Share News

Sonia Gandhi: సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:09 PM

ఇటలీలో సోనియా గాంధీ జన్మించారు. ఆమె అసలు పేరు ఎడ్విజ్ ఆంటోనియా అల్బనా మైనో. 1968లో రాజీవ్‌గాంధీని ఆమె వివాహం చేసుకున్నారు. అనంతరం వారు ఇండియాకు వచ్చేశారు.

Sonia Gandhi: సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
Congress MP Sonia Gandhi

న్యూఢిల్లీ, ఆగస్ట్ 13: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితా విషయంలో ఎన్నికల సంఘం వైఖరిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తప్పు పడుతున్నారు. అలాంటి వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. విదేశీయురాలు సోనియా గాంధీ.. భారత్ పౌరురాలిగా గుర్తింపు పొందకుండానే.. దేశంలోని ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారని ఆరోపించారు. ఇటలీకి చెందిన ఆమె.. భారతీయ పౌరసత్వం లేకుండానే ఓటర్ల జాబితాలో పేరు చేర్చారని విమర్శించారు. 1980లోనే ఆమె ఓటరు జాబితాలో చోటు సంపాదించారని వివరించారు.


ఇక బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యా.. తన ఎక్స్ ఖాతా వేదికగా సోనియా గాంధీ ఓటర్ల జాబితాలో పేరు పొందిన పత్రాన్ని పోస్ట్ చేశారు. 1980లో సఫ్దర్‌జంగ్ రోడ్డులోని పోలింగ్ కేంద్రానికి చెందిన ఓటర్ల జాబితాలో సోనియా పేరు ఉందని ఆయన సోదాహరణగా వివరించారు. ఈ ఓటర్ల జాబితాలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, సోనియా గాంధీతోపాటు మేనకా గాంధీ పేర్లు ఉన్నాయన్నారు. అయితే ఈ ఓటర్ల జాబితాలో సోనియా గాంధీ పేరు చేర్చిన సమయంలో ఆమె ఇటలీ జాతీయురాలుగానే కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ మాలవ్యా గుర్తు చేశారు.


సోనియా గాంధీ అసలు పేరు ఎడ్విజ్ ఆంటోనియా అల్బనా మైనో అని ఆయన పేర్కొన్నారు. 1946లో ఆమె జన్మించారని చెప్పారు. 1968లో రాజీవ్‌గాంధీని ఆమె వివాహం చేసుకుని.. ఆ తర్వాత వారు ఇండియాకు వచ్చేశారని వివరించారు. అయితే 1950 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం.. భారతీయ పౌరసత్వం లేకుంటే.. ఓటర్ల జాబితాలో పేరు చేర్చేందుకు అర్హత లేదంటూ అమిత్ మాలవ్య ఈ సందర్భంగా కుండ బద్దలు కొట్టారు.


ఇక 1980, జనవరిలో న్యూఢిల్లీ లోక్ సభ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాను సవరించారని చెప్పారు. ఈ సందర్భంగా 145 పోలింగ్ కేంద్రంలో 138 సీరియల్ నెంబర్‌ సోనియా గాంధీకి కేటాయించారని చెప్పారు. అనంతరం ఈ వ్వవహారం బహిర్గతం కావడంతో.. ప్రజా నిరసన వెల్లువెత్తిందన్నారు. దీంతో ఈ జాబితా నుంచి సోనియా గాంధీ పేరును తొలగించారని చెప్పారు. ఆ తర్వాత అంటే.. అంటే 1983, జనవరిలో ఓటర్ల జాబితాలో సోనియా పేరు తిరిగి చేర్చారని గుర్తు చేశారు. అయితే 1983, ఏప్రిల్‌లో సోనియా గాంధీ భారతీయ పౌరసత్వాన్ని పొందారన్నారు.


అంతేకాదు.. రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత భారత పౌరసత్వాన్ని అంగీకరించడానికి ఆమెకు 15 ఏళ్లు ఎందుకు పట్టిందని తాము ప్రశ్నించడం లేదన్నారు. మరి భారతీయ పౌరసత్వం పొందకుండానే.. ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చడం ఎన్నికల దుర్వినియోగం కాకుంటే మరలేమిటని అమిత్ మాలవ్యా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బిహార్ ఓటరు సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్

For More National News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 04:14 PM