Kodada Inscriptions: కాకతీయులపై కొత్త వెలుగులు
ABN, Publish Date - Sep 28 , 2025 | 03:40 AM
కోదాడలోని ముస్లిం శ్మశానవాటికలో లభించిన తొమ్మిది గుత్తుల రాగిపలకల మీద రాసివున్న శాసనాల ఆధారంగా కాకతీయ వంశావళిని తిరగరాయాల్సిన అవసరం ఉంది. ఆ శాసనప్రతులింకా వెల్లడి కాలేదు కానీ...
కోదాడలోని ముస్లిం శ్మశానవాటికలో లభించిన తొమ్మిది గుత్తుల రాగిపలకల మీద రాసివున్న శాసనాల ఆధారంగా కాకతీయ వంశావళిని తిరగరాయాల్సిన అవసరం ఉంది. ఆ శాసనప్రతులింకా వెల్లడి కాలేదు కానీ, వాటిలోని విశేషాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారాను, గత నెల 27న జూమ్ మీటింగులో ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారాను మైసూరులోని ఏఎస్సై శాసనాధ్యయన శాఖ డైరెక్టరు కె.మునిరత్నంరెడ్డి వెల్లడించారు. వాటి ద్వారా తెలిసిన శాసనాంశాలను యథార్థమని అంగీకరిస్తే... కాకతీయుల వంశావళిని తిరిగి రాయవలసి వస్తుంది.
కోదాడ మొదటి రాగిశాసనంలో పేర్కొన్నట్టుగా విగ్రహవెట్టి, సకలశ్రీ, గుండ–1, ఎర్ర, అతని కుమారులు గుండ–2, బేతియ, గోనకలు– ఇది తొలి కాకతీయుల వరుస. తర్వాత కాకతీయ వంశక్రమం కాకర్త్య గుండన నుంచి మారలేదు ఇప్పటివరకు. కోదాడ తొలి రాగిశాసనం ‘విగ్రహవెట్టి’ అని పేర్కొంటే, మాంగల్లు శాసనం ‘సామంతవొద్ది సంజ్ఞామ్’ అంటున్నది. ‘సామంతవిష్టి’ అని 2వ బేత(1090) కాజీపేట దర్గా శాసనం కూడా చెప్తున్నది. వెట్టి, వొద్ది, విష్టి సమానార్థకాలు. విష్టి (వెట్టి) వంశం కాదు, అదొక అధికార పదవి. విష్టి అనే పదం రాష్ట్రకూట రాజప్రతినిధి ‘శంకరగండరస’కు కూడా ఉంది. వెట్టి చేయించే అధికారులే సామంతవెట్టి.
విష్టి పన్ను వసూలు చేసే రాష్ట్రకూట పాలనా యంత్రాంగం ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ‘విష్టి’ పేరుతో పిల్చుకున్నారు. (ఐఏపీ, వరంగల్: ఆకునూరు శాసనంలో విట్టి నారాయణ, 38) ‘విష్టి’ విధానం వాకాటక, రాష్ట్రకూట, చాళుక్య శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఒకప్పుడు రాజులకు మాత్రమే ‘విష్టి’ చేయించే అధికారం కాలక్రమేణా సామంతులు, అధికారులు, భూస్వాములు, మంత్రులకు లభించింది.
కాకర్తి గ్రామ నామం 2, 3వ కోదాడ రాగిశాసనాల్లో పేర్కొన్నారు. ఆ గ్రామంలో సకలశ్రీ పేరు మీద సకలేశ్వరాలయం, గుండ–1 పేరు మీద గుండేశ్వర భట్టారకాలయం నిర్మితమైనట్టు ఆ శాసనాల వల్ల తెలుస్తున్నది. కాకర్తి ఎక్కడుందో తేలలేదు. మునిరత్నం జూమ్ మీటింగు వల్ల తెలిసిన వివరాలను బట్టి కోదాడ రాగి శాసనాల్లో పేర్కొన్న దానగ్రామాలు 12 (+4 మధిర గ్రామాలు), వాటి సరిహద్దు గ్రామాలు 77. ఇవి ఎక్కడున్నాయో వెతికిపట్టుకుంటే కొండపల్లి విషయంలో ఏయే గ్రామాలెక్కడున్నాయో తెలుస్తుంది. కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశీలనలో కొన్ని సరిహద్దు గ్రామాలు యాతవాకిళ్ల, ఘట్టికల్లు, కుడకుడ, లోచెరువులు, మూసీనది సూర్యాపేట జిల్లాలోనూ, అలాగే పాలేరు, జువ్విపాడు (జూపెడ) ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు తెలిసింది. మిగతా గ్రామాలు ఈ పరిసరాల్లోనే గుర్తించే అవకాశముంది.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర–సంస్కృతి సంపుటాలలో ‘మధ్యయుగ ఆంధ్రదేశం’ (క్రీ.శ. 1000–1324) సంపుటి, పే.108లో నల్గొండ జిల్లా 2వ శాసనసంపుటి, శా.సం.25 క్రీ.శ. 1149నాటి శాసనంలో ఉన్న కొండపల్లి నాడు నేలకొండపల్లి మండలం కూడి ఉన్నటువంటిది. ఈ విభాగం కందూరుచోడుల సిరికొండ రాజ్యంలో భాగంగా ఉండేదని తెలుస్తోంది. అంటే ఈ కొండపల్లి విజయవాడ సమీపంలోని కొండపల్లి కోట కాదనేది విస్పష్టం. కాకతీయుల తొలి నివాసం తెలంగాణలోనే ఉందని చెప్పవచ్చు. కాకతీయుల శాసనాలన్నింటిలోను పేర్కొన్న కాకతిపురం హన్మకొండనే... అందులో విభేదమవసరం లేదు. తొలినాళ్ళ కాకర్తి ఏదన్నది వెతికితే సరిపోతుంది.
పోతే దుర్జయుడు కాకతీయుల మూలపురుషుడా? దుర్జయుడనే పురాణపురుషుడు భాగవత పురాణాన్ని బట్టి మాంధాత కుడితొడ నుంచి పుట్టినవాడు. దుర్జయ నామం వంశమూలకంగా చెప్పుకుంటున్నవారు అతని వంశపారంపర్యంగా వచ్చిన పాలకులు కాదు. దుర్జయుడు తీరాంధ్రప్రాంతాల పాలకులందరికీ వంశకర్తగా చెప్పుకున్న శాసనాలెన్నో ఉన్నాయి. ఏ దుర్జయుడు? 2వ బేతరాజుకు శైవదీక్షనిచ్చిన గురువులు రాసిన శాసనంలో ‘దుర్జయ’ నామం వచ్చింది. రెండవసారి మైలమ గురువు ధర్మశంభు రాయించిన బయ్యారం శాసనంలో మళ్ళీ ‘దుర్జయ’ నామం కనిపించింది. కొలనుపాక శాసనంలో ఇంకొకసారి దుర్జయుని పేరొస్తుంది. మధ్యలో ఎవరి శాసనాల్లోనూ దుర్జయవంశం అని చెప్పుకున్న దాఖలాలు లేవు. దుర్జయుని పేరు కాకతీయులకున్న ప్రశస్తుల్లో అతిశయంగా చెప్పబడ్డదే తప్ప నిజంగా వంశం పేరు కాదనిపిస్తున్నది.
వెన్ననృపుడని చెప్పింది బయ్యారం శాసనం. అది వేయించింది మైలమాంబ. అంతకు ముందు శాసనాలలో వెన్నరాజు పేరెందుకు లేదు? గూడూరు శాసనంలో ‘బొఱంటి వెన్నడను సంభవుడయ్యె’ అని ఉంది. అతనిని ఎర్రభూపతి కొడుకుగా పేర్కొన్నారు. ఆధార శాసనాలేవీ అంతకుముందు బయటపడలేదు. ఇప్పుడు కోదాడ శాసనాలు పేర్కొన్న విగ్రహవెట్టే వెన్నడుగా చెప్పబడ్డాడేమో. అయితే అతని కొడుకు ఎర్ర కాదు సకలశ్రీ, అతని కొడుకు 1వ గుండ అని కొత్త శాసనాలు వెల్లడిస్తున్నాయి.
ఊహలెపుడు చరిత్రను నిర్మించలేవు. తేల్చిన ఆధారాలతోనే చరిత్ర మళ్ళీ రాసుకోవాలి. తామెపుడో చెప్పిన సంగతులకే విధేయంగా ఉండనవసరం లేదు. కొత్త చరిత్ర తెలిసినపుడు పాత చరిత్రను తిరిగి రాసుకోవడం చరిత్రకారుల కనీస బాధ్యత.
శ్రీరామోజు హరగోపాల్
కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News
Updated Date - Sep 28 , 2025 | 03:40 AM