Share News

MEA: అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..

ABN , Publish Date - Sep 26 , 2025 | 07:45 PM

ఎంతో పేరున్న నాటో నాయకత్వం బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని తాము భావిస్తున్నామని, ప్రధానమంత్రి సంభాషణలు, సూచనలు వంటి విషయాల్లో ఊహాగానాలు, తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు.

MEA: అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..
Mark Rutte, Putin and Modi

న్యూఢిల్లీ: సుంకాల ఒత్తిడి ఎక్కువ కావడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ప్రధాని మోదీ (PM Modi)కి ఫోన్ చేశారని, ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహం ఏమిటో వివరించాలని పుతిన్‌ను మోదీ కోరారని నాటో (NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుటె (Mark Rutte) చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఇవి పూర్తిగా నిర్లక్ష్యంతో చేసిన నిరాధార వ్యాఖ్యలని పేర్కొంది.


'మోదీ, పుతిన్ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటె చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదు, పూర్తిగా నిరాధారం. మార్క్ రుటె చెప్పిన విధంగా పుతిన్‌తో మోదీ సంభాషించలేదు. అసలు అలాంటి సంభాషణలే చోటు చేసుకోలేదు' అని ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) తెలిపారు.


నాటో కూటమి బాధ్యతాయుతంగా ఉండాలి

పబ్లిక్‌లో వ్యాఖ్యలు చేసేటప్పుడు నాటో కూటమి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రణ్‌ధీర్ జైశ్వాల్ సూచించారు. 'ఎంతో పేరున్న నాటో నాయకత్వం బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని మేము భావిస్తున్నాం. ప్రధానమంత్రి సంభాషణలు, సూచనలు వంటి విషయాల్లో ఊహాగానాలు, తప్పుడు కథనాలు ప్రచారం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గతంలో చెప్పినట్టుగానే వినియోగదారుల ప్రయోజనాలకు కట్టుబడే భారత్ ఇంధన దిగుమతులు ఉంటాయి. దేశ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను భారత్ కొనసాగిస్తూనే ఉంటుంది' అని జైశ్వాల్ వివరించారు.


మార్క్ రుటే ఏమన్నారు?

నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే న్యూయార్క్‌లో మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ సుంకాలు రష్యాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, దీంతో పుతిన్ మోదీకి ఫోన్ చేశారని చెప్పారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో ఏవిధంగా ముందుకు వెళ్లనున్నారని పుతిన్‌ను మోదీ ఆరాతీశారని తెలిపారు. కాగా, రష్యా నుంచి చమురు దిగుమతిపై భారత్, చైనాలపై బహిరంగ అక్కసు వెళ్లగక్కుతున్న ట్రంప్.. ఇటీవల నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపైనా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నాటో చీఫ్ భారత్-రష్యా అగ్రనేతల మధ్య ఫోన్ సంభాషణల గురించి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికర పరిణామం.


ఇవి కూడా చదవండి..

భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్

చైనా కన్నెర్ర చేస్తే అమెరికాలో టాయిలెట్ పేపర్ కూడా ఉండదు: ఫైనాన్షియల్ ప్లానర్ కామెంట్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 08:11 PM