TSPSC Controversy: గ్రూప్ 1పై రాజకీయ దుష్ప్రచారం
ABN, Publish Date - Sep 23 , 2025 | 01:05 AM
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిర్వహించటం చేతకాని తొలి గ్రూప్ 1 పరీక్షను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదకొండు సంవత్సరాల తర్వాత నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. ఇది చూసి ప్రతిపక్ష బీఆర్ఎస్...
గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిర్వహించటం చేతకాని తొలి గ్రూప్ 1 పరీక్షను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదకొండు సంవత్సరాల తర్వాత నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. ఇది చూసి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది. రాజకీయ లబ్ధి కోసం గ్రూప్ 1 పరీక్షను అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతోంది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయి అనేది బీఆర్ఏస్, బీజేపీ రాజకీయ ప్రేరేపితమైన ఒక కట్టుకథ మాత్రమే.
మొత్తం 21,093 మంది మెయిన్స్ రాస్తే, 563 మంది మాత్రమే గ్రూప్ 1 అధికారులుగా నియామకం అవుతారు. మిగతా 21,530 మంది సహజంగానే అసంతృప్తితో ఉంటారు. వీరి అసంతృప్తికి, అధికారానికి దూరమైన బీఆర్ఎస్ నేతలు తోడయ్యారు. అభం శుభం ఎరుగని ఈ సాధారణ నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి ద్వారా గ్రూప్ 1పై విషప్రచారం చేయించారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ కొంత మంది ప్రైవేటు కోచింగ్ సెంటర్ యజమానులని ఎమ్మెల్సీలు చేస్తామనీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామనీ ఆశపెట్టింది. పారదర్శకంగా జరిగిన గ్రూప్ 1 పరీక్షలపై వారితో పథకం ప్రకారం దుష్ప్రచారం చేయిస్తున్నది. ఇది కోచింగ్ సెంటర్ యజమానులకి లాభదాయకం. పరీక్ష వాయిదా పడితే కోచింగ్ పేరుతో మళ్ళీ లక్షలు దండుకోవచ్చు, లేదా రాజకీయంగా పలుకుబడి పెంచుకోవచ్చు.
హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం మూల్యాంకనంలో తెలుగు మాధ్యమం, ఆంగ్ల మాధ్యమం అభ్యర్థుల మధ్య మార్కుల వ్యత్యాసం ఉందన్న పిటీషనర్ల వాదనలతో ఏకీభవించింది. టీజీపీఎస్సీ వాదనలను తోసిపుచ్చింది. పునర్ మూల్యాంకనం చేయాలి, లేకుంటే మెయిన్స్ రద్దు చేసి తిరిగి మళ్ళీ నిర్వహించాలి అనే తీర్పును హైకోర్టు వెలువరించింది. ఈ తీర్పు ఇటు టీజీపీఎస్సీకి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారుకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో సవాలు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 1లో విజేతలుగా నిలిచిన 563 మంది అభ్యర్థులు కూడా హైకోర్టు తీర్పును రాష్ట్ర హైకోర్టు ధర్మాసనంలో సవాలు చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. దీంతో గ్రూప్ 1 నియామక ప్రక్రియ మరికొంత కాలం ఆలస్యం కానుంది.
హైకోర్టు కేవలం గ్రూప్ 1 మూల్యకనంలో తెలుగు మాధ్యమం, ఇంగ్లీష్ మాధ్యమం అభ్యర్థుల మధ్య మార్కుల వ్యత్యాసం ఉందని మాత్రమే చెప్పింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు ప్రకారం పరీక్షలో కఠిన మూల్యాంకనం – సులభ మూల్యాంకనం వలన అభ్యర్థుల మార్కుల్లో తేడా ఉనప్పుడు ఛీఫ్ ఎగ్జామినర్ మోడరేషన్ పద్ధతిలో ఆ మార్కులను స్కేలింగ్ చేసి సరాసరి విధానంలో ఒకే స్థాయికి తీసుకు రావాలి. ఈ విధానం టీజీపీఎస్సీలో లోపించిందని మాత్రమే హైకోర్టు పేర్కొంది. నిజానికి ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రతి సంవత్సరం ఎక్కువగా హిందీ మాధ్యమం అభ్యర్థుల కన్నా అత్యధికంగా ఆంగ్ల మాధ్యమం అభ్యర్థులే ఎంపికవుతున్నారు. మొన్న మన రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్‌లోను ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసినవారే సివిల్స్‌కి ఎంపికయ్యారు.
అదేవిధంగా ప్రిలిమ్స్‌కి మెయిన్స్‌కి వేరు వేరు హాల్ టికెట్స్ ఇచ్చారని ఆరోపణ. నిజానికి పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై రాత పరీక్షల్లో, ఇంకా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షల్లో రెండు హాల్ టికెట్ల విధానం ఉంది. ఆ పరీక్షల్లో జరగని అవకతవకలు గ్రూప్ 1లో ఎట్లా జరుగుతాయో ఆరోపణ చేస్తున్న వారు సమాధానం చెప్పాలి.
ఒకే రకమైన మార్కులు 713 మందికి వచ్చాయని మరో ఆరోపణ. ఈ ఆరోపణకి సమాధానంగా టీజీపీఎస్సీ– 440 మందికి దగ్గర దగ్గరగా అంటే 430–439.5 మార్కులు వచ్చాయని ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన తీవ్రమైన పోటీ పరీక్షల్లో సర్వసాధారణంగా జరుగుతుందని తెలిపింది. సివిల్ సర్వీసెస్‌లోనే గాక, నీట్, ఈఏపీసెట్, జెఇఇ పరీక్షలలో కూడా దగ్గర దగ్గరగా ర్యాంకులు రావటం మనందరం చూస్తాం.
అదేవిధంగా 18, 19, పరీక్ష కేంద్రాలలో సుమారు 1656 మహిళా అభ్యర్థుల్లో 76 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. 1656 మంది మహిళా అభ్యర్థుల్లో 563 ఉద్యోగాలకు 500 మందో 400మందో ఆ రెండు పరీక్షా కేంద్రాల నుండి ఎంపికైతే అనుమానం వ్యక్తం చేయాలి కానీ, 76 మంది ఎంపిక కావటం అనేది సహజసిద్ధమైన ప్రక్రియే!
తెలంగాణలో తొలి గ్రూప్ 1 భర్తీ కాకుండా బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి. రష్యన్ విప్లవ కారుడు లెనిన్ చెప్పినట్లు– ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు నిరుద్యోగులు నష్టపోతూనే ఉంటారు.
కోటూరి మానవతా రాయ్
టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News
Updated Date - Sep 23 , 2025 | 01:07 AM