Budgam Bypoll: సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:05 PM
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గందేర్బల్, బడ్గాం నియోజవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. అనంతరం గందేర్బల్ నియోజకవర్గాన్ని తనవద్దే ఉంచుకుని బడ్గాంను వదులుకున్నారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని బడ్గాం (Budgam) నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Adullah) 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గందేర్బల్, బడ్గాం నియోజవర్గాల్లో పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. అనంతరం గందేర్బల్ నియోజకవర్గాన్ని తనవద్దే ఉంచుకుని బడ్గాంను వదులుకున్నారు. దీంతో బడ్గాంలో ఉప ఎన్నిక జరుగుతోంది. జమ్మూకశ్మీర్‌లోని మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు షియా కమ్యూనిటీకి చెందిన 'ఆగా'లే కావడం ఈసారి విశేషం.
అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (NC) నుంచి ఆగా సయ్యద్ మహమూద్ పోటీ చేస్తుండగా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (PDP) నుంచి ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీ, బీజేపీ (BJP) తరఫున ఆగా సయ్యద్ మొహ్సీన్ పోటీ చేస్తున్నారు. ఎన్సీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఆ పార్టీ అభ్యర్థి మమమూద్ తోసిపుచ్చారు. ఎన్సీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది మాత్రమే అయిందని, ఒమర్ అబ్దుల్లాకు ఉన్న అంకితభావం ఏ నేతకు లేవని గతంలో మంత్రిగా కూడా చేసిన మహమూద్ వ్యాఖ్యానించారు.
కాగా, బడ్గాంలో 36,000 పైచిలుకు ఓట్లపై గెలిచిన వారంలోనే ఆ నియోజకవర్గాన్ని ఒమర్ ఒదులుకోవడాన్ని పీడీపీ అభ్యర్థి మెహదీ తప్పుపట్టారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని, అభివృద్ధి ఎజెండానే తమ పార్టీ ఎజెండా అని చెప్పారు. మరోవైపు, ఎన్‌సీ, పీడీపీపై ఉన్న వ్యతిరేకతే తమకు విజయాన్ని అందిస్తుందని బీజేపీ అభ్యర్థి సయ్యద్ అంచనాగా ఉంది. 370 అధికరణ రద్దు విషయంపై ప్రజలకు ఎలాంటి పట్టింపులేదని, అభివృద్ధి, ఉద్యోగాలను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. బడ్గాం ఎన్నికల రేసులో మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి