MS Acharya: జనధర్ము డు ఎమ్మెస్ ఆచార్య
ABN, Publish Date - Nov 13 , 2025 | 05:49 AM
తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్‌లో ఎమ్మెస్ ఆచార్య (1924 –1994) పేరు విననివారు ఉండరు. ‘పత్రిక అయ్యగారి’గా, ‘ప్రెస్సు అయ్యగారి’గా ఆయనకు అటు పండితులలోనూ, ఇటు పామరులలోనూ ఎంతో ఆదరణ లభించింది. 1958 నవంబర్‌లో ‘జనధర్మ’ను, 1980లో...
తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్‌లో ఎమ్మెస్ ఆచార్య (1924 –1994) పేరు విననివారు ఉండరు. ‘పత్రిక అయ్యగారి’గా, ‘ప్రెస్సు అయ్యగారి’గా ఆయనకు అటు పండితులలోనూ, ఇటు పామరులలోనూ ఎంతో ఆదరణ లభించింది. 1958 నవంబర్‌లో ‘జనధర్మ’ను, 1980లో ‘వరంగల్ వాణి’ పత్రికను ప్రారంభించారు. పార్టీలకతీతంగా, అత్యంత నిబద్ధతతో, ప్రజాసమస్యల దర్పణంగా... తన చివరిశ్వాస వరకూ ఆ పత్రికలను నడిపిన ఆచార్య జీవితం చిరస్మరణీయం. తన సునిశిత హాస్య, వ్యంగ్య సంపాదకీయాలతో పత్రికలకొక వన్నె తెచ్చారు.
తెల్లని ఖద్దరు లాల్చీ, ధోతి, నుదుటన తిరునామాలతో జె.పి.ఎన్ రోడ్డులో తమ బాలాజీ ప్రింటింగ్ ప్రెస్సులో ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో రాస్తూనో, చర్చిస్తూనో ఆచార్య కనిపించేవారు. ప్రకటనల కోసమో, స్వలాభం కోసమో పత్రికా స్వాతంత్ర్యాన్ని పణంగా పెట్టలేదు. నిష్పాక్షికంగా విమర్శించి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి, జర్నలిజంలో ఉత్తమ సంప్రదాయాలకు అద్దం పట్టారు. శ్రీమద్రామానుజుల నిజమైన శిష్యుడిగా, కులమత వివక్ష లేకుండా సమానత్వం పాటించారు. 1994లో నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వరంగల్‌కు వచ్చినప్పుడు, పత్రికా సమావేశంలో ‘ఎమ్మెస్ ఆచార్య గారు రాలేదా?’ అని ప్రశ్నించారు. ఆచార్య మరణవార్త విని, తన విచారాన్ని వెలిబుచ్చారు. ఆచార్య జీవితమంతా ఎత్తుపల్లాలతోనే గడిచింది. స్వల్ప వేతనంతో కాంపౌండర్, ప్రైవేట్ స్కూల్లో టీచర్, బట్టల కొట్టులో విక్రేత, పేపర్ పంచే కార్మికుడు... వంటి ఎన్నో ఉద్యోగాలు చేసి, కుటుంబ పోషణకు తోడ్పడ్డారు.
ఆచార్య తన ‘జనధర్మ’ పత్రికను ప్రారంభించక ముందు ఇనుగుర్తి వద్దిరాజు సోదరుల ‘తెనుగు, నీలగిరి, సుజాత, తెలంగాణా, శోభ, సారస్వత జ్యోతి, గోల్కొండ’ వంటి పత్రికలు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రచురితమయ్యేవి. కొన్ని పత్రికలు ఎక్కువకాలం నిలవలేదు. కానీ, ఆచార్య పత్రికలైన ‘వరంగల్ వాణి, జనధర్మ’ మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అత్యంత ప్రామాణికతతో నడిచాయంటే, ఆ ఘనత ఆచార్య ప్రతిభే. వరంగల్‌లో ఆయన పత్రిక స్పృశించని సమస్య లేదంటే అతిశయోక్తి కాదు. కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ మెడికల్ కళాశాల, రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలల స్థాపనలో ఆయన పత్రికల కృషి అనిర్వచనీయం. కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటుకు కృషి చేశారు.
తెలంగాణ విమోచన పోరాటంలో కూడా ఆచార్య తనవంతు పాత్రను పోషించారు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు రజాకార్ల చేతిలో ఆయన దెబ్బలు తిన్నారు, జైలుకు వెళ్లారు. రజాకార్లకు వ్యతిరేకంగా వరంగల్‌లో ‘ప్రతాప రుద్రదళం’ పేర వ్యాయామశాలను నడిపి, యువకులను పోరాట దిశగా తీర్చిదిద్దారు. రజాకార్ల అత్యాచార వార్తలను పత్రికలకు పంపేవారు. ఈ కృషికి స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు లభించింది. నర్సంపేట తాలూకా మహేశ్వరం అడవులలో చెట్లు కొట్టుకునే 12మంది గ్రామస్థులను కమ్యూనిస్టులుగా పొరబడి, అప్పటి స్పెషల్ కమిషనర్ ఆనందప్ప అధ్వర్యంలో కాల్చి చంపిన వార్తను పత్రికలకు పంపాడని, ఆచార్యను మూడు రోజులు పోలీసులు నిర్బంధించారు. ఆ వార్త ఎలా వచ్చిందో చెప్పాలంటూ ఆయన్ను చిత్రహింసలు పెట్టారట! కానీ ఆచార్య నోరు విప్పలేదు. నాటి కలెక్టర్ పళనియప్పన్ జోక్యంతో విడుదల అయ్యారు.
ఆచార్యకు పత్రికలే ప్రాణం. వాటి తోడిదే జీవనం. జె.పి.ఎన్ రోడ్డులోని ప్రెస్సు ప్రాంగణం ఖాళీ చేయాల్సి రావడంతో... ప్రెస్సు, వరంగల్ వాణి పేపర్ అమ్మాల్సి వచ్చింది. జనధర్మను పునఃప్రారంభించాలని ప్రయత్నించారు. కానీ, ప్రెస్ అమ్మిన కొద్ది నెలలకే గుండెపోటుతో మరణించారు. ‘మళ్ళీ పేపర్ నడిపి, పదిమందికి ఉపాధి కల్పిద్దామనుకుంటే వీలు కాదాయె’ అని అంతిమ క్షణాలలో బాధ పడ్డారాయన. ఎమ్మెస్ ఆచార్య జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
డా. యం. రాజగోపాలాచార్య
విశ్రాంతాచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం
(రేపు కేయూలో ఎమ్మెస్ ఆచార్య స్మారకోపన్యాసం)
ఇవి కూడా చదవండి..
26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 13 , 2025 | 05:49 AM