Konda Laxman Bapuji: బహుజన బంధు కొండా లక్ష్మణ్ బాపూజీ
ABN, Publish Date - Sep 27 , 2025 | 01:33 AM
తెలంగాణలో పురుడుపోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి, ఎలుగెత్తి చాటిన అతి తక్కువమంది నాయకుల్లో...
తెలంగాణలో పురుడుపోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు ఆయన ప్రత్యక్ష సాక్షి. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి, ఎలుగెత్తి చాటిన అతి తక్కువమంది నాయకుల్లో అగ్రగణ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ. మూడు తరాల ఉద్యమ వారధి బాపూజీ. దేశ స్వాతంత్ర్యం కోసం, నిజాం విముక్త తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ అవతరణ కోసం నినదించిన నిప్పుల గొంతుక ఆయన.
నాటి నిజాం సంస్థానంలోని ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో ఓ నిరుపేద చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న బాపూజీ జన్మించారు. ఆయన జీవితం, ఆలోచన, ఆశయం, ఆచరణ విశిష్టమైనవి. బాపూజీ జీవితం– తెలంగాణ ఉద్యమం పరస్పరం పెనవేసుకుని ఉన్నాయి. 75 ఏళ్ల పాటు పీడిత తాడిత, బడుగు బలహీనుల పక్షాన నిలబడి బాపూజీ ప్రజా పోరాటాలు నిర్మించారు. 1938లో బ్రిటిష్ వ్యతిరేక పౌరహక్కుల ఉద్యమం మొదలు, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 2012లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరాహారదీక్ష వరకు ఆయన సాగించిన ప్రజా ఉద్యమప్రస్థానం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
1930లో నాటి బొంబాయి రాష్ట్రంలోని చాందాలో మహాత్మాగాంధీ చేసిన ప్రసంగాన్ని బాపూజీ విన్నారు. అది ఆయనపై ఎంతగానో ప్రభావం చూపి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేలా ప్రేరేపించింది. ‘దోపిడీ రహిత సమాజం, కుల భేషజాలు లేని వ్యవస్థ, ప్రాంతీయ అసమానతలు లేని ప్రజాస్వామ్యం’ తన ఆశయాలుగా ప్రోది చేసుకున్నారు. రాజకీయ పదవులకన్నా, తాను నమ్మిన సిద్ధాంతాలకే బాపూజీ కట్టుబడి ఉన్నారు. వెట్టిచాకిరి చేసే పన్నెండు కులాల శ్రామికులను సమీకరించి రజాకార్లకు, దేశ్‌ముఖ్‌లకు, భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారాయన.
ఒకవైపు నిజాం వ్యతిరేక పోరాటాలు సాగిస్తూనే మరో వైపు క్రిమినల్ లాయర్‌గానూ పేరు ప్రఖ్యాతులు గడించారు. రైతాంగ సాయుధ పోరాటంలో నిర్బంధానికి గురైన నాయకులకు పార్టీలకు అతీతంగా ఉచిత న్యాయ సహాయం చేశారు. విస్నూర్ దేశ్‌ముఖ్‌పై హత్యాయత్నం కేసు, హుస్నాబాద్ బాంబు కేసు, కమ్యూనిస్టు యోధులు నల్ల నర్సిహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ‘నయా జిందగీ’ సంపాదకుడు ఆచార్య జె.ఎన్. శర్మపై బనాయించిన కుట్ర కేసులను వాదించి గెలిచారు. బాపూజీ కాంగ్రెస్‌వాది అయినా కమ్యూనిస్టులపై మోపిన కేసులను వాదించేందుకు హైదరాబాద్ నుంచి భువనగిరి, జనగామాలకు తరచూ వెళ్తుండేవారని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు జైని మల్లయ్యగుప్తా గుర్తు చేసుకుంటారు.
నాటి హైదరాబాద్ రాష్ట్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బాపూజీ కీలక భూమిక పోషించారు. ఎంపీగా, ఉపసభాపతిగా, మంత్రిగా, సహకారోద్యమ నేతగా, బహుజన నాయకునిగా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారునిగా రాష్ట్ర ప్రజలకు బహుముఖమైన సేవలందించారు. 1952లో ఆసిఫాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతర కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నాలుగుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. రాష్ట్రానికి సంజీవయ్య ముఖ్యమంత్రి కావడంలో కింగ్‌మేకర్ పాత్ర పోషించారు బాపూజీ. రెండు దఫాలు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. తెలుగునేలపై సైకిల్ యాత్ర, పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది ఆయనే. 1961లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మూసీ పరీవాహక ప్రాంతంలో దాదాపు 220 మైళ్ల దూరం పాదయాత్ర చేశారు.
1953లో వెనుకబడిన కులాల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నెహ్రూ ప్రభుత్వం నియమించిన ‘కాకా కాలేల్కర్’ కమిటీకి ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమస్యలను నివేదించారు. 1971లో నాటి కర్ణాటక సీఎం డి.దేవరాజ్‌తో కలిసి బెంగళూరులో అఖిల భారత బీసీ మహాసభ నిర్వహించారు. ఆ సభకు ప్రధాని ఇందిరను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, జాతీయ బీసీ కమిషన్ నిర్మాణానికి ఆమె నుంచి వాగ్దానం తీసుకున్నారు. నానాటికీ అంతరించిపోతున్న చేతివృత్తులను పరిరక్షించేందుకు సహకార సంఘాల ప్రణాళికను రూపొందించారు. 1969లో తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ తొలితరం ఉద్యమానికి ఊపిరి పోశారు. మలితరం ఉద్యమంలో అన్ని పార్టీలనూ ఏకతాటి పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. 96 ఏళ్ల వయసులోనూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పోరాడారు. తెలంగాణ గడ్డమీద పుట్టి, దేశ చరిత్ర పుటలకెక్కిన మహానుభావులలో ఒకడిగా బాపూజీ చిరస్మరణీయుడు.
ప్రొ. వంగర భూమయ్య
పాలమూరు యూనివర్సిటీ
(నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి)
ఇవి కూడా చదవండి..
అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..
భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 27 , 2025 | 01:33 AM