IAF Air Exercise NOTAM Issued: సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
ABN , Publish Date - May 06 , 2025 | 07:51 PM
పాక్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్ గగనతలంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించనుంది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది.
మే 7, 8 తారీఖుల్లో సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌లో భారీ వైమానిక ఎక్సర్‌సైజు నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటామ్ (నోటీస్ టూ ఎయిర్‌మెన్) జారీ చేసింది. యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఈ ఎయిర్ ఎక్సర్‌సైజుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లో సరిహద్దు వెంబడి పలు వైమానిక విన్యాసాలు కూడా నిర్వహించనున్నారు. మే 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ఎక్సర్‌సైజు ప్రారంభమవుతుందని, మరుసటి రోజు రాత్రి 9.30 వరకూ కొనసాగుతోందని కేంద్రం తన నోటీసుల్లో పేర్కొంది. ఈ సమయంలో ప్రభావిత ప్రాంతాల గగతలంలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని కూడా ప్రభుత్వం పేర్కొంది.
ఇందులో భాగంగా ఫైటర్ జెట్స్‌తో పాటు నిఘా విమానాలు పలు విన్యాసాలు నిర్వహిస్తాయి. ఎయిర్ ఫోర్స్ సన్నద్ధను పరీక్షించేందుకు పలు ఆపరేషన్లో పాల్గొంటాయి. ఈ ప్రాంతంలో సరిహద్దు వెంబడి పలు ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యుద్ధ సన్నద్ధతను పరీక్షించే క్రమంలో భారత్ రేపు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాధారణ పౌరులకు వైమానిక దాడుల సమయంలో ఎలా స్పందించాలనే విషయంలో శిక్షణ ఇస్తారు. అంతేకాకుండా, వేగంగా సహాయచర్యలు చేపట్టేందుకు వీలుగా సాయుధ దళాలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన సిబ్బంది కూడా పాల్గొంటారు.
1971 తరువాత భారత్ మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో, భారత్ తదుపరి ఏం చర్య తీసుకుంటుందో తెలీక పాక్ దళాలపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు భారత్‌తో యుద్ధ వాతావరణం నెలకున్న నేపథ్యంలో పాక్ తన రక్షణ రంగ కేటాయింపులను 18 శాతం పెంచింది.
పహల్గాం ఘటన విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం కోసం ప్రయత్నిస్తున్న పాక్‌కు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఐక్యరాజ్య సమితి తాజాగా భద్రతా మండలి సమావేశాల్లో కొన్ని దేశాలు ఉగ్రవాదుల మూలాలపై పాక్‌ను నిలదీయడంతో దయాది దేశానికి నోటమాట రాలేదని తెలిసింది.
ఇవి కూడా చదవండి:
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు
Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం