ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Remembering K Balagopal: తరం తరం సమాజ మేధోవనరు

ABN, Publish Date - Oct 08 , 2025 | 01:54 AM

తెలుగు నేలకు, హక్కుల ప్రజానీకానికి పరిచయం అవసరం లేని పేరు బాలగోపాల్. హక్కుల దిక్సూచిగా, ప్రజల న్యాయవాదిగా ఆయన సాధించిన మైలురాళ్ళు ఎన్నో; ప్రజావిజయాలు, ప్రజాధర్మానికి...

తెలుగు నేలకు, హక్కుల ప్రజానీకానికి పరిచయం అవసరం లేని పేరు బాలగోపాల్. హక్కుల దిక్సూచిగా, ప్రజల న్యాయవాదిగా ఆయన సాధించిన మైలురాళ్ళు ఎన్నో; ప్రజావిజయాలు, ప్రజాధర్మానికి గీటురాయిగా నిలిచిన సందర్భాలు మరెన్నో. నేను 2021 నుంచి మానవ హక్కుల వేదికతో పనిచేస్తున్నాను. బాలగోపాల్ సంస్మరణ సభలకు 2019 నుంచి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో బాలగోపాల్‌ సార్ యాదిలో మానవ హక్కులవేదిక హైదరాబాద్‌లో నిర్వహించే సంస్మరణ సభకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి సామాజిక కార్యకర్తలు హాజరవుతారు. మనల్ని వదిలివెళ్ళి పదహారేళ్ళయినా బాలగోపాల్‌ సార్‌కు ఉన్న కరిష్మా అది.

అయితే ఎప్పుడూ ఒక ప్రశ్న నన్ను వేధిస్తూ ఉండేది. బాలగోపాల్ గురించి ఇప్పటి యువతకు తెలుసా? విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విద్యార్థులకు ఆయన చేసిన వందలాది నిజనిర్ధారణల గురించి అవగాహన ఉందా? ప్రజాసమస్యల పట్ల పాతతరం ఒక ఎరుకతో ఉండేది, ఏదో ఒక ప్రజా ఉద్యమంతో పని చేయటం వల్ల వారికి బాలగోపాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న యువత మాటేమిటి? ఆయన వేసిన కొత్త దారులు, రాసిన రాతలు, చేసిన పోరాటాలు, గెలిచిన కేసులు... వాటి గురించి వీరికి ఎంత తెలుసు అనిపించేది. ఆయన్ని పోగొట్టుకున్న రోజు విషాదంతో కూరుకుపోయిన తెలుగునేల గురించి, ఆయన విలువ గురించి తర్వాతి తరాలకు ఎప్పటికైనా పూర్తిగా తెలుస్తుందా? అనుకునేవాడిని.

గత సంవత్సరం సంస్మరణ సభకు ముందు హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయాల్లో పోస్టర్స్ అతికించే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, నాకు మరింత స్పష్టంగా జవాబులు దొరికాయి. ‘టిస్’కు వెళ్ళినపుడు, అక్కడి విద్యార్థులకు ఆయన ఒక ప్రజా మేధావిగా పరిచయం అని అర్థమయింది. ఈపీడబ్ల్యూలో రాసిన వ్యాసాల వల్ల కూడా వారికి ఆయన సుపరిచితుడే. ఆయన గురించి తెలిసిన విద్యార్థులు చాలామందే కనిపించారు. అలాంటి అభిప్రాయాలే మేం ‘ఇఫ్లూ’లో కూడా విన్నాం. ‘హెచ్‌సీయూ’లో బాలగోపాల్ ఆదివాసుల కోసం చేసిన పనుల వల్ల ఎక్కువ పరిచయం. లెఫ్ట్ సంఘాలకు ఆయన రాసిన మార్క్సిజం రచనలతో పరిచయం. దళిత సంఘాలకు ఆయన వారి గురించి చేసిన రచనల వల్ల పరిచయం. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘ్ పరివార్‌కి వ్యతిరేకంగా రాసిన రచనల వల్ల, సచార్ కమిటీ నివేదికపై వ్యాసాల వల్ల, కశ్మీర్‌పై చేసిన పనుల వల్ల పరిచయం.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల స్పందన నాకు ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగించింది. మండల్ ఉద్యమ సమయంలో రిజర్వేషన్ల మీద రాసిన వ్యాసాల వల్ల, దళితుల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన కృషి వల్ల అక్కడి విద్యార్థులకు బాలగోపాల్‌ సుపరిచితుడు. ఒక విద్యార్థి మాట్లాడుతూ ‘‘ఆర్ట్స్ కాలేజీ లాన్‌లో మా సీనియర్ పాలస్తీనా ప్రజాపోరాటం వ్యాసం మొత్తం చదివి వినిపించాడు’’ అని చెప్పాడు. చివరగా నల్సార్‌కి వెళ్ళినపుడు అక్కడి బి.ఎ+ఎల్.ఎల్.బి చదివే మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా బాలగోపాల్ వాదించిన కేసుల వివరాలు తెలుసు. మేమందరం బాలగోపాల్‌కి రుణపడి ఉన్నాం అని చెప్పకనే చెప్పారు. అదీ, ఆయనకు ఇప్పటి తరంతో ఉన్న అనుబంధం. ఆయన ఆలోచనలకు ఇప్పటి విద్యార్థుల దగ్గర కూడా ఎంత ప్రాసంగికత ఉన్నదో అర్థమైంది.

బాలగోపాల్ చేసిన పనులు చాలా విస్తారమైనవి. వైవిధ్యమైనవి, విలక్షణమైనవి. ఎక్కువమంది కార్యకర్తలు ఒక నేపథ్యంతో కూడుకున్న సమస్యల మీదనే పని చేయడానికి ఇష్టపడతారు, దానికి వాళ్లకు ఉన్న కాలపరిమితి కూడా ఒక ముఖ్య కారణం. కానీ బాలగోపాల్ ఆ అడ్డంకులు అధిగమించి కాలానికే పరిమితి పెట్టే విధంగా పని చేశారు. ఆదివాసులు, దళితులు, మైనారిటీలు, మహిళలు, నక్సలైట్ల గురించి మాట్లాడుతూనే అభివృద్ధి విధ్వంసం, పర్యావరణం, అణచివేత, విస్థాపన, నదులు, సైన్స్, సాహిత్యం, కోర్టు తీర్పులు ఇలా దేనినీ వదలలేదు. కశ్మీర్ నుంచి కందమాల్ వరకు నిజ నిర్ధారణలు చేయడమే కాక, పాలస్తీనాతో పాటు అనేక అంతర్జాతీయ విషయాల మీద కూడా రచనలు చేసారు.

బాలగోపాల్‌ మరణించిన తరువాత ఆయన రచనలను పుస్తక రూపంలో అందుబాటులోకి తెచ్చిన పబ్లిషర్స్ కృషి ఎనలేనిది. అవి అందుబాటులోకి రావడం మూలానే ఆయన కొత్త తరానికి చేరువవుతున్నారు. బాలగోపాల్ చేసిన పనిని అధ్యయనం చేసి, వారి ఆశయాలను మున్ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇంకా జరగాలి, ఈ తరానికి అది సాధ్యమే. ఇప్పటితరం దృష్టిలో ఆయన ఖ్యాతి ఎవరూ ఊహించనిది, ఎవరూ సాధించనిది కూడా. బహుశా అమరత్వం అంటే ఇదేనేమో!

నేడు బాలగోపాల్‌ వర్ధంతి. కాకతీయ యూనివర్సిటీ సెనెట్‌ హాల్‌లో, నల్సార్‌ వీసీ శ్రీకృష్ణదేవరావు వక్తగా బాలగోపాల్ స్మారకోపన్యాసం జరుగుతుంది. 12వ తేదీన బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నందిని సుందర్, యోగేంద్ర యాదవ్, అపర్ గుప్తా, పి.ఎస్‌. అజయ్‌కుమార్ వక్తలుగా మానవహక్కుల వేదిక ఆధ్వర్యంలో సంస్మరణ సభ. బాలగోపాల్ పుస్తకం ‘రాజ్యాంగాన్ని ఎలా చూడాలి’ ఆవిష్కరణ, పాలస్తీనా మీద లఘుచిత్ర ప్రదర్శన ఉంటాయి.

రోహిత్ తాళ్ళ

మానవ హక్కుల వేదిక

ఈ వార్తలు కూడా చదవండి..

విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 01:54 AM