ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Laszlo Krasznahorkai: కూలుతున్న ప్రపంచాల నైరాశ్యం

ABN, Publish Date - Oct 13 , 2025 | 06:10 AM

ప్రపంచం ఇక అంతాన్ని సమీపించింది. కానీ ఆ అంతం ఒక అగ్ని వర్షం గానో, జల ప్రళయం గానో ఒక్క పెట్టున వచ్చిపడేది కాదు. ఒక నైతిక పతనంగా, భౌతిక క్షయంగా, అతిమెల్లగా దాపురిస్తుంది. – ఇదీ లాస్లో క్రస్నహోర్కాయ్‌ నవలల్లోని వాతావరణం...

ప్రపంచం ఇక అంతాన్ని సమీపించింది. కానీ ఆ అంతం ఒక అగ్ని వర్షం గానో, జల ప్రళయం గానో ఒక్క పెట్టున వచ్చిపడేది కాదు. ఒక నైతిక పతనంగా, భౌతిక క్షయంగా, అతిమెల్లగా దాపురిస్తుంది. – ఇదీ లాస్లో క్రస్నహోర్కాయ్‌ నవలల్లోని వాతావరణం. అతని తొలి రెండు ప్రసిద్ధ నవలల్లోనూ ప్రపంచం ఇక రేపో మాపో అంతం కాబోతుందన్న గుబులు ఉంటుంది. ఆ అంతానికి కారణం ఏమిటన్నది స్పష్టంగా వ్యక్తం కాదు. కానీ నవలల్లోని పాత్రలన్నీ ఆ సమీపిస్తున్న అంతాన్ని నిశ్శబ్దంగా ఒప్పుకున్నట్టే ప్రవర్తిస్తాయి. చుట్టూ క్రమంగా శిథిలమై కూలుతున్న ప్రపంచాల మధ్య తమని కాపాడే ఆశ కోసం ఎదురు చూస్తుంటాయి. ఆ ఆశ ఎప్పటికీ రాదు. ఒక్కోసారి ఎవరో రాబోయే మనిషి తమని కాపాడతాడన్న ఎదురుచూపు ఉంటుంది. కానీ ఆ వచ్చిన మనిషి తన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతాడు.

లాస్లో క్రస్నహోర్కాయ్‌ (Laszlo Krasznahorkai)కు ఇలాంటి ఇతివృత్తాలను సరఫరా చేసింది అతని స్వదేశమైన హంగరీలో ఆనాటి రాజకీయ వాతావరణమే అనుకోవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత హంగరీ సోవియట్‌ రష్యా అధీనం లోని ఒక దేశంగా మారింది. స్టాలిన్‌ అదుపాజ్ఞల కింద హంగరీలో కూడా కమ్యూనిస్ట్‌ పాలన మొదలైంది. స్టాలిన్‌ చనిపోయాకా 1956లో హంగరీలో రష్యన్‌ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం మొదలైనప్పటికీ, రష్యా దాన్ని యుద్ధటాంకులతో హింసాత్మకంగా అణచివేసింది. ఆ తర్వాత ఇక 1989 దాకా హంగరీలో కమ్యూనిస్టు పాలనే కొనసాగింది. ఈ కాలమంతా ప్రజల సామాజిక జీవితం భయం, అణచివేతల మధ్య గడిచింది. 1960ల నుంచి క్రమంగా హంగరీపై రష్యా అదుపు తగ్గించుకుంటూ వచ్చినా, ప్రజలకు స్వేచ్ఛ మాత్రం పరిమితమే. లాస్లో క్రస్నహోర్కాయ్‌ బాల్యం, యవ్వనం అంతా ఈ వాతావరణంలోనే గడిచింది. 1989లో తన 35 ఏళ్ళ వయస్సులో కమ్యూనిస్టు పాలన ముగిసిన సందర్భాన్ని తలచుకుంటూ, ‘‘ఆ రాజకీయ స్వేచ్ఛ నమ్మశక్యం కాని విషయంలా అనిపించింది,’’ అంటాడు లాస్లో.‍‍‍ ‘‘అప్పటి దాకా అదో కాలం కదలని సమాజం. పరిస్థితులు ఎప్పటికైనా మారతాయన్న ఆశలేకుండా చేశారు పాలకులు. ఎప్పుడూ అదే బూడిదరంగు ఆకాశం, కళా కాంతుల్లేని చెట్లు, పార్కులు, వీధులు, భవనాలు, నగరాలు. చవక బార్లు, పేదరికం, మాటపై నిషేధం. మార్క్సిజంపై నమ్మకం కోల్పోయిన తొలి తరం మాది,’’ అంటాడు.

లాస్లో క్రస్నహోర్కాయ్‌ 1954లో జ్యులా పట్టణంలో పుట్టాడు. అతని అసలు ఇంటి పేరు ‘కొరీన్‌’. కానీ అంతకుముందు హిట్లర్‌ చెలరేగిన కాలంలో తమని యూదులుగా పట్టించి వేసే ప్రమాదం ఉన్న ఆ ఇంటి పేరును లాస్లో తాతయ్య ‘క్రస్నహోర్కాయ్‌’గా మార్చాడు. (అది హంగరీలో ఒక పాత కోట పేరు.) తనకు యూదు మూలాలు ఉన్నాయన్న సంగతి లాస్లోకి కూడా పదకొండేళ్ల వయసు వచ్చే దాకా తెలియదు.

పంతొమ్మిదేళ్ళ వయసులో– నిర్బంధ మిలటరీ పని నుంచి తప్పించుకోవాలని కొంతా, దాస్తవిస్కీ లాంటి పంతొమ్మిదో శతాబ్దం రష్యన్ రచయితల ప్రభావంతో కొంతా– లాస్లో క్రస్నహోర్కాయ్‌ ఇల్లు వదలి పేద ప్రజల మధ్యకు వెళ్ళి చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం మొదలుపెట్టాడు. గనుల్లో కూలీ పని నుంచి డైరీ ఫార్మ్‌లో నైట్ వాచ్‌మన్‌ పని దాకా రకరకాల ఉద్యోగాలు చేస్తూ హంగరీ అంతా దేశదిమ్మరిలా తిరిగాడు. రాత్రిపూట డైరీ ఫార్మ్‌లో వందలాది ఆవులకు కాపలా కాస్తూనే తన తొలి నవల ‘సాటాన్‌టాంగో’ (Satantango) రాశాడు. వర్షపు బురద నిండిన వీధులూ, కూలిపోతున్న ఇళ్లూ, ఏదీ పండని సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు, పాడైపోయిన మిల్లులు, పేద జనం మసిలే ఇరుకుబార్లు... ఇదీ నవలకు నేపథ్యం. (ఈ నవలను దర్శకుడు బేలా టార్‌ 1994లో ఏకంగా ఏడున్నర గంటల సినిమాగా తీశాడు!)

లాస్లో అంత సులువుగా చదివించే రచయిత కాదు. అతని నవలల్లోని పాత్రలు కదలని కాలంలో చిక్కుకుపోయి ఉన్నట్టు గానే, వాటిని చదివే పాఠకుడు కూడా ఆ ఎడతెగని వాక్యాల వరద మధ్య చిక్కుకుపోతాడు. వేగంగా కదులుతూ కూడా ఎటూ పోని లాస్లో వాక్యాలు చాలా పొడవుగా ఉంటాయి. పేరాల విభజన లేకుండా, ఫుల్‌స్టాపులు కూడా లేకుండా పేజీలకు పేజీలు కొనసాగుతాయి. ‘‘ఫుల్‌స్టాప్‌ అవసరం ఉన్నది దేవుడు ఒక్కడికే. అంతా ముగిసే అంతంలో ఒక ఫుల్‌స్టాప్‌ వాడతాడు తప్పకుండా,’’ అంటాడు. ఆయన ప్రసిద్ధ నవల ‘సాటన్‌టాంగో’లో మొదటి వాక్యమే ఆరు పేజీల పాటు ఏ ఫుల్‌స్టాప్‌ లేకుండా కొనసాగుతుంది! ‘‘ఒక స్నేహితుడితో పాటూ కూర్చుని రాత్రి పూటంతా మేల్కొని మన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని అతనికి అర్థమయ్యేలా చెబుతున్నప్పుడు, మన మాటలకి ఫుల్‌స్టాపులూ కామాలూ అవసరం లేదు. మాట్లాడేందుకు ఊపిరీ, మాటల్లో లయా మాత్రమే కావాలి. నేను పుల్‌స్టాపులు తక్కువ వాడాలనీ, పొడవాటి వాక్యాలు మాత్రమే రాయాలనీ ఏమీ నియమం లాగ పెట్టుకోలేదు. పాఠకుడిని చేరువ చేసుకుని అతన్ని కన్విన్స్‌ చేయటానికి కథ చెప్తున్నప్పుడు నాకు ఆ లయా, ఆ రాగం, అలాంటి వాక్య నిర్మాణం సహజంగా వచ్చేశాయి,’’ అంటాడు.

యవ్వనంలో తన చుట్టూ చవి చూసిన రాజకీయమైన ఉక్కపోత లాస్లో రచనల ఇతివృత్తాలను, శైలిని నిర్దేశించింది. అయితే అతను తన రచనలను నిరంకుశ రాజకీయ వ్యవస్థలపై ఎక్కుపెట్టలేదు. అలాంటి వ్యవస్థల కింద సమాజం క్రమ క్రమంగా క్షీణించే తీరుపై ఎక్కువ దృష్టిపెట్టాడు. ఇక అంత్య దశకు వచ్చేసిన ప్రపంచం ఏదో మహా విపత్తు వైపు క్రమంగా జారుతున్న వాతావరణం అతని నవలల నిండా పరుచుకుని ఉంటుంది. ‘‘మనం ఏ మహా ప్రళయం (apocalypse) కోసమూ ఎదురు చూడనక్కర్లేదు. ఎందుకంటే మనం మహా ప్రళయం లోనే జీవిస్తున్నాం,’’ అంటాడు. ఈ విపత్తు నుంచి తప్పించుకునేందుకు మనుషులు దేని మీద ఆశపెట్టుకున్నా అది చివరకు వాళ్ళని మోసమే చేస్తుంది. కానీ లాస్లో దృష్టిలో ఆశ ఎంత నిష్ఫలమైనప్పటికీ అది ఎంతో అవసరం కూడా. అలాంటి ఆశను ప్రజల నుంచి లాక్కోవటం కళ చేయాల్సిన పని కాదంటాడు. ‘‘మానవ జీవిత నైరాశ్యాన్ని ఉన్నది ఉన్నట్టు చూపిస్తానే కానీ మనుషుల నుంచి ఆశను లాగేసుకోవటం నా ఉద్దేశం కాదు,’’ అంటాడు.

ఈ ఏడాది నోబెల్‌ సాహిత్య బహుమతిని లాస్లో క్రస్నహోర్కాయ్‌కు ప్రకటిస్తూ, ‘‘ప్రపంచం అంతం కానున్నదనే భయావహ వాతావరణం మధ్య కళని శక్తివంతంగా నిలబెట్టిన అతని దార్శనిక రచనలకు ఈ బహుమతిని ఇస్తున్నాం,’’ అంది నోబెల్‌ కమిటీ. ఈ సందర్భంగా అతని స్పందన కోరుతూ ఒక విలేకరి, ‘‘మీ రచనల్ని నడిపించేది ఏమిటి?’’ అని అడిగితే, ‘‘అక్కసు’’ (bitterness) అని జవాబు ఇచ్చాడు లాస్లో. ‘‘ఇప్పుడు ప్రపంచం ఏ పరిస్థితిలో ఉందో చూస్తే బాధ కలుగుతుంది. అదే నా రచనలకి లోతైన ప్రేరణ,’’ అన్నాడు.

n ఎన్‌. వసంత్‌

ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 06:11 AM