Cinema Meets Caste Politics: నటులు కులదైవాలా
ABN, Publish Date - Oct 05 , 2025 | 01:02 AM
ఇద్దరు సినిమా వాళ్ల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైషమ్యాల నేపథ్యంలో శాసనసభలో చోటుచేసుకున్న ఒక సంఘటన... ఆంధ్రప్రదేశ్‌లో మరో సమస్యే లేనట్టుగా అదే ప్రధాన సమస్యగా మారడమేమిటి? శాసనసభలో చోటుచేసుకున్న....
ఇద్దరు సినిమా వాళ్ల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైషమ్యాల నేపథ్యంలో శాసనసభలో చోటుచేసుకున్న ఒక సంఘటన... ఆంధ్రప్రదేశ్‌లో మరో సమస్యే లేనట్టుగా అదే ప్రధాన సమస్యగా మారడమేమిటి? శాసనసభలో చోటుచేసుకున్న సంభాషణలను రికార్డుల నుంచి తొలగించినా అదే అంశాన్ని పట్టుకొని వేలాడటమేమిటి? హవ్వ... నవ్విపోదురుగాక! ఈ ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి చూస్తే జాలేస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఆయన నలిగిపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని విడిగా చూడలేం. ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న కుల జాఢ్యం వల్ల సమస్య కానిది కూడా సమస్యగా మారుతోంది. నిజానికి శాసనసభలో ఆ రోజు తెలుగుదేశం సభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్న మాటలను కాదు – నిండు సభలో ఆయన ప్రవర్తించిన తీరును తప్పు పట్టాలి. బాలకృష్ణ శాసనసభకు ఎన్నికవడం ఇది మొదటిసారి కాదు. మూడో పర్యాయం. సభ మర్యాదల గురించి ఆయనకు తెలియదని అనుకోగలమా? చలువ కళ్లద్దాలను తలపైకి నెట్టి, రెండు జేబులలో చేతులు పెట్టుకొని ఆయన మాట్లాడటం సభా మర్యాదలను ఉల్లంఘించడమే! ఒకప్పుడు సభ్యుడు ఎవరైనా ఇలా ప్రవర్తించి ఉంటే సభాపతి తీవ్రంగా మందలించి ఉండేవారు. గతంలో సభ్యులు సభలో వార్తా పత్రికలు చదవడాన్ని కూడా సభాపతులు అనుమతించేవారు కాదు. ఇప్పుడా మర్యాదలు, సంప్రదాయాలు గాలికి పోయాయి. ఎన్టీఆర్ అంతటి వారు కూడా తను వాడిన మాటలకు సభలో ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరకు శాసనసభను బహిష్కరించాల్సిన తీవ్ర నిర్ణయాన్ని అప్పుడు ఆయన తీసుకున్నారు. ఆ రోజు కాంగ్రెస్ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి ఎన్టీఆర్‌ను విమర్శిస్తూ ఒక కాగితం చూపించారు. 1983లో తన పార్టీ తరఫున తొలిసారి నెగ్గి ఎమ్మెల్యే అయిన రాజకుమారి సభలో తనను విమర్శించడాన్ని జీర్ణించుకోలేని ఎన్టీఆర్ ‘ఆ కాగితాన్ని మడిచి...’ అని ఇంకేదో అన్నారు. అంతే, అధికార కాంగ్రెస్ సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. క్షమాపణలు చెప్పాలని కోరారు. దీంతో అహం దెబ్బతిన్న ఎన్టీఆర్ విసవిసా నడుచుకుంటూ సభాపతి స్థానం వద్దకు వెళ్లి తన భుజంపై ఉన్న కండువాను పోడియంపై పెట్టి తన స్థానం వద్దకు వెళ్లి, తనకు జరిగిన అవమానానికి నిరసనగా శాసనసభను బహిష్కరిస్తున్నానని ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయారు. నిజానికి ఎన్టీఆర్ అంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారని తెలుగుదేశం పార్టీ వారెవరికీ తెలియదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్టీఆర్ సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకోవడంతో చంద్రబాబు నాయుడే ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. ఇది గతం! సభలో పాటించవలసిన నియమాలు, సంప్రదాయాలకు అప్పట్లో అంత విలువ ఉండేది. కాలక్రమంలో సభాపతులు తమ పట్టు కోల్పోతూ వచ్చారు. ముఖ్యమంత్రుల కనుసన్నల్లో పనిచేయడానికి అలవాటుపడ్డారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం!
ఏమిటీ వివాదం...
నందమూరి బాలకృష్ణ ఆ రోజు చిరంజీవిని ఏమన్నారో స్పష్టత లేదు. కానీ... మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత సభలో సభ్యుడైన జగన్మోహన్‌రెడ్డిని మాత్రం పరోక్షంగా సైకోగాడు అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. నిండు సభలో సహచర సభ్యుడిని సైకోగాడు అనడం, కళ్లజోడును తలపైకి నెట్టుకొని, జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడటం కచ్చితంగా అభ్యంతరకరమే. సభాపతి స్థానంలో ఉండిన ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు కూడా దీనిపై అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా చొరవ తీసుకొని బాలకృష్ణను సరిదిద్ది ఉండవలసింది. ఇవేమీ జరగకపోగా చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ అవమానకరంగా మాట్లాడినట్టుగా ప్రచారం జరిగింది. ఇంకేముందీ, కులాల కుంపట్లు రాజుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి మద్దతుగా ఆయన అభిమానులు, బాలకృష్ణకు మద్దతుగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. చిరంజీవి తరఫున మాట్లాడిన కొందరైతే ఆయనను ఏమైనా అంటే చంపేస్తామని హెచ్చరించేదాకా ఆవేశపడిపోయారు. కమ్మ–కాపు కులాల మధ్య కుంపట్లు రాజుకోవడంతో ఆ మంటల్లో చలి కాచుకొనే ప్రయత్నాన్ని వైసీపీ వాళ్లు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలోనూ, కూటమిలోనూ తాము ఆరాధించే పవన్ కల్యాణ్‌ది ప్రధాన పాత్ర అయినందున కాపులు ఆక్రోశపడ్డారు. ప్రతిగా కమ్మవాళ్లు కూడా స్పందించారు. ఈ రెండు కులాలనూ విడదీస్తే రాజకీయంగా లాభిస్తుందని భావించిన వైసీపీ నాయకులు తెర వెనుక నుంచి కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సినిమా వేరు– రాజకీయం వేరు అన్నది మరుగున పడింది. ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలం నుంచి రాజకీయాలు, సినిమా కలగాపులగం అయ్యాయి. అదే సమయంలో అధికారం కోసం, ఆధిపత్యం కోసం మూడు కులాల మధ్య పోరాటం మొదలైంది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీపై రెడ్ల పార్టీగా ముద్రపడలేదు. కాకపోతే అధిక శాతం రెడ్లు ఆ పార్టీకి మద్దతు పలికేవారు. జగన్‌రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత రెడ్లు ఆయనను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో మెజారిటీ క్రైస్తవులు కూడా జగన్‌ను తమ సొంతం అనుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి కమ్మ వాళ్లు ఆ పార్టీని తమ సొంత పార్టీగా భావించడం మొదలుపెట్టారు. పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన తనపై కుల ముద్ర పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించారు. అనుభవరాహిత్యంతోపాటు ఇతరత్రా కారణాల వల్ల రాజకీయంగా ఆయన విఫలమయ్యారు. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి క్రమంగా రాజకీయాలకు దూరం జరిగారు.
కమ్మ, రెడ్లతో పోల్చితే సంఖ్యా బలం అధికంగా ఉన్న కాపులను ఈ పరిణామం నిరాశపరిచింది. తమ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడమేమిటి? అని మదనపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. దీంతో కాపులలో మళ్లీ ఆశలు చిగురించాయి. పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న కాంక్ష వారిలో మళ్లీ చిగురించింది. అయితే 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీకి దిగిన జనసేన పార్టీకి కేవలం ఒక్క సీటే లభించింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ సైతం రెండు చోట్లా ఓడిపోయారు. అయినా ఆయన నిరాశ చెందకుండా పార్టీని కొనసాగించారు. దురదృష్టవశాత్తు ఆయన అభిమానుల వ్యాఖ్యలు, పవర్తన కారణంగా జనసేన అంటే కాపుల పార్టీగా ముద్రపడింది. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన జగన్మోహన్‌రెడ్డి కమ్మ కులస్తులను ద్వేషించడంతోపాటు ఆ కులానికి చెందిన ప్రముఖులను వేధించడంతో ఆ సామాజిక వర్గం వారంతా గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి జైకొట్టారు. తన బలం–బలహీనత గుర్తించిన పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో జతకట్టారు. చంద్రబాబుకు కూడా ఈ పొత్తు అనివార్యం అయింది. భారతీయ జనతా పార్టీ కూడా చేతులు కలపడంతో మూడు పార్టీలూ ఎన్డీయే కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకరకంగా వారిరువురికీ ఇది ఒక రాజకీయ అనివార్యత. ఈ తరుణంలో బాలకృష్ణ వ్యాఖ్యలు సరికొత్త వివాదాన్ని తెరమీదకు తెచ్చాయి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి సినిమా పరిశ్రమలో కష్టపడి పైకి వచ్చిన చిరంజీవిని అవమానించారని పవన్ కల్యాణ్ సైతం ఎన్నో సందర్భాలలో అన్నారు. ఇప్పుడు ఏర్పడిన తాజా వివాదంతో.. ‘ఆ రోజు ఏమీ జరగలేదు. జగన్‌రెడ్డి మమ్మల్ని బాగా చూసుకున్నారు’ అని కొంత మంది జగన్ తరఫున వకల్తా పుచ్చుకొని మాట్లాడారు. అప్పట్లో జగన్‌రెడ్డి తన పట్ల అమర్యాదగా ప్రవర్తించి ఉండకపోతే కనీసం చిరంజీవి అయినా అప్పుడే స్పష్టం చేసి ఉండాల్సింది. అదేమీ జరగకపోవడంతో చిరంజీవికి అవమానం జరిగిందనే అందరూ భావించారు.
కుటుంబాలు... కులాల కుంపట్లు...
ఈ విషయం అలా ఉంచితే, ముఖ్యమంత్రి కుర్చీకోసం మూడు కులాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు మూడు కుటుంబాల మధ్య కేంద్రీకృతం అయింది. మెజారిటీ రెడ్లు, క్రైస్తవులు, ఎక్కువ మంది ముస్లింలు వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్మోహన్‌రెడ్డిని మాత్రమే గుర్తించారు. రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలను కూడా వారు ఆయన రాజకీయ వారసురాలిగా గుర్తించడం లేదు. ప్రతిగా కమ్మవారు నారా చంద్రబాబు కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. కాపులు తమ సామాజిక వర్గానికి ఏకైక ప్రతినిధిగా కొణిదల కుటుంబాన్ని తలకెత్తుకున్నారు. నిజానికి ఈ మూడు సామాజిక వర్గాలలో రాజకీయంగా ఎందరో ఉద్దండులు ఉండేవారు. ఉన్నారు కూడా! రెడ్లలో నాయకులకు కొదవ లేదు. అయినా జగన్‌రెడ్డి రంగప్రవేశంతో వారంతా ద్వితీయ శ్రేణి నాయకులుగానే ఉండిపోవాల్సిన పరిస్థితి. కాపుల విషయంలో కూడా ఇదే జరిగింది. నిజానికి కొణిదల కుటుంబంలో ఎవరికీ రాజకీయ అనుభవం లేదు. రాజకీయంగా మూడు నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన నాయకులు ఎందరో కాపుల్లో ఉన్నారు. అయితే చిరంజీవి కుటుంబ రంగప్రవేశంతో వారంతా వెనుకబడిపోయారు. కాపులు తమ నాయకుడిగా పవన్ కల్యాణ్‌ను మాత్రమే చూసుకోవడంతో చేసేదేమీ లేక ద్వితీయ స్థాయి నాయకులుగా ఉండిపోవడానికి వారంతా సిద్ధపడ్డారు. అధికారం కోసం ఈ మూడు కుటుంబాల మధ్య మొదలైన పోరు కులాల కుంపట్లను రాజేస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన సగటు కమ్మవారికి ఒరిగేదేమిటి? అలాగే జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్లు అందరూ లాభపడరు కదా? పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయితే కాపులలో పేదరికం అమాంతం పోదు కదా? ఈ విజ్ఞత లేకపోవడంతోప్రతిదీ వివాదమవుతోంది. సామాజిక కోణంలో సమస్య అవుతోంది. విచిత్రం ఏమిటంటే, ఈ మూడు సామాజిక వర్గాలలో కులాంతర వివాహాలు జరుగుతుంటాయి. కాపులు రెడ్డి–కమ్మలను పెళ్లి చేసుకుంటున్నారు. కమ్మ వాళ్లు రెడ్డి–కాపులను చేసుకుంటున్నారు. రెడ్లు కూడా అంతే. వియ్యం అందుకోవడానికి లేని అభ్యంతరం కలసి మెలసి సాగిపోవడానికి ఎందుకో అర్థం కాని విషయం. ఈ మూడు కుటుంబాలకు చెందినవారు ఇతర కులాల మద్దతు లేకుండా అధికారంలోకి రాగలరా? కడుపు నింపని కులం కోసం, ఈ మూడు కుటుంబాల కోసం కొట్టుకోవడాన్ని ఏమనాలి?
అనవసరమైన వివాదం...
బాలకృష్ణకు సందర్భ శుద్ధి తక్కువని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం కష్టం. ఆయన వ్యాఖ్యలు తన అభిమానులకు నచ్చవచ్చునుగానీ ఇతరులకు ఎందుకు నచ్చుతాయి? కూటమి నుంచి జన సేనానిని విడదీయాలని వైసీపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసి కూడా బాలకృష్ణ వివాదానికి తావిచ్చి ఉండవలసింది కాదు. చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా ప్రజలు వారిని అభిమానించేది సినిమా నటులుగానే. అంతకు మించి మహా నాయకులు అని కాదు. 2014 ఎన్నికల్లో చిరంజీవి స్వయంగా ప్రచారం చేసినా ఆయనను చూడ్డానికి ప్రజలు ఆసక్తి కూడా చూపలేదు. తెలుగుదేశం పార్టీ లేకుండా బాలకృష్ణ సైతం సొంతంగా పోటీ చేసి గెలవలేరు. ఇలాంటి పరిమితుల గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు బాగా తెలుసు. అందుకే వారు సంయమనం పాటిస్తున్నారు. చిరంజీవి అభిమానులు విమర్శలు చేస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ నోరు విప్పకపోవడానికి కారణం అదే కావొచ్చు. వంశాల గురించి, కుటుంబాల గురించి అభిమానులనేవారు మాట్లాడటం సమర్థనీయం కాదు. అభిమానులను ఉత్సాహపరిచేందుకు మాటల రచయితలు ఆయా నటులకు అనుగుణంగా కొన్ని డైలాగులు రాస్తుంటారు. అవే నిజమనుకుంటే ఎలా? ఎన్టీఆర్ కష్టపడి చిత్రసీమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్‌కు పూర్వం నందమూరి వంశం గురించి చెప్పమంటే ఏం చెప్పగలరు? అక్కినేని నాగేశ్వరరావు కూడా కష్టపడే సినిమా రంగంలో తన స్థానాన్ని పటిష్ఠం చేసుకున్నారు. ఆయనకంటే ముందు అక్కినేని వంశం ఏమిటి? ఇక చిరంజీవి విషయానికి వస్తే, సినిమా రంగంలో కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న రోజుల్లోనే ఆయన నిలదొక్కుకున్నారు. కఠోర శ్రమకు అల్లు రామలింగయ్య కుటుంబ సహాయ సహకారాలు తోడవడంతో చిత్రపరిశ్రమలో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ పరమపదించిన తర్వాత, ముఖ్యంగా దాసరి నారాయణరావు మరణం తర్వాత చిరంజీవి సినిమా పరిశ్రమకు పెద్దగా ఎదిగారు. ఇదంతా ఆయన స్వయంకృషి అని చెప్పవచ్చు. అంతకు ముందు కొణిదల వంశం చరిత్ర ఏమిటి? చిరంజీవి పుణ్యమా అని ఆయన కుటుంబానికి చెందిన పలువురు సినిమా రంగంలో నిలదొక్కుకున్నారు. కేవలం తమ కులం వారి మద్దతుతోనే ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి గానీ మరొకరు గానీ ఆ స్థాయికి ఎదగరు. ప్రేక్షకులు వారిని అందరివారిగానే చూసి ఆదరించారు. అప్పట్లో లేని గొడవలు ఇప్పుడు ఎందుకు? సినిమా బాగా లేకపోతే కులపోళ్లు మాత్రమే సదరు సినిమాను ఆడించలేరు కదా? ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణకు ఎన్ని ఫెయిల్యూర్స్ లేవూ? పవన్ కల్యాణ్ సినిమాలు సైతం ఎన్ని ఫెయిల్ కాలేదు? ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. శాసనసభలో తాను సైకోగాడు అన్న జగన్మోహన్‌రెడ్డి ఒకప్పుడు కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు అన్న విషయం బాలకృష్ణ మర్చిపోయారేమో తెలియదు. బాలకృష్ణ తన మానసిక పరిస్థితి సరిగా లేదని వైద్యుల నుంచి సర్టిఫికెట్ తెచ్చుకున్నారని విమర్శిస్తున్న వైసీపీ నాయకులు, ఒకప్పుడు అదే బాలకృష్ణ అభిమాన సంఘానికి తమ నాయకుడు జగన్ అధ్యక్షుడుగా ఉన్న విషయం తెలుసుకోవాలి కదా? అయితే ఒక విషయం మాత్రం వాస్తవం. కాల్పుల సంఘటనలో బాలకృష్ణను కాపాడింది మాత్రం నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డే. బాలకృష్ణ స్వయంగా కాల్పులు జరిపారని నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆర్పీసింగ్ విచారణ నివేదికను ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి అందజేయగా, ‘వదిలేయండయ్యా – రాజకీయంగా కక్ష సాధించాలనుకోవడం లేదు. ఎంత కాదనుకున్నా అతను ఎన్టీఆర్ కుమారుడు’ అని అప్పుడు పోలీసు అధికారుల వద్ద రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటిలాగా అప్పుడు కులాల కుంపట్లు ఇంతలా లేవు కనుక రాజశేఖరరెడ్డి ఉదారంగా వ్యవహరించగలిగారు. బాలకృష్ణను మాత్రమే కాదు– ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎంపీ కే.కేశవరావు కుమారుడు కాల్పులకు తెగబడిన సందర్భంలో కూడా రాజశేఖరరెడ్డే రక్షించారు. నేరం చేశారని తెలిసి కూడా వదిలేయడం మంచిదా? కాదా? అన్నది వేరే విషయం.
మారిన రాజకీయాలు...
రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండకూడదని అప్పట్లో అనుకొనేవారు. ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలే ప్రథమ ప్రాధాన్యం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కులతత్వం పెచ్చరిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఇవాళ పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య ఈ కుల తత్వమే. ఇది ఎంత దూరం వెళుతోందంటే, తప్పు చేసినవాళ్లు తమ కులపోళ్లు అయితే చాలు, వారికి అండగా ఆయా కులాలు నిలబడుతున్నాయి. అలాంటప్పుడు చట్టాలు ఎందుకు? చట్టం దృష్టిలో ఏ కులం వారికి కూడా మినహాయింపు ఉండదు కదా? ఉండాలి అనుకోవడమే నేటి వింత ధోరణి. మంత్రి నారాయణ, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సంబంధించిన ఒక వార్తను ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. వారు ఇరువురూ కాపులు కనుక తమ కులం వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ కులానికి చెందిన కొందరు నాయకులు ప్రకటనలు జారీ చేశారు. ఇదే శ్రీలక్ష్మి వాడే విగ్గులు, కట్టుకొనే చీరల గురించి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అనేక విమర్శలు చేశారు. అప్పుడు కాపుల మనోభావాలు ఎందుకు గాయపడలేదో? శ్రీలక్ష్మి కాపు కులానికి చెందినవారు కాబట్టి ఆమెను ఐఏఎస్‌కు ఎంపిక చేయలేదు. ప్రతిభ ఆధారంగా ఆమె ఎంపికయ్యారు. తప్పొప్పులకు ఆమె చట్ట ప్రకారం బాధ్యత వహించాలి. అలాగే మంత్రి నారాయణ విషయమే తీసుకుందాం! నెల్లూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. కాపులు మాత్రమే ఓటేసి నన్ను గెలిపించండి అని ఆయన ఎన్నికల సందర్భంగా కోరలేదు కదా? అన్ని వర్గాల వారు ఓటు వేస్తేనే కదా ఆయన ఎన్నికైంది! సామాజిక న్యాయం పాటించడం వేరు. కులాలను అడ్డుపెట్టి తప్పుచేసిన వారిని కాపాడాలనుకోవడం వేరు. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఉండకూడదనే మన పెద్దలు రాజ్యాంగ పరంగా, చట్టపరంగా వెసులుబాటు కల్పించారు. ఈ వెసులుబాటు తప్పు చేసి తప్పించుకోవడానికి కాదు. కులాలను ముందు పెట్టి తప్పు చేసిన వారిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నవారు ఈ వాస్తవాన్ని తెలుసుకోవాలి. చట్టాలు మాత్రమే ప్రామాణికం... కులాలు కాదు. మహా అయితే రిజర్వేషన్లు పొందడం వరకే ఈ వెసులుబాట్లు. రిజర్వేషన్ ప్రకారం లబ్ధి పొందిన వారికి ఆ తర్వాత మినహాయింపులు ఉండవు. ఎవరికి వారు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని యాగీ చేస్తే ఆ మాటున నేరస్తులు తప్పించుకోరా? అదే జరిగితే సమాజం మనోభావాల పరిస్థితి ఏమిటి? చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి, పవన్ కల్యాణ్ – వీరిలో ఎవరైనా తమ కులం వారి ఓట్లతో మాత్రమే గెలిచి రాజకీయాలు చేయగలరా? ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి 2009లో పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలకొల్లులో ఉన్నంత సంఖ్యలో కాపులు మరే నియోజకవర్గంలోనూ లేరు. అయినా చిరంజీవి ఎందుకు ఓడిపోయారు? కులాల పేరు చెప్పి కొంత వరకు ప్రయోజనం పొందగలరు కానీ అంతిమ లక్ష్యం నెరవేర్చుకోలేరు. అన్ని వర్గాల మద్దతు చూరగొన్న వాళ్లే రాజకీయాలలో అయినా సినిమా రంగంలో అయినా సక్సెస్ అవుతారు.
ఆయనకు చెప్పాలి...
తాజా ఎపిసోడ్ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల జాలి కలగక మానదు. అన్ని విధాలా అధోగతి పాలైన రాష్ర్టాన్ని నిలబెట్టేందుకు అవసరానికి మించి కేంద్రం వద్ద వినయ విధేయతలు ప్రదర్శిస్తూ రాష్ర్టానికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు బాలకృష్ణ వంటి వారు అనవసర వివాదాలను తలకు చుడుతున్నారు. సొంత పార్టీ నాయకులతో పాటు కూటమికి చెందిన వారి వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను చల్లార్చేందుకు ఆయన ఫైర్ ఫైటర్ పాత్ర పోషించవలసి వస్తోంది. బాలకృష్ణ వల్ల తలెత్తిన వివాదం రాజుకోకుండా ఉండేందుకు జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ ఇంటికి పరామర్శ పేరుతో చంద్రబాబు వెళ్లి గంటకు పైగా గడిపారని ప్రచారంలో ఉంది. కాగా, ఆయన చిరంజీవికి కూడా ఫోన్ చేసి సముదాయించి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మాట తూలే ముందు సంయమనం పాటిస్తే బాలకృష్ణకే గౌరవం పెరుగుతుంది. శాసనసభలో ఏక వచనంతో ఎవరినీ సంబోధించకూడదు. అది తెలుసో లేదో తెలియదుగానీ బాలకృష్ణ ‘వాడు వీడు’ అన్న పదాలను వాడారు. ఇది తప్పు అని ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా స్పీకర్ అయ్యన్నపాత్రుడైనా బాలకృష్ణకు చెప్పాలి. నటుడిగా బాలకృష్ణ వ్యవహార శైలి వల్ల లాభమైనా నష్టమైనా ఆయన మాత్రమే అనుభవిస్తారు. శాసనసభ్యుడిగా ఉన్నంత కాలం నా ఇష్టం అంటే కుదరదు. సభా సంప్రదాయాలకు, విలువలకు ఆయన కట్టుబడి ఉండాల్సిందే. అయినా గాలికి పోయే కంపను నెత్తిన వేసుకొనే వారికి ఏం చెబుతాం? ప్రజలే చూసుకుంటారు. నటులను నటులుగానే గుర్తించి గౌరవించి అభిమానిస్తే ఏ తంటా ఉండదు. వారిని కుల దైవాలుగా ఆరాధించడం వల్లనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నటులు కూడా తమను తాము దైవాంశ సంభూతులుగా భావిస్తున్నారు. ప్రజలలో వారికి ఉన్న క్రేజ్ నటులుగా మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నారు. ఎక్కడకు వెళ్లినా జనం మూగుతుండటంతో రాజకీయంగా కూడా విజయం సాధించామన్న భ్రమల్లోకి వెళుతున్నారు. అలా రాజకీయాల్లోకి వెళ్లినవారు తిరుగు టపాలా వెనుతిరగాల్సి వచ్చింది. సినీ నటులు ప్రచారం చేసినంత మాత్రాన ఎన్నికల్లో ప్రజల తీర్పుపై ఏ మాత్రం ప్రభావం ఉండదని పలు సందర్భాలలో రుజువైంది. కాబట్టి నటులు కూడా తమ పరిమితులు గుర్తించి కులాభిమానంతో హద్దు మీరే వారిని అదుపు చేస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారు. ఆంధ్రప్రదేశ్‌ను పీడిస్తున్న కుల జాడ్యాన్ని రూపు మాపడానికి ప్రముఖ సినీ నటులు నడుం బిగిస్తే అప్పుడు వారిని రియల్ హీరోలుగా గుర్తించి సెల్యూట్ చేయవచ్చు. కులం కూడు పెట్టదు అని ప్రచార ఉద్యమం చేపట్టడానికి నటులు ముందుకు రావాలని కోరుకుందాం!
ఆర్కే
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ
Updated Date - Oct 05 , 2025 | 01:03 AM