ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Remembering Renuka Midko: ఈ రోజు మా చిట్టమ్మ పుట్టినరోజు

ABN, Publish Date - Oct 14 , 2025 | 05:30 AM

ప్రపంచానికి గుముడవెల్లి రేణుక (మిడ్కో)గా తెలిసిన మా ‘చిట్టమ్మ’ 55వ పుట్టినరోజు.. ఈ రోజు! ఇప్పుడామె భౌతికంగా, మాకు శాశ్వతంగా దూరమైంది కాబట్టి ఇప్పట్నుంచి జయంతి అనాలేమో. తను మా ఇల్లు వదిలి ఇప్పటికి 22 ఏళ్లు. ఈ కాలంలో...

ప్రపంచానికి గుముడవెల్లి రేణుక (మిడ్కో)గా తెలిసిన మా ‘చిట్టమ్మ’ 55వ పుట్టినరోజు.. ఈ రోజు! ఇప్పుడామె భౌతికంగా, మాకు శాశ్వతంగా దూరమైంది కాబట్టి ఇప్పట్నుంచి జయంతి అనాలేమో. తను మా ఇల్లు వదిలి ఇప్పటికి 22 ఏళ్లు. ఈ కాలంలో, ప్రతి అక్టోబర్ 14న ఇంట్లో మా అమ్మ పాయసం వండి అందరికీ పెట్టడం, రోజంతా ఆమెను తలుచుకొని దుఃఖించడం, గర్వించడం ఆనవాయితీ. అయితే, తను బతికుంటే, తన కార్యరంగమైన దండకారణ్యంలో, సహచర విప్లవకారుల మధ్య తన పుట్టిన రోజును ఎలా జరుపుకునేదో? కేక్‌లు కట్ చేయడాలు, లేదా పార్టీలూ.. ఇవేవీ వాళ్ల ఉద్యమ జీవితంలో ఎలాగూ ఉండవు. అయినా కూడా ఒక రచయితగా, విప్లవకారిణిగా ఎందరికో ఎంతో ప్రేమాస్పదురాలిగా నిలిచిన మా చిట్టమ్మ ఈ రోజు నిజంగా ఏమేం చేసి ఉండేదో?

బహుశా చీకట్లు తొలగిపోకముందే నిద్ర లేచేదేమో. తన పాలిథీన్‌ షీట్‌లో (గెరిల్లాలు పడుకోవడానికైనా, కూర్చోవడానికైనా, నడుం వాల్చి చదువుకోవడానికైనా, ఎవరితోనైనా కూర్చొని మాట్లాడటానికైనా.. అన్నింటికీ ఉపయోగించేది ఓ ఆరడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు ఉండే పాలిథీన్ షీటే) అలాగే కాసేపు కూర్చొని ముందుగా అమ్మను, బాపును తలచుకునేదేమో. వాళ్లను చివరిసారి కలిసి అప్పుడే 22 ఏళ్లయిపోయింది కదా అని ఆశ్చర్యంతో, బాధతో గుర్తుచేసుకునేదేమో. వాళ్లకు ఉత్తరం రాసి కూడా 11 ఏళ్లు గడిచిపోయాయి కదా అని గుర్తొచ్చి ఓ నిట్టూర్పు విడిచేదేమో. వృద్ధాప్యంలో ఇప్పుడు వాళ్లెలా ఉన్నారో అని కాసేపు మనసులోనే దుఃఖించేదేమో. తన జీవిత సహచరులు, అమరులు సంతోష్, శాఖమూరిలను తలచుకునేదేమో. చాలా తక్కువ కాలంలో, అత్యంత విషాదకరంగా ముగిసిన వారిద్దరి సహచర్యం తనలో ఎంత స్ఫూర్తిని నింపిందో కదా అని ఆశ్చర్యపోయేదేమో.

ఇంకా.. తానున్న ప్రాంతం, సందర్భం అనుకూలిస్తే ఈ రోజు పొద్దున్నే స్నానం చేసేది. ఉన్నవాట్లోనే తనకిష్టమైన, శుభ్రమైన బట్టలు వేసుకునేది. కిచెన్‌కు వెళ్లి ఆ రోజు తన సహచరులు బ్రేక్‌ఫాస్ట్‌కు ఏం వండుతున్నారో చూసేది. తనకు నచ్చిన వంటకం ఏదైనా చేయడానికి అవసరమైన దినుసులు ఉన్నాయేమో ఆరా తీసేది. ఉంటే, తన డ్యూటీ అయినా, కాకున్నా, ఏదో ఒకటి వండి వాళ్లను సంతోషపెట్టేది. కానీ తనకీ రోజు ఎందుకు ప్రత్యేకం అని మాత్రం ఎవ్వరికీ చెప్పకపోయేది. ఒకవేళ తానున్న క్యాంపులో తనకు బాగా తెలిసిన సన్నిహితులు ఉంటే వాళ్లతో మాట్లాడేది. తనిలా పొద్దున్నే శుభ్రంగా తయారవడం, ముఖంలో ఆ మెరుపును గమనించి, కళ్లతోనే ‘ఏంటి సంగతి’ అన్నట్టు చూస్తే, నవ్వేసి ఉండిపోయేది. మెల్లిగా ‘ఇవ్వాళ్టితో మనకు 55 నిండినై.. అన్నట్టు’ అని జవాబిచ్చేది ముఖమంతా వ్యాపించే తన ట్రేడ్‌మార్క్ చిరునవ్వుతో. వాళ్లు కూడా తమ సంతోషాన్ని హడావిడిగా మార్చకుండానే, గట్టిగా షేక్‌హ్యాండ్ చేసి, లేదా తనను దగ్గరికి తీసుకొని, హత్తుకొని గ్రీటింగ్స్ చెప్పేవాళ్లేమో. కిట్లో ఉన్న ఓ కొత్త పెన్నునో, లేదా వాడకుండా దాచుకున్న ఓ కొత్త డైరీనో ఆర్భాటం లేకుండా తన చేతిలో పెట్టేవాళ్లేమో. లేదంటే కిట్లో దాచుకున్న బిస్కెట్ ప్యాకెట్ తీసి తనకో ముక్క తినిపించేవాళ్లేమో.

ఆ తర్వాత ఆ రోజు చేయాల్సిన పనులేంటో లెక్క వేసుకునేది. వాటిలో తనకిష్టమైన దాన్ని ముందేసుకునేది. లేదా ఏదైనా మంచి పుస్తకం చదివేది. నచ్చిన కవితల పుస్తకం ఉన్నా, ల్యాప్‌టాప్‌లో స్కాన్ కాపీ ఉన్నా ఓపెన్ చేసి కూర్చునేది. తాను చాలాకాలంగా రాయాలని స్ట్రగుల్ అవుతున్న కథనో, కథనాన్నో మొదలుపెట్టడానికి ప్రయత్నించేది. తనకిష్టమైన విమలక్క పాట– ‘ఆదివాసీ ఆత్మబంధువు ఏడికెళ్లెనే..’ కనీసం రెండు సార్లయినా ప్లే చేసుకొని వినేది. ఆ రోజు ఏదైనా గ్రామానికి వెళ్లాల్సి వస్తే, చంటిపిల్లల తల్లులెవరైనా కలిస్తే కాసేపు వాళ్ల పిల్లలను ఎత్తుకొనేది. ముద్దు చేసేది.

తనను తాను ఎన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేసుకోవాలనుకున్నా, ఈ రోజంతా తనకు మా ఊరు కడవెండి, తన బాల్యం, కుటుంబసభ్యులు, ఆత్మీయులు అందరూ గుర్తొస్తూనే ఉండేవారేమో. కడవెండి, మోత్కూరు, తిరుపతి, విశాఖ, బాసధార (ఒడిషా), దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, అబూజ్‌మడ్... 55 ఏళ్ల ప్రయాణంలోని మజిలీలన్నీ ఒక్కొక్కటీ నెమరు వేసుకునేదేమో. అడవి జీవితంలో 21 ఏళ్లు గడిచినా, అంతంత మాత్రం ఆరోగ్యమే అయినా, ఇంకా బతికున్నందుకు ఆశ్చర్యపోయేదేమో. చిన్నప్పుడు ఇంట్లో, ఊళ్లో తనను ‘ఒంటూపిరి ప్రాణం అని వేళాకోళమాడేవాళ్లు, ఇప్పుడెంత గట్టి పిండంగా అయ్యానో’ అనుకుని తనలోనే నవ్వుకునేదేమో.

అలా పొద్దంతా అటూ ఇటూ తిరిగిన మనసుకు, అలసిన శరీరానికి విశ్రాంతి కోసం ఏ అర్ధరాత్రో పాలిథీన్ షీట్‌లో పడుకున్న తర్వాత, అసలు తన ప్రయాణం ఎలా మొదలైందీ.. ఏయే మలుపులు తీసుకుందీ.. అన్నీ నెమరు వేసుకునేదేమో. కడవెండిలో బహుశా ఆరో తరగతిలో ఉన్నప్పుడు తను చదివిన మొదటి నవల ‘అమ్మ’ను గుర్తు చేసుకునేదేమో. ఓ పాతికేళ్ల తర్వాత దాన్ని మళ్లీ చదివి, ఆ ప్రపంచ ప్రఖ్యాత నవలకు వందేళ్లు నిండిన సందర్భంగా పరిచయ వ్యాసాన్ని కూడా రాసానని గుర్తు చేసుకునేదేమో. తను మొదటి రోజుల్లో రాసిన ‘భావుకత’, ‘విడ్డూరపు మనిషి’ వంటి కథలకు వచ్చిన అనూహ్య స్పందన.. ఆ తర్వాత విప్లవ రచయితల పరిచయాల్లోకి వచ్చాక ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తు చేసుకునేదేమో. ఉద్యమకారిణిగా ఎదుగుతూనే తనలోని కథకురాలిని నిలబెట్టుకునేందుకు కొన్నిసార్లు అయోమయంతో, మరెన్నోసార్లు అమాయకత్వంతో పడ్డ సంఘర్షణను గుర్తుచేసుకునేదేమో.

అప్పుడామెకు ఆ నాటికి తను రాసిన కథలన్నీ తనతోనే చదివించుకొని, వాటిని మెచ్చుకోవడమే కాదు, ‘కథ మీద నీకు పట్టు దొరికింది కామ్రేడ్, ప్రొసీడ్’ అని వెన్నుతట్టిన తన తొలి సహచరుడు సంతోష్‌ గుర్తొచ్చేవాడు. సంతోష్‌తో తన తొలి షేక్‌హ్యాండ్ గుర్తొచ్చేది. ఆయనను నల్లమల అడవుల్లో మొదటిసారి కలిసి, ఆ తర్వాత, తిరుపతిలోని తన రూమ్‌కు తిరిగొచ్చాక, కేవలం ఆయన చేతి స్పర్శ తొలగిపోవద్దనే, రోజుకు రెండుసార్లు స్నానం చేసే తను, రెండు రోజులు స్నానం చేయకుండా ఉండిపోవటం, ఆఖరుకు అన్నం కూడా స్పూనుతోనే తిన్న సందర్భం గుర్తొచ్చి ముసిముసిగా నవ్వుకొనేదేమో. అలా విప్లవంలో తన తొలి ప్రేమ రోజుల్ని గుర్తు చేసుకొని సిగ్గుతో మురిసిపోయేదేమో. చివరిసారి, ఆగస్ట్ 2, 1999న కాంచీపురం బస్టాండులో విడిపోతున్నప్పుడు ‘ఈసారి కలవడం లేట్ కావచ్చు’ అన్న సంతోష్ చివరి మాటలు కూడా ఆమెకు గుర్తొచ్చేవేమో. అది జీవితకాలం ఎదురు చూసేంత లేట్ అవుతుందని ఊహించలేకపోయానే అని ఆమె మనసు మరోసారి మూగగా రోదించేదేమో. కన్నీళ్లు వెచ్చగా చెంపల మీదుగా జారిపోతుంటే.. కలత నిద్రలోకి జారుకునేదేమో.

గుముడవెల్లి సోమయ్య, జయమ్మ, ప్రసాద్, రాజు

రేణుక (మిడ్కో) కుటుంబ సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 05:32 AM