Chevireddy Bhaskar Reddy: రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:02 PM
ఏపీలోని లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ మరోసారి పొడిగించింది. ఈ నేపథ్యంలో నిందితులను జైలుకు తరలించే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్‌చల్ చేశారు.
విజయవాడ, ఆగస్ట్ 13: లిక్కర్ స్కామ్ కేసులోని 12 మంది నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఆగస్ట్ 26వ తేదీ వరకు వీరికి రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం నిందితులను కోర్టు నుంచి పోలీసులు జైలుకు తరలించారు. ఆ క్రమంలో వారిని జీపు ఎక్కించే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి హడావుడి చేశారు. తానేమీ తప్పు చేయలేదని.. అన్యాయంగా తనను ఈ కేసులో ఇరికించారంటూ చెవిరెడ్డి ఆవేశంతో బిగ్గరగా అరిచారు.
అంతేకాకుండా.. అక్రమంగా తమపై కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారంటూ మండిపడ్డారు. తాను బ్రాహ్మణ పిల్లల కోసం వేద పాఠశాలను నడుపుతున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా మొదటి నుంచీ తాను మద్యానికి దూరమని స్పష్టం చేశారు. తాను మద్యం ముట్టను.. విక్రయించను.. విక్రయించలేదంటూ చెవిరెడ్డి బిగ్గరగా వ్యాఖ్యలు చేశారు.
అయితే తమపై రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు పెట్టండంటూ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు. తాను చిన్ననాటి నుంచి దూరం పెట్టిన మద్యం కేసును తనపై మోపడం అన్యాయమన్నారు. ఈ ప్రభుత్వ పెద్దలు తప్పు చేశారని విమర్శించారు. దానిని కప్పి పుచ్చుకునేందుకు ఇంకో తప్పు చేస్తున్నారని ఆరోపించారు. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు.. తప్పకుండా తగిన శిక్ష అనుభవిస్తారంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిప్పులు చెరిగారు.
ఇవి కూడా చదవండి
అభిమానిని తోసేసిన జయా బచ్చన్.. దెబ్బకు జడుసుకున్నాడు..
లిక్కర్ కేసు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్..
For More Andhrapradesh News And Telugu News