Ladakhs Demand for Self Governance: లద్దాఖ్‌కు కొత్త పాలనా నమూనా
ABN, Publish Date - Oct 16 , 2025 | 03:27 AM
జమ్మూ–కశ్మీర్‌లో భాగంగా ఉన్న లద్దాఖ్‌ను 2019లో కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా ఏర్పాటు చేశారు. హిమాలయాల చెంతన సున్నితమైన పర్యావరణ వ్యవస్థతో మనుగడ సాగిస్తున్న తమ ప్రాంతం శీఘ్ర అభివృద్ధికి నోచుకోగలదని లద్దాఖీలు...
జమ్మూ–కశ్మీర్‌లో భాగంగా ఉన్న లద్దాఖ్‌ను 2019లో కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా ఏర్పాటు చేశారు. హిమాలయాల చెంతన సున్నితమైన పర్యావరణ వ్యవస్థతో మనుగడ సాగిస్తున్న తమ ప్రాంతం శీఘ్ర అభివృద్ధికి నోచుకోగలదని లద్దాఖీలు ఆశించారు. రాజకీయవేత్తలు, పాలనాధికారులు, ఉపాధి, ఉద్యోగాలను ఆశిస్తున్న యువజనులు తమ ఆకాంక్షలు నెరవేరే శుభ తరుణం ఆసన్నమయిందని యూటీ ఆవిర్భావాన్ని స్వాగతించారు. అయితే గత ఆరు సంవత్సరాలుగా ఎవరి ఆకాంక్షలు, ఆశాభావాలు నెరవేరనేలేదు. ఆందోళనలు, నిరాహార దీక్షలు, న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు కొనసాగుతున్నాయి. జమ్మూ–కశ్మీర్‌లో భాగంగా ఉన్నప్పుడు రాష్ట్ర కేబినెట్‌లో కనీసం తమ ప్రతినిధి ఒకరు ఉండేవారని, ఇప్పుడు బయటి నుంచి వచ్చిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చేతుల్లోనే సమస్త అధికారాలు కేంద్రీకృతమయ్యాయని లద్దాఖీలు వాపోతున్నారు. తమ న్యాయబద్ధమైన ‘స్వయం పాలనాహక్కు’ను కోల్పోయామని ఆగ్రహిస్తున్నారు. లోక్‌సభలో తమకు రెండు సీట్లు కేటాయించాలని, లేహ్‌తో పాటు కార్గిల్‌కు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని లద్దాఖీలు డిమాండ్ చేస్తున్నారు. 1990ల్లోనే లద్దాఖ్‌ను యూటీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లద్దాఖీలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. హింసాత్మకంగా పరిణమించిన ఆ ఉద్యమాన్ని అదుపు చేసేందుకు జరిగిన పోలీసు కాల్పుల్లో పలువురు మరణించారు 2019లో యూటీ ప్రతిపత్తి లభించడంతో లద్దాఖ్‌కు ఢిల్లీ తరహాలో శాసనసభ ఉన్న యూటీగా చేయాలని లేదా భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూలులో చేర్చాలని లద్దాఖీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లను రాజ్యాంగ నిబంధనలు, ప్రజాస్వామిక పాలనా పద్ధతుల ఆచరణ ప్రాతిపదికన నిశితంగా పరిశీలించవలసిన అవసరమున్నది.
1956లో భాషా ప్రయుక్తత సూత్ర ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దేశ సమగ్రత, సమైక్యతను సంరక్షించుకునే లక్ష్యంతో సరిహద్దు ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ పరిశీలనకు వచ్చింది. అయితే బాహ్య సరిహద్దులు స్థిరమైనవని, అంతర్గత సరిహద్దులు పార్లమెంటు ఆమోదంతో మార్పు పొందగలిగేవని రాజ్యాంగంలోని అధికరణ 3 నిర్దేశించినందున ఆ ప్రతిపాదనను పరిశీలనకు తీసుకోలేదు. పశ్చిమ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1964) కేసులో ఆరుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ‘రాష్ట్రాల సరిహద్దుల మార్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన హామీ ఏమీ లేదని’ విపులంగా వివరిస్తూ ఆ ధర్మాసనం తన తీర్పును ఇలా ముక్తాయించింది: ‘రాష్ట్రాల సరిహద్దులు మార్చేందుకు లేదా ఒక రాష్ట్రం భౌగోళిక వైశాల్యాన్ని కుదించేందుకు కూడా పార్లమెంటుకు అధికారమున్నది’. కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజధాని ప్రాంత (ఢిల్లీ) ప్రభుత్వం మధ్య అధికారాల విభజన విషయాన్ని పరిశీలించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మే 2023లో ఈ క్రింది అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది: ‘ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలను ఢిల్లీ నమూనా కేంద్ర పాలిత ప్రాంతంతో పోల్చడానికి వీలు లేదు. ఎన్‌సిటి (ఢిల్లీ) ఒకే ఒక్కటి. దాని తరహా కేంద్ర పాలిత ప్రాంతం మరొకటి లేదు. ఢిల్లీ నమూనాను మరే కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటులో అనుసరించడానికి వీలులేదు’.
లద్దాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో చేర్చాలన్న డిమాండ్ విషయాన్ని చూద్దాం. సున్నితమైన హిమాలయ పర్వత పర్యావరణ వ్యవస్థ ఉన్న లద్దాఖ్‌లోని గిరిజనుల ప్రత్యేక జీవన సంస్కృతిని సంరక్షించేందుకు ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఆరవ షెడ్యూలులో చేర్చాలన్న లద్దాఖీల డిమాండ్‌కు విస్తృత మద్దతు కూడా లభిస్తోంది. ‘ఆరవ షెడ్యూలు’ ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈశాన్య భారత రాష్ట్రమైన మేఘాలయ తప్పక గుర్తుకు వస్తుంది. రాజధాని షిల్లాంగ్ మినహా మిగతా మేఘాలయ అంతా పూర్తిగా ఆరవ షెడ్యూలులో ఉన్న రాష్ట్రం. ఆరవ షెడ్యూలు రాష్ట్రంగా ఉండడమంటే ఏమిటి? మేఘాలయకు అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన అనుభవంతో వాస్తవ పరిస్థితులను పేర్కొంటాను: మేఘాలయలో పంచాయత్‌లు గానీ, పురపాలక సంఘాలు గానీ లేవు. సంప్రదాయ గ్రామీణ పాలనా సంస్థలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తెగ పెద్దలే వాటిని అజమాయిషీ చేస్తుంటారు. ఈ కారణంగా రాజ్యాంగ 73, 74 సవరణల ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మేఘాలయకు దక్కడం లేదు. కనుకనే ఆరవ షెడ్యూలును జస్టిస్ హిదయతుల్లా ‘రాజ్యాంగంలో రాజ్యాంగం’గా అభివర్ణించారు. ఆరవ షెడ్యూలుకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.
భారత రాజ్యాంగంలోని అధికరణ 370 ప్రకారం జమ్మూ–కశ్మీర్‌కు సొంత రాజ్యాంగం ఉన్నది. ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగ సభ ఆ ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించింది. అయితే అధికరణ 370 రద్దు జమ్మూ–కశ్మీర్ రాజ్యాంగం కింద కాకుండా రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆరవ షెడ్యూలు లద్దాఖ్ ప్రజల ప్రత్యేక అవసరాలను ఎలా తీర్చగలుగుతుది? మేఘాలయలో విఫలమైన ఆరవ షెడ్యూలు లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలమవుతుందా? 2019లో రాష్ట్ర ఏర్పాటుకు ఒక ప్రమాణాన్ని నిర్ధారించకపోవడం వల్లే లద్దాఖ్ ప్రతిపత్తి సమస్యాత్మకంగా పరిణమించింది. ఢిల్లీ తరహా యూటీగా ఏర్పాటు చేయడం లేదా ఆరవ షెడ్యూలులో చేర్చడం అనేవి లద్దాఖ్ సమస్యలను పరిష్కరించలేవు. లద్దాఖ్ ప్రత్యేక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త సమాఖ్య పాలనా నమూనాను అనుసరించవలసిన అవసరమున్నది. ఇందుకు కొత్త రాష్ట్రాల సృష్టి ప్రక్రియకు ఒక ప్రాతిపదిక సూత్రాన్ని రూపొందించవలసి ఉన్నది. భారత్ ఒక సమాఖ్య రాజ్యం. కనుక కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఏర్పాటైన తరువాత పాలన ఎలా ఉంటుందో అంచనా వేసే ఫెడరల్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ అండ్ రీ–ఆర్గనైజేషన్‌ను రూపొందించవల్సి ఉన్నది.
ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లను పరిశీలించి రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించేందుకు ఒక శాశ్వత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి. స్వపరిపాలనను, స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలను కొట్టివేయకుండా పరిగణనలోకి తీసుకుని అర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆ కమిషన్ విధ్యుక్త ధర్మంగా ఉండాలి. భారత్ లాంటి బహుళ సంస్కృతీ సంపన్న సమాజంలో ‘సమాఖ్య పద్ధతి అనేది వైవిధ్యంలో కలిసిమెలిసి జీవించేందుకు ఉద్దేశించిన ఒక ఉదాత్త పాలనా ప్రణాళిక’ అన్న రాజనీతిశాస్త్రవేత్త జోహాన్నెస్ అల్తూసియస్ స్ఫూర్తిదాయక మాటలను మనం విస్మరించకూడదు.
పి.నిరూప్
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు
బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 16 , 2025 | 03:27 AM