గాంధీ కాలం నాటిది ఈ పీ4
ABN, Publish Date - May 07 , 2025 | 04:55 AM
‘పేదల ఇంట కొత్త వెలుగు పీ౪’ శీర్షికతో తెలుగు దేశం శాసనసభ్యులు సి. రామచంద్రయ్య ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశారు (ఏప్రిల్ 9). కానీ ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశం. 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన సరళీకృత...
‘పేదల ఇంట కొత్త వెలుగు పీ౪’ శీర్షికతో తెలుగు దేశం శాసనసభ్యులు సి. రామచంద్రయ్య ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశారు (ఏప్రిల్ 9). కానీ ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశం. 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల కారణంగా జాతీయ సంపద గణనీయంగా పెరిగిందని, జాతీయ ఆర్థిక అభివృద్ధి 8–9 శాతం పెరిగిందని, కానీ దీనికి తగ్గట్లుగా పేదరికం తగ్గటం లేదని రామచంద్రయ్య వాపోయారు. అలానే 200 దేశాల ఆకలి సూచీ జాబితాలో భారతదేశం 150వ స్థానంలో ఉందని, మరి లోపం ఎక్కడని ఒక ప్రశ్న కూడా వేశారు. అసలు సమస్యల లోతుల్లోకి వెళితేనే ఈ ప్రశ్నకు సమాధానం దొరికేది!
1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఇప్పటివరకు ఆశ్రిత పెట్టుబడిదారీ వర్గానికే ఉపయోగపడ్డాయి. అన్ని రంగాలను శాసించే అదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులు పెరగడానికి అవి దోహదపడ్డాయి. కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినా పేదరికం తగ్గలేదు. ఈ అసలు వాస్తవాలను గమనించకుండా– చంద్రబాబు ‘పీ4’ పథకంతో పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పటం పాక్షిక దృష్టే అవుతుంది.
వాస్తవానికి ఈ ‘పీ4’ విధానం కొత్తగా వచ్చిందేమీ కాదు! ఏనాడో గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలో ఇది భాగమే. ఆనాడే గాంధీ ఇలాంటి విధానాలను ప్రబోధించినప్పటికీ ఈనాటికీ దేశంలో పేదరికం తగ్గకపోవడానికి కారణం అవన్నీ కేవలం ప్రబోధాలుగా మిగిలిపోవటమే. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) పథకాన్ని చట్టం రూపంలో తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని చేయటంలో భారతదేశం మొదటి స్థానంలో ఉండవచ్చు గాక! కానీ దీని ద్వారా సామాజికంగా ఏ మాత్రం అభివృద్ధి సాధించలేకపోయాం. టాటా కంపెనీలు మొదలుకొని మైక్రోసాఫ్ట్ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేరులతో కొన్ని వేల కోట్ల రూపాయల్ని సామాజిక అభివృద్ధి పేరుతో వివిధ రూపాలలో ఖర్చు చేస్తున్నారు. అయినా దేశ సామాజిక చిత్రంలో మార్పులేమీ జరగలేదు. పైగా సామాజిక చిత్రపటం మరింత మసకబారింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ వాస్తవాల నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన ‘పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్‌షిప్ –పీ4’ పథకాన్ని గమనిస్తే పేదరికాన్ని నిర్మూలించాలన్న ఈ పథకం లక్ష్యం పగటికలే అనుకోవాలి!
అసలు ‘పీ4’ పథకంలో ప్రకటించిన ‘మార్గదర్శకులు’ ఎవరు? వీరంతా నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే. ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు చంద్రబాబు ‘మార్గదర్శకులు’ అని పేరు పెట్టారు. వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను చౌకగా దక్కించుకున్న పెట్టుబడిదారుల చేత సహాయం చేయించి పేదరికాన్ని నిర్మూలించాలనుకోవడం ఎవరి ప్రయోజనాల కోసం! సామాజిక వ్యవస్థలో పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్యమాలవైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని ఊహాజనిత భ్రమల్లో ముంచి పక్కదారి పట్టించడానికే ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాల్లో ఒకటైన ఈ ‘పీ4’ పథకాన్ని ప్రజలపై ప్రయోగిస్తున్నారు.
ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా దున్నేవానికే భూమి, అటవీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు హక్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు, ప్రైవేటీకరణ విధానాలను విడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమల సృష్టి వంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని దారి మళ్ళించి, వారు తమ పట్ల విధేయతాభావంతో ఉండి తమను ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకునేందుకే ఇలాంటి పథకాలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రజలను భ్రమల్లో పడనీయకుండా, ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలి!
ముప్పాళ్ళ భార్గవ శ్రీ
సీపీఐ ఎంఎల్ నాయకులు
ఇవి కూడా చదవండి..
సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్‌కు ఐరాసా సూచన
Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - May 07 , 2025 | 04:55 AM