిలబడ్డారు.

షార్‌ అంతరిక్ష కేంద్రాన్ని తమిళనాడులో నెలకొల్పడం కోసం తమిళ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక తమిళుడైనా కూడా శంకరన్‌ ఆ కేంద్రాన్ని అప్పటి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు తీసుకురావడానికి విశేషంగా కృషి చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడే, ప్రభుత్వ మహిళా కళాశాలకు స్వంత భవనాలు లేనందువల్ల కలెక్టర్‌ బంగ్లా అంత పెద్దది తనకెందుకని దానిలో అధిక భాగాన్ని కళాశాలకు కేటాయించారు. అలాగే శంకరన్‌ తన జీతంలో అధిక భాగం పేద ప్రజలకు పంచి పెట్టేవారు. వారు తనకెక్కడ కృతజ్ఞతాభావం చూపెడతారోనని, అవి ప్రభుత్వ డబ్బులని వారికి చెప్పేవారు.

‘మీలాంటి వారికివ్వమని ప్రభుత్వం నా వద్ద కొంత డబ్బు ఉంచింద’ని వారితో నమ్మబలికేవారు, అదీ ఆయన వ్యక్తిత్వం. త్రిపుర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనప్పుడు ఒక చిన్న సూట్‌కేస్‌తో అగర్తలా వెళ్ళి, రిక్షా ఎక్కి తన అధికార నివాసానికి చేరుకొన్నారు. ఘన్‌శ్యామ్‌ షా వెలువరించిన సంకలనంలో ‘అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ ది పూర్‌’ అనే అధ్యాయాన్ని శంకరన్‌ రచించారు. 2010 అక్టోబర్‌ 7న ఆయన మరణించారు. 2011లో హైదరాబాద్‌లో ప్రభుత్వ సంక్షేమశాఖ కార్యాలయం ముందు ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు. శంకరన్‌ విగ్రహాన్ని ఈ నెల 7వ తేదీన బాపట్ల కలెక్టర్‌ కార్యాలయంలో కూడా ఆవిష్కరించారు. ఆశ్రిత పక్షపాతానికి ఇసుమంతైనా ఆస్కారం ఇవ్వకుండా అందర్నీ ఒకే విధంగా చూసిన సమదర్శి శంకరన్‌. ఆయన మానవీయ విలువలను ఆదర్శంగా తీసుకోవాలి. శంకరన్‌లోని సేవాతత్పరత, వినయశీలం, చిత్తశుద్ధి అలవర్చుకునే యత్నాలు ప్రారంభం కావాలి.

పి.సి. సాయిబాబు

(నేడు శంకరన్‌ జయంతి)

ఇవి కూడా చదవండి

సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ

విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం

Updated Date - Oct 22 , 2025 | 12:23 AM