Political Language: జాతికి తలవంపులు తెచ్చే మాటలు
ABN, Publish Date - Dec 28 , 2025 | 12:49 AM
తెలుగు రాష్ర్టాల రాజకీయాలలో హద్దులు చెరిగిపోతున్నాయి. ముతక భాషే వాడుక భాషగా మారింది. ఆయా పార్టీల ముఖ్య నాయకులకు ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. పరస్పరం గౌరవించుకునే సంస్కృతి...
తెలుగు రాష్ర్టాల రాజకీయాలలో హద్దులు చెరిగిపోతున్నాయి. ముతక భాషే వాడుక భాషగా మారింది. ఆయా పార్టీల ముఖ్య నాయకులకు ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. పరస్పరం గౌరవించుకునే సంస్కృతి స్థానంలో కక్షలు, కార్పణ్యాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారం కోల్పోవడానికి స్వయంకృతాపరాధమే కారణమన్న వాస్తవాన్ని విస్మరించి రాజకీయ ప్రత్యర్థులపై కక్షలు పెంచుకుంటున్నారు. రాష్ర్టాలు విడిపోయి పుష్కర కాలం అవుతున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని రాజకీయ సమీకరణాలు అక్కడా ఇక్కడా ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ రాజకీయ రొచ్చులో రెండు రాష్ర్టాల ప్రజల సఖ్యత మాత్రం పదిలంగా ఉండటం గమనార్హం! గత ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారాన్ని కోల్పోయారు. వారు ఇరువురూ అధికారంలో ఉన్నప్పుడు సఖ్యతతో మెలిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్‌రెడ్డి అధికారంలో ఉన్నారు. ఈ ఇరువురు నాయకుల మధ్య కూడా సఖ్యత ఉంది. అయితే అధికారం కోల్పోయిన పార్టీలు అసహనంతో రగిలిపోతున్నాయి. ఇటు కేసీఆర్ అండ్ కోకు, అటు జగన్ అండ్ కోకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల పొడ గిట్టడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులపాల్జేయడానికి కేసీఆర్ అండ్ కో–జగన్ అండ్ కో ఒకరికొకరు ఆదర్శంగా మెలుగుతుండటం విశేషం. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలిన ముతక భాష ఇప్పుడు తెలంగాణలోకి కూడా దిగుమతి అయింది. రప్పా రప్పా నరుకుతామని జగన్‌రెడ్డి మొదలెట్టిన రణన్నినాదాన్ని ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా అందిపుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్లుగా ఫాంహౌజ్‌కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దునుమాడారు. రేవంత్‌రెడ్డి సైతం నేను తక్కువ తిన్నానా అంటూ దుమ్మెత్తిపోశారు. ఆ వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో ఈ ముగ్గురూ భాష విషయంలో హద్దులు మీరారు. రెండేళ్లుగా చప్పుడు లేకుండా ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఇకపై తోలు తీయడానికి తానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఉన్నట్టుండి కేసీఆర్ క్రియాశీలం ఎందుకయ్యారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మళ్లీ ముడి సరుకుగా మార్చుకొని తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ సెంటిమెంటును రగిలించడానికి కేసీఆర్ ప్రయత్నించడం కూడా చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్లవుతోంది. ఇప్పుడు కూడా తెలంగాణ వాదం పనిచేస్తుందా? తెలంగాణపై బీఆర్‌ఎస్‌కు మాత్రమే హక్కులు ఉన్నాయా? కాంగ్రెస్, బీజేపీలకు హక్కులు లేవా? ఆ పార్టీల నాయకులు తెలంగాణ వారు కాదా? కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ తెలంగాణ హక్కులను పణంగా పెడతాయా? వంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నం అవుతాయి. ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వేడి పుట్టించడానికి వెనుక ఉన్న కారణాల విషయానికి వద్దాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే వరకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము అధికారంలోకి వచ్చినట్టేనని భారత రాష్ట్ర సమితి నాయకులు కలలుకంటూ వచ్చారు. అయితే బీఆర్‌ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని ఈ ఉప ఎన్నికలో కోల్పోయింది. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు కొంత డీలా పడ్డాయి. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అధికార మార్పిడి జరిగిన తర్వాత వచ్చిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో తాను మౌనంగా ఫాంహౌజ్‌కే పరిమితమైతే పార్టీ శ్రేణులు నీరసపడతాయని కేసీఆర్ భావించి ఉండవచ్చు. తాను బయటకు రావాలంటే ఏదో ఒక రాజకీయ అంశం కావాలి కనుక, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను రేవంత్‌రెడ్డి వదులుకోవడానికి సిద్ధపడడం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని సరికొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చారు. తన గురువైన చంద్రబాబు మెప్పు పొందడానికి రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు ద్రోహం చేస్తున్నారని కేసీఆర్ అండ్ కో ఆరోపించడం ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా కష్టం వచ్చినప్పుడల్లా చంద్రబాబును తెర మీదకు తెచ్చి రాజకీయంగా లాభపడటానికి అలవాటు పడిన ఆ పార్టీ పుష్కర కాలం తర్వాత కూడా అదే పంథాను ఎంచుకుంది.
2018లో చంద్రబాబును బూచిగా చూపించి కేసీఆర్ రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చారు. 2023 ఎన్నికల్లో ఆ పప్పులు ఉడకకపోగా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు గంపగుత్తగా కాంగ్రెస్‌కు మళ్లింది. తెలంగాణ రాజకీయాల్లో నేరుగా కాలు పెట్టకూడదని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో కేసీఆర్‌కు దెబ్బపడింది. దీంతో ఇప్పుడు నీళ్ల విషయంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి తెలంగాణకు, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని కొత్త పాట అందుకున్నారు. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ర్టానికి దిగువన, ఆంధ్రప్రదేశ్‌కు ఎగువన ఉంది. నీళ్ల విషయంలో అన్యాయం చేస్తే గీస్తే కర్ణాటక చేయగలుగుతుంది. ఆల్మట్టి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతే జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోతుంది. అంతే గానీ, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏమి నష్టం చేయగలుగుతుంది? ప్రభుత్వాలు కుమ్మక్కయినా తమను కాదని దిగువకు నీటిని తరలించడాన్ని రైతులు సహిస్తారా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ వాసి. ఆయన తన సొంత జిల్లాకు ఎందుకు అన్యాయం చేసుకుంటారు? ఏ రాజకీయ నాయకుడైనా సొంత ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయరు కదా? చంద్రబాబుతో స్నేహం ఉండడం వల్ల తెలంగాణలో రేవంత్‌రెడ్డికి రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూరుతోంది. తెలుగుదేశం పార్టీ ఓటర్లు, అభిమానులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తమ వాడుగా చూసుకుంటున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. చంద్రబాబుతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల తెలంగాణలో తనకు రాజకీయ లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ తలపోస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు–రేవంత్ కుమ్మక్కయి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ ఆరోపణల్లో హేతుబద్ధత లేకపోయినా ప్రస్తుతానికి ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని కేసీఆర్ అండ్ కో భావిస్తూ ఉండవచ్చు. ప్రజల్లో సెంటిమెంటును రగిలించడానికి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టుగా ఉంది. రాజకీయంగా ఆయన ఎత్తుగడలను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అయితే సందర్భం ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేసీఆర్ అవమానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనివల్ల ఆయనకు కలిగే రాజకీయ ప్రయోజనం ఏమిటో తెలియదు! తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఫ్యూచర్ సిటీలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైజింగ్ సమ్మిట్ నిర్వహించడాన్ని ఎగతాళి చేస్తూనే, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూడా ఇలాగే చేసి వంటవాళ్లతో ఒప్పందాలు చేసుకున్నారని అవమానకరంగా కేసీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ తన గురించి తాను అధికంగా ఊహించుకుంటారు. ఆ క్రమంలోనే తెలంగాణలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలనుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి గత ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోనే బోల్తా పడ్డారు. ఊహించని పరాభవంతో కుంగిపోయిన కేసీఆర్, మరోవైపు తాను ద్వేషించే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ కారణంగానే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో వలె విద్వేష రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ద్వేషించడానికి కారణం ఉంది. అవినీతి కేసులలో తాను జైలు జీవితం గడపాల్సి రావడానికి చంద్రబాబు కారణమని జగన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయనకు చంద్రబాబు పొడ గిట్టదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి తనను ఓడించడానికి ప్రయత్నించారన్న కోపం చంద్రబాబుపై కేసీఆర్‌కు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999 ఎన్నికల తర్వాత తనను మంత్రివర్గంలోకి తీసుకోనందుకు చంద్రబాబుపై కేసీఆర్‌కు కోపం ఉండేది. అప్పటి నుంచే వారిద్దరికీ చెడింది. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తేవడం, అంతిమంగా అది రాష్ట్ర విభజనకు దారితీయడం తెలిసిందే. చంద్రబాబుపై అటు జగన్‌కు, ఇటు కేసీఆర్‌కు కోపం ఉండటానికి కారణాలు ఉన్నాయి. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసీఆర్‌కు అంత కోపం ఎందుకో తెలియదు. కోపం అంటూ ఉంటే అది రేవంత్‌రెడ్డికి ఉండాలి. ఓటుకు నోటు కేసులో తనను జైలుకు పంపిన కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డికి కోపం ఉండటం సహజం. కేసీఆర్ కోపానికి మాత్రం కారణం తెలియదు. తన దృష్టిలో అల్పుడైన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఏమిటి? అది కూడా తనను ఓడించి గద్దెనెక్కడం ఏమిటి? అని కేసీఆర్ భావిస్తున్నారేమో తెలియదు. రాజకీయాలలో ఎవరికైనా గెలుపోటములు సహజం. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు మూడు ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అంతమాత్రాన ఆయన కుంగిపోలేదు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష పెంచుకోలేదు. ముఖ్యమంత్రిగా జగన్ తనను ఉక్కిరి బిక్కిరి చేసినా, చివరకు జైలుకు పంపినా చంద్రబాబు సంయమనం కోల్పోలేదు. తనదైన శైలిలో రాజకీయం చేసి అపూర్వ విజయాన్ని అందుకున్నారు. తనను అవమానించిన వారి పట్ల ఆయన కక్షపూరితంగా వ్యవహరించే పనులు చేయరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా కేసీఆర్ తనను అవమానించినా చంద్రబాబు పన్నెత్తి మాట అనలేదు. రాజకీయాలలో అవన్నీ మామూలే అన్నట్టుగా పరిగణించారు. చంద్రబాబు రాజకీయాలను కేసీఆర్ అనేక సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడారు. అయినా చంద్రబాబు స్పందించలేదు. 1999, 2014, 2024 ఎన్నికల్లో విజయాలను చూసిన చంద్రబాబు 2004, 2009, 2019లో పరాజయాలను చవిచూశారు. మూడు ఎన్నికల్లో గెలిచి, మూడు ఎన్నికల్లో ఓడిపోయినా కూడా రాజకీయాల్లో నిలదొక్కుకున్న ఏకైక నేతగా చంద్రబాబు ఒక్కరే ఈ దేశంలో కనిపిస్తారు. రాజకీయాలలో తాను చంద్రబాబు కంటే గొప్పవాడినని కేసీఆర్ భావించడం వల్లే తంటా అంతా. రాజకీయంగా తాను చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి చంద్రబాబు వెనుకంజ వేయరు. పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకుంటారు. 2019లో ప్రధాని మోదీతో ఘర్షణ పడి దెబ్బతిన్న వాస్తవాన్ని గుర్తించి 2024 ఎన్నికల్లో మళ్లీ మోదీతో చేతులు కలిపారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన మద్దతుపై ఆధారపడి ఉన్నప్పటికీ విర్రవీగకుండా అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రాజకీయాలలో ఆయనతో తలపడాలనుకుంటున్న కేసీఆర్ ఓడిపోయింది ఒక్క 2023 ఎన్నికల్లోనే. అయినా ఆగమాగం అయిపోతున్నారు.
ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయానో గుర్తించడానికి కేసీఆర్ ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని చెబుతున్నారే గానీ, అధికారంలో ఉన్నప్పుడు తాము అహంకారంతో వ్యవహరించినందునే ప్రజలు ఓడించారని గుర్తించడానికి ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా హామీలు ఇవ్వకపోయినా కేసీఆర్‌ను ప్రజలు ఓడించి తీరేవారన్నది వాస్తవం. ఉద్యమ సమయంలో ప్రజల్లో ఉండే భావోద్వేగాలు ఎల్లకాలం ఉండవని కేసీఆర్ ఎందుకో గుర్తించడానికి కూడా ఇష్టపడటం లేదు. రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటికీ పాత వ్యూహాలతోనే సెంటిమెంటునే ఆసరాగా చేసుకోవాలని కేసీఆర్ భావించడం ఆశ్చర్యంగా ఉంది. గత ఎన్నికల్లో తనను ఓడించిన ప్రజల మీద అలిగి రెండేళ్లుగా కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడినప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ముఖం చాటేయలేదు. 2024కు ముందు జగన్ అండ్ కో నుంచి శాసనసభలో ఎన్ని అవమానాలు ఎదురైనా జంకకుండా హాజరయ్యారు. పార్టీని నిలబెట్టుకున్నారు. చివరికి తన సతీమణిని ఘోరంగా అవమానించడంతో తట్టుకోలేక కౌరవ సభగా మారిన గౌరవ సభలోకి మళ్లీ ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి బహిష్కరించారు. చంద్రబాబును హేళన చేసే కేసీఆర్ మాత్రం శాసనసభకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. తన గురించి తాను అతిగా ఊహించుకోవడం వల్లనే ఆయన శాసనసభకు హాజరవడానికి ఇష్టపడటం లేదు. చంద్రబాబును ఏవగించుకోవడం వల్ల కేసీఆర్‌కు కలిగే ప్రయోజనం ఏమిటో తెలియదు. రాజకీయాలలో తాను చంద్రబాబు కంటే అధికుడనని భావించి లాభం లేదు. రుజువు చేసుకోవాలి. వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న పార్టీని తిరిగి విజయతీరాలకు చేర్చినప్పుడే కేసీఆర్ కూడా మొనగాడు అవుతారు. అంతేగానీ ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబును తిట్టిపోయడం వల్ల ప్రయోజనం ఉండదు.
ఆ ఇద్దరికీ అదే తేడా..!
జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్–బీజేపీలకు అసలు పొసగదు. అయినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపడానికే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ పని చేయకపోగా కేంద్రంపై కాలు దువ్వేవారు. ఆ కారణంగా తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి గరిష్ఠంగా ప్రయోజనం పొందుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కూడా ఏర్పడింది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తెలంగాణపై తనకే పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రేవంత్‌రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ వాడుతున్న భాషను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంటుకు ఇప్పుడు తావులేదు. చంద్రబాబు–రేవంత్ మధ్య సఖ్యత ఉన్నందున ఇరు రాష్ర్టాల మధ్య సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి వ్యవహారాల్లో కేసీఆర్ పెద్దరికం చూపితే ప్రజలు హర్షిస్తారు గానీ, తంపులు పెట్టడాన్ని హర్షించరు. కేసీఆర్–రేవంత్‌రెడ్డి ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీసుకోవాలని అనుకోవడం తప్పు కాదు. ఆ క్రమంలో కక్షపూరితంగా వ్యవహరిస్తే మాత్రం తెలంగాణ సమాజం ఆమోదించదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబును తెరమీదకు తేవడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నాలను కేసీఆర్ మళ్లీ మొదలుపెట్టడంతో దీనికి విరుగుడుగా తెలంగాణలో వెలమ సామాజిక వర్గాన్ని ఒంటరి చేయడానికి రేవంత్‌రెడ్డి వ్యూహరచన చేశారు. రావులంతా ఏకమై వచ్చినా తనను ఏమీ చేయలేరని రేవంత్‌రెడ్డి సవాలు చేయడం వెనుక ఆంతర్యం ఇదే. రెడ్డి సామాజిక వర్గాన్ని తన వెనుక సంఘటితం చేసుకోవాలన్న లక్ష్యంతోనే రావులు అన్న పదాన్ని రేవంత్‌రెడ్డి ప్రయోగించి ఉంటారు. తాను రాజకీయం చేసినంత కాలం రావులను అధికారంలోకి రానివ్వబోనని ఆయన శపథం కూడా చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలనుకోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గం కినుక వహించిందన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. దీంతో రెడ్డి సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా సంఘటితం చేసుకోవడానికే రావులు అంటూ వెలమ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి తెరమీదకు తెచ్చారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీశ్‌రావులను మళ్లీ అధికారంలోకి రానివ్వనని చెప్పడం అసంతృప్తితో ఉన్న రెడ్లను ఉత్తేజపరచడానికే అన్న అభిప్రాయం ఉంది. తెలంగాణలో కుల గణన చేసిన రేవంత్‌రెడ్డి బీసీల సంఖ్య ఇంత అని ప్రకటించారే గానీ బీసీలలో ఏ కులం వాళ్లు ఎంత మందో ఎక్కడా ప్రకటించలేదు. ఇది చాలా తెలివైన నిర్ణయం. కులాలవారీగా జనాభా లెక్కలు ప్రకటించి ఉంటే బీసీ కులాల మధ్య గొడవలు జరిగేవి. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ తప్పు చేశారు. ఫలితంగా అక్కడ బీసీల మధ్య గొడవలు మొదలయ్యాయి. బీసీలు అంటే ఎన్నో కులాల సమూహం. ఎవరికి వారు తమ కులం జనాభా ఎక్కువ అని భావిస్తుంటారు. ఈ కారణంగా కులాలవారీగా బీసీల జనాభా వివరాలు ప్రకటించకూడదని రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇలాంటి విషయాలలో రేవంత్‌రెడ్డి తెలివిగా అడుగులు వేస్తూ ఇటు ప్రజల్లోనూ అటు పార్టీలోనూ తన పట్టు పెంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రాఫ్ పెరిగింది. పార్టీలో ధిక్కార స్వరాలు కూడా సర్దుకున్నాయి.
మంత్రివర్గంపై ఆయనకు పట్టు లభించింది. వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రినని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ప్రకటించుకోవడం అసాధారణం. రేవంత్‌రెడ్డి ఈ మధ్య అటువంటి ప్రకటన చేయడం ఆయనలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. అధికార యంత్రాంగం కూడా ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తోంది. కేసీఆర్ అండ్ కో మాత్రం రేవంత్‌ను ఇప్పటికీ తక్కువ అంచనా వేస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లి కాంగ్రెస్‌లో చేరి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి కాగలగడం మామూలు విషయం కాదు. అయితే రేవంత్‌రెడ్డి షార్ట్ కట్‌లో ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ ప్రభృతులు విమర్శిస్తున్నారు. కోటా ఏదైనా రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆ పదవిలో ఆయన ఇప్పటికే రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. మిగతా మూడేళ్లు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారనడంలో సందేహం లేదు. అయినా ఆయనను ముఖ్యమంత్రిగా గుర్తించం అని కేసీఆర్ అండ్ కో భావిస్తే అది వారిష్టం. భాష విషయంలో కూడా కేసీఆర్, రేవంత్, కేటీఆర్ సంయమనం పాటించాలి. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ‘నీ అవ్వ’ అని బహిరంగ సభలో మాట్లాడటం తప్పు. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి అలాంటి మాటలు రావడాన్ని ప్రజలు హర్షించరు. అయితే ఇందుకు ప్రతిగా కేటీఆర్ మాట్లాడిన మాటలు మరీ నేలబారుగా ఉన్నాయి. తన తండ్రిని దూషించిన రేవంత్‌రెడ్డిపై తనకు చాలా కోపంగా ఉందని, దొరికితే ఎడమ కాలు చెప్పుతో కొట్టాలని ఉందని అన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పుతో కొడతానని అనడం అభ్యంతరమే కాదు.. నేరం కూడా. ముఖ్యమంత్రిగాడు అని కూడా పరుషంగా మాట్లాడారు. వ్యక్తిగా రేవంత్‌రెడ్డి వేరు. ఆయన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. మనకు ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రిగా ఆయనను గౌరవించాలే గానీ వాడు–వీడు అనడం ఏమిటి? ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రవర్తన వల్లే ‘వాళ్లకు ఇంకా దిగలేద’ని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నవారు బూతు భాషను అధికార భాషగా మార్చుకొని పదకొండు సీట్లకే పరిమితమైన విషయం తెలంగాణలోని రాజకీయ నాయకులు గుర్తించకపోవడం విషాదం. అభివృద్ధిలో పోటీ పడడంలో తెలుగు రాష్ర్టాలు ఆదర్శంగా నిలబడాలి కానీ ముతక భాష ప్రయోగంలో కాదు. ఇకనైనా మన నాయకులు తెలుగు జాతికి తలవంపులు తెచ్చే మాటలు కట్టిపెడతారని ఆశిద్దాం!
ఆర్కే
ఇవి కూడా చదవండి..
రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..
మీది హెచ్‌డీ చూపు అయితే.. ఈ ఫొటోలో సూది ఎక్కడుందో 25 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Dec 28 , 2025 | 12:49 AM