Faridabad Terror Plot: జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:01 PM
ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో అరెస్టైన లఖ్నవూ డాక్టర్ షాహీన్‌కు భారత్‌లో మహిళా ఉగ్రవాదుల నాయకత్వ బాధ్యతలను పాక్ ఉగ్ర సంస్థ జైష్ ఏ మహ్మద్ అప్పగించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన పోలీసులు ఓ మహిళా డాక్టర్ కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కుట్ర మూలాలను తెలుసుకునేందుకు పోలీసులు ఆమెను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఉగ్రవాదిగా మారిన మహిళా డాక్టర్ షాహీన్ షాహిద్‌కు.. భారత్‌లో మహిళా ఉగ్రవాదుల బృందం ఏర్పాటు బాధ్యతలను జైష్-ఏ-మహ్మద్ ఉగ్రసంస్థ అప్పగించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు (Woman Doctor Linked to Jaish-e-Mohammad).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాక్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మహ్మద్ అధినేత మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నాయత్వంలో ఈ మహిళా ఉగ్రమూకల బృందం ఏర్పాటైంది. భారత ఉపఖండంలో మళ్లీ తన ఉనికిని చాటుకునేందుకు జైష్ ఏ మహ్మద్ తొలిసారిగా మహిళా ఉగ్రవాదులను రంగంలోకి దించేందుకు నిర్ణయించింది. భారత్‌లో ఈ మహిళా ఉగ్రవాదుల కార్యకలాపాల బాధ్యతను డా. షాహీన్ నిర్వహించినట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. డా. షాహీన్ లఖ్నవూ వాస్తవ్యురాలు (Faridabad Terror Plot).
ఫరీదాబాద్‌లో ఉగ్ర కుట్ర పన్నిన మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి నిషేధిత జైష్ ఏ మహ్మద్, అన్సార్ గజవత్ ఉల్ హింద్ ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డా. ముజమిల్ షకీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌కు చెందిన అతడు ఫరీదాబాద్‌లోని అల్‌ఫలా యూనివర్సిటీలో బోధిస్తున్నట్టు గుర్తించారు. ఇదే యూనివర్సిటీతో షాహీన్‌కు కూడా సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. వీరి అరెస్టు నేపథ్యంలో మరో ఉగ్రవాది డా.ఉమర్ కంగారు పడి ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఢీల్లీ కారు పేలుడుకు కొన్ని నిమిషాల ముందు వాహనంలో అతడు ఉన్నట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డయిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి అప్పగింత
ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి