ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump False Statements: అబద్ధమే ట్రంప్ ఆయుధం

ABN, Publish Date - Aug 14 , 2025 | 03:04 AM

నికోలో మాకియవెల్లి (1469–1527), పాలకుడు కానప్పటికీ, తన ‘ది ప్రిన్స్’ పుస్తకంలో పాలకులు రాజ్య స్థిరత్వం కోసం వ్యూహాత్మకంగా మోసం చేయవచ్చునని సలహా ఇచ్చాడు. క్లియోపాత్రా మోసపూరిత దౌత్యంలో ప్రసిద్ధి చెందింది...

నికోలో మాకియవెల్లి (1469–1527), పాలకుడు కానప్పటికీ, తన ‘ది ప్రిన్స్’ పుస్తకంలో పాలకులు రాజ్య స్థిరత్వం కోసం వ్యూహాత్మకంగా మోసం చేయవచ్చునని సలహా ఇచ్చాడు. క్లియోపాత్రా మోసపూరిత దౌత్యంలో ప్రసిద్ధి చెందింది. నీరో చక్రవర్తి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రత్యర్థులను తొలగించడానికి అబద్ధాలను ఉపయోగించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన మొదటి ఎలిజబెత్ రాణి దౌత్యంలో వ్యూహాత్మక మోసం వాడటంలో పేరు పొందింది. సోవియట్ నాయకుడు స్టాలిన్ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తప్పుడు ప్రచారాన్ని, సమాచారాన్ని ఉపయోగించాడు. ఇలా చరిత్రలో చాలా మంది పాలకులు రాజకీయ లక్ష్యాలను సాధించడానికి మోసపూరితంగా ప్రవర్తించారని చరిత్రకారులు రికార్డు చేశారు. ఈ క్రమంలోకి చక్కగా ఒదిగిపోయే నాయకుడు, వీరికి వర్తమానంలో వారసుడు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

అమెరికా రాజకీయ చరిత్రలోనే అతి ఎక్కువ తప్పుదారి పట్టించే ప్రకటనలు చేసిన నాయకుడిగా ట్రంప్‌ను పత్రికలు, పరిశోధకులు గుర్తించారు. ట్రంప్ తన అధ్యక్ష పదవీకాలంలో 30,573 తప్పుదారి పట్టించే వాదనలు చేశారని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక నమోదు చేసింది. అంటే రోజుకి సగటున 21 కంటే ఎక్కువ తప్పుడు వ్యాఖ్యలు అన్నమాట. సీఎన్ఎన్ రికార్డుల ప్రకారం ట్రంప్‌ ఒక్క ఇంటర్వ్యూలోనే 32 తప్పుడు వాదనలు, ఒక ప్రసంగంలోనే 18 తప్పుడు వాదనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన తప్పుడు వ్యాఖ్యలు ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాల పెరుగుదల, తయారీ రంగం విస్తరణ వంటి విషయాలలో కనిపించాయి. ఉదాహరణకు, చైనాపై విధించిన సుంకాలను ‘‘చైనా చెల్లిస్తోంది’’ అని మళ్ళీ మళ్ళీ చెబుతూ వచ్చాడు. కానీ వాస్తవానికి ఆ భారాన్ని అమెరికా దిగుమతిదారులే మోశారని అధ్యయనాలు నిరూపించాయి. అలాగే, తయారీ రంగంలో రికార్డు స్థాయిలో వృద్ధి జరిగిందని, కోట్ల ఉద్యోగాలు సృష్టించానని చెప్పినా, గణాంకాలు దీనికి విరుద్ధం. కరోనా సమయంలో కూడా ట్రంప్ తప్పుడు వ్యాఖ్యాల ప్రభావం తీవ్రంగా కనిపించింది. కోవిడ్‌ తీవ్రతను తక్కువ చేసి చూపుతూ, దానిని సాదాసీదా ఫ్లూతో పోల్చాడు. మరణాల శాతం తక్కువగా ఉందని చెప్పాడు. 2020 ఎన్నికల ఫలితాలపై ఆయన చేసిన తప్పుడు ఆరోపణలు అమెరికాలో విస్తృతమైన అపోహలను సృష్టించాయి. ఎన్నికల్లో మోసం జరిగిందని మళ్ళీ మళ్ళీ చెబుతూ వచ్చినా– అన్ని చట్టపరమైన పరిశీలనలు, కోర్టు తీర్పులు ఆ ఆరోపణలను ఖండించాయి. వలసదారులు, నేరాల గణాంకాల గురించి కూడా ఆయన అనేక వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

ప్రభుత్వ సంస్థల నమ్మకాన్ని దెబ్బతీయడంలో కూడా ట్రంప్‌ పద్ధతి ప్రత్యేకం. తన వాదనలకు విరుద్ధంగా గణాంకాలు చెప్పిన ఫెడరల్ అధికారులను విమర్శించడం, లేదా తొలగించడం, తనకు ప్రతికూలమైన డేటాను ‘‘నకిలీ’’ అని పిలవడం చేశారు. పరిశీలకులు దీన్ని ‘‘ఫైర్‌హోసింగ్’’ అంటున్నారు. అంటే తప్పుదారి పట్టించే సమాచారాన్ని పెద్ద ఎత్తున, వేగంగా, నిరంతరాయంగా వెల్లువెత్తించి, ప్రజల విమర్శనాత్మక ఆలోచనను చంపివేయడం. దీనివల్ల వాస్తవం ఏమిటో నిర్ధారించడం కష‌్టమవుతుంది. ఈ శైలి ఇప్పుడు ట్రంప్‌ రెండవసారి అధ్యక్షుడైన తరువాత మరింత తీవ్రస్థాయిలో నడుస్తోంది. ఆర్థిక వ్యవస్థ, ఔషధ ధరలు, రాజకీయ విజయాలు వంటి అనేక అంశాల్లో తప్పు అని తేలిన వాదనలనే ఆయన తిరిగి తిరిగి చెబుతున్నాడు. ఈ తప్పుడు వ్యాఖ్యలు మీడియా, ప్రభుత్వ సంస్థలు, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకాన్ని క్రమంగా దెబ్బతీసి, అమెరికా రాజకీయ సంభాషణనే మౌలికంగా మార్చేశాయి.

వర్తమాన కాలాన్ని సత్యానంతర (Post–Truth) కాలం అంటున్నారు. ఇందులో వాస్తవాల కంటే భావోద్వేగాలు, వ్యక్తిగత నమ్మకాలు ఎక్కువగా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితిలో, స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నా కూడా, తమ భావాలకు లేదా అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్న విషయాలనే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. పక్షపాతపూరిత వార్తా మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం మరింత విస్తరిస్తుంది. ఈ మధ్యకాలంలో సత్యానంతరత గురించి అనేక పుస్తకాలు, అధ్యయనాలు వచ్చాయి. అన్నీ కూడా ట్రంప్‌నే ఉదాహరణగా చూపించటం గమనార్హం.

ట్రంప్ చెప్పిన, చెపుతున్న అబద్ధాలకు అంతులేదు. గాజా గురించి మాట్లాడుతూ ‘‘నేను అక్కడికి వెళ్లాను, అది చాలా సంక్లిష్ట ప్రదేశం’’ అన్నాడు. అయితే, ఆయన గాజాకు ఎప్పుడూ వెళ్లినట్టు ఎలాంటి ఆధారాలూ లేవు. ఏ రికార్డులూ ట్రంప్‌ గాజా ప్రయాణాన్ని నిర్ధారించలేదు. ఎందుకంటే అసలు అలాంటి ప్రయాణం జరగనేలేదు. సీఎన్‌ఎన్‌ లాంటి వార్తా సంస్థలు దాన్ని తప్పుడు ప్రచారంగా కొట్టివేశాయి. అలాగే, ‘‘హమాస్ దాడులు అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బుతో జరిగాయి’’ అనీ, ‘‘బైడెన్ ప్రభుత్వమే ఇందుకు కారణం’’ అనీ ట్రంప్‌ అన్నాడు. ఈ వాదన పూర్తిగా తప్పు. ఈ నిధులు ఇరాన్‌కు మానవతా సహాయం రూపంలో (ఆహారం కోసం, మందులు కోసం) ఇచ్చినవి, సైనిక ప్రయోజనాల కోసం కాదు. గాజాకు పంపిన ఆహార సరఫరాలను హమాస్ దొంగిలించి, అమ్మేస్తోందని కూడా ట్రంప్ ఆరోపించాడు. అయితే అమెరికా ప్రభుత్వ నివేదికల్లో దీనికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. గాజాలో పెద్ద సంఖ్యలో పౌరుల మరణాలకు ఇజ్రాయెల్ కారణమని ట్రంప్ అన్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయింది. కానీ ఇది కృత్రిమ మేధ (AI) ద్వారా తయారు చేసిన నకిలీ వీడియో అని తరువాత బయటపడింది. ట్రంప్ అలాంటి వ్యాఖ్య చేసిన రికార్డు ఎక్కడా లేదు. అంతకంటే ముఖ్యంగా, ఇజ్రాయెల్–హమాస్ కాల్పుల విరమణకు తానే ప్రధాన కారణమని ప్రచారం చేసుకున్నాడు. వాస్తవానికి కాల్పుల విరమణ చర్చలు ట్రంప్‌ ప్రమేయానికి ముందే ప్రారంభమయ్యాయి.

మరింత విచిత్రంగా, ఎటువంటి సంకోచం లేకుండా ట్రంప్ అనేకసార్లు తాను భారత్–పాకిస్థాన్‌ మధ్య యుద్ధం అణుయుద్ధం అయ్యే ప్రమాదాన్ని ఆపేశానని చెప్పుకున్నాడు. ఇరుదేశాలతో ఉన్న అన్ని వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తానని బెదిరించడం వల్లే యద్ధం ఆగిందన్నాడు. అయితే, భారత అధికారులు ఈ కథనాన్ని పూర్తిగా ఖండించారు. కాల్పుల విరమణ అనేది భారత–పాకిస్థాన్‌ సైనిక వ్యవస్థల మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమని, ఎటువంటి బయటి మధ్యవర్తిత్వం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా ట్రంప్ కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రధాని మోదీ తన మధ్యవర్తిత్వాన్ని కోరాడని అన్నాడు. దీనిని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెంటనే ఖండించింది.

‘‘నాయకులు తమ అబద్ధాలకు సరిపడేలా వాస్తవాన్ని మలచుకునే అధికారాన్ని పొందే ముందు నుంచే, వాళ్ళు వాస్తవాల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని, నిరాదరాన్ని చూపుతారు. వాళ్ళకి నిజం అనేది స్వతంత్రంగా ఉండే విషయం కాదు. దాన్ని సృష్టించగల, మార్చగల మనిషి శక్తిపైనే అది ఆధారపడుతుందని వాళ్ళు నమ్ముతారు,’’ అని అంటుంది హానా అరెండ్ (Hannah Arendt) తన రచన ‘The Origins of Totalitarianism’లో. కచ్చితంగా ట్రంప్ చేసింది, చేస్తున్నది అదే. తప్పుదారి పట్టించే వాదనల వెనుక ట్రంప్‌కు ఉన్న కారణాలు మానసిక, వ్యూహాత్మక, సాంస్కృతిక కారకాల మిశ్రమం నుంచి పుట్టాయనుకోవచ్చు. ట్రంప్ ‘స్వయం ప్రేమ’ (Narcissistic) లక్షణాలను ప్రదర్శిస్తాడని, స్వీయ–గొప్పతనం కోరుకుంటాడని, అపరాధ భావన లేకుండా అబద్ధాలు చెబుతాడని పరిశీలకులు అంటున్నారు. ట్రంప్‌ అబద్ధాలన్నీ ప్రజా విశ్వాసాన్ని, ప్రజాస్వామ్య ప్రక్రియలను దెబ్బతీసేవే.

జార్జ్ ఆర్వెల్ అన్నట్లుగా రాజకీయ భాష అబద్ధాలను సత్యంగా అనిపించేలా, హత్యను గౌరవనీయంగా కనిపించేలా, గాలికి దృఢమైన రూపాన్ని కలిగించేలా చేయగలదు. ఈ భాష పట్ల స్పృహ కలిగి ఉండటం నేటి అవసరం. అలాగే ‘‘అనంత జ్ఞానానికి ద్వారం తెరవడం మాత్రమే కాదు, అనంత తప్పిదాలకు హద్దు విధించడం’’ కూడా ఇవ్వాళ అత్యంత అవసరమైన అంశం.

ప్రొ. బి. తిరుపతిరావు

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం

ఈ వార్తలు కూడా చదవండి..

సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..

రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్

For More National News And Telugu News

Updated Date - Aug 14 , 2025 | 03:04 AM