Administrator and Visionary Reformer: ఈ పాలనాదక్షుడు అందరివాడు
ABN, Publish Date - Sep 30 , 2025 | 02:38 AM
దృశ్య శ్రవణ ప్రసారమాధ్యమాలను ఔపోసనం పట్టిన అగస్త్యుడు ‘కె.ఎస్. శర్మ’గా లబ్ధప్రతిష్ఠులైన కంభంపాటి శ్రీనివాసశర్మ సెప్టెంబర్ 20న దిగంతాలకు తరలివెళ్లారు. ఎంతటి మహామనీషి! ఎంతటి సౌజన్యమూర్తి...
దృశ్య శ్రవణ ప్రసారమాధ్యమాలను ఔపోసనం పట్టిన అగస్త్యుడు ‘కె.ఎస్. శర్మ’గా లబ్ధప్రతిష్ఠులైన కంభంపాటి శ్రీనివాసశర్మ సెప్టెంబర్ 20న దిగంతాలకు తరలివెళ్లారు. ఎంతటి మహామనీషి! ఎంతటి సౌజన్యమూర్తి! ఎలా మాయమయ్యారు!? అవునులెండి, మహాకవి జాషువా చెప్పలేదూ... కాలుడికి దయాదాక్షిణ్యమా! శర్మగారినీ తీసుకుపోయాడు.
గడచిన రెండు దశాబ్దాలకు పైగా కె.ఎస్. శర్మ ఆత్మీయతను, సౌజన్యాన్ని అప్పనంగా అనుభవిస్తూ వచ్చాను. ఆయన మూర్తిమత్వం బహు విశిష్టమైనది. విధి నిర్వహణలో భాగంగా అనేక అధికార హోదాలలో వారు ప్రదర్శించిన వ్యక్తిత్వం, అర్థవంతమైన జీవితం కోసం ఆయన పాటించిన విలువలు, సామాజిక వికాసం కోసం ఆయన చేసిన అవిశ్రాంత కృషి పదేపదే స్మరణీయాలు. మరీ ముఖ్యంగా విద్యారంగానికి వారు చేసిన సేవలు, ప్రసారమాధ్యమాలు సమాజశ్రేయానికి ధర్మకర్తృత్వం వహించాలని విశ్వసిస్తూ సుదీర్ఘకాలం రేడియో టీవీలను వారు నడిపిన తీరు, తీర్చిదిద్దిన వైనం– ఇవి చాలవా శర్మకి చేతులెత్తి నమస్కరించటానికీ కళ్లనూ గుండెనూ తడిచేసుకోటానికీ!
1965లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడుగా మొదలైన వారి ప్రస్థానం 1967లో ఐఎఎస్‌కు ఎంపిక కావటంతో ఒక మేలిమలుపు తిరిగింది. అప్పటి నుంచి సుమారు నలభై ఐదేళ్ల పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలలో అనేక పదవులు నిర్వహించారు. విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ మొదలు ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసారభారతి సంస్థలకు ఆధిపత్యం వహించేవరకూ వారి ఉద్యోగ విజయాలు జాగీయమానంగా సాగాయి. ఆకాశవాణి, దూరదర్శన్‌లకు డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించిన మొట్టమొదటి ఐఎఎస్ అధికారి కె.ఎస్. శర్మ. అంతేకాదు, పదేళ్లకు పైగా కేంద్ర మానవవనరుల శాఖలోనూ, సమాచార ప్రసార మంత్రిత్వశాఖలోనూ ప్రతిభావంతంగా పనిచేసిన సివిల్ సర్వీస్ అధికారి కూడా ఆయనే.
ఇవన్నీ ఎలా తెలుసంటారా?... వారు తమ జీవన ప్రస్థానాన్నీ అనుభవాలనూ అక్షరబద్ధం చేయాలని సంకల్పించినప్పుడు కొన్ని జ్ఞాపకాలనూ ఎదురైన సవాళ్లనూ నాతో పంచుకున్నారు. వారు ఇంగ్లీష్‌లో ఎపిసోడ్‌ల వారీగా రాసుకున్న స్క్రిప్ట్‌ని నేను తెలుగులో రాయాలి. అదీ వారు నాకు అప్పగించిన పని. మూడు ఎపిసోడ్‌లు రాసి వినిపించాను. ఇంతలోనే సగంలో ముగింపు!
నక్సలైట్ల కార్యకలాపాలతో అట్టుడికిపోతున్న కరీంనగర్ జిల్లాను కల్లోలిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించిన సమయంలో శర్మ అక్కడ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. మరుక్షణం నుంచి నిరుపేదలకు భూముల పంపిణీ, పట్టణంలోని ప్రభుత్వ స్థలాల దురాక్రమణలను తొలగించటం, కలెక్టరేట్‌తో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ ఒకే గొడుగు కిందకు వచ్చేలా నూతన భవన సముదాయాన్ని నిర్మింపచేయటం వంటి అనేక ప్రజాభ్యుదయ కార్యక్రమాలు జయప్రదంగా చేశారు. పాఠశాలలన్నిటికీ భవనాలు నిర్మించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కరీంనగర్ ఎడ్యుకేషన్ సొసైటీని నెలకొల్పి నిధులు సమీకరించారు. సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు కరీంనగర్ లలితకళా పరిషత్తును నెలకొల్పారు. భారతరత్న డా. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి సంగీతసభను నిర్వహించి రసజ్ఞుల మెప్పుపొందారు. కె.ఎస్.శర్మ అంటే ‘కరీంనగర్ శ్రేయోభిలాషి శర్మ’గా డా. సి. నారాయణరెడ్డి అభివర్ణించారు. అప్పటి ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి, శర్మ పనితీరుకు ముచ్చటపడి సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా నియమిస్తే, సిపిఐకు చెందిన సి.హెచ్. రాజేశ్వరరావు మరికొంతకాలం కరీంనగర్ కలెక్టర్‌గా ఆయననే కొనసాగించమని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. చిత్రమేమిటంటే నక్సలైట్లు కూడా శర్మే కలెక్టర్‌గా ఉండాలని పట్టుపట్టారు. దాంతో ఆయన బదిలీ నిలిచిపోయింది. ఆర్తులు, అన్నార్తులు, దాహార్తులు, నిర్భాగ్యులు, నిరాశ్రయులను అక్కున చేర్చుకున్న ఆపన్నుడిగా ఇప్పటికీ ఆ జిల్లాలో కె.ఎస్.శర్మ పేరు చెప్పుకుంటారు.
చాలాకాలంగా శర్మ పనితీరునూ నిబద్ధతనూ గమనిస్తూ వచ్చిన పీవీ నరసింహారావు తాను కేంద్రంలో మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను చేపట్టాక, దేశవ్యాప్తంగా గ్రామప్రాంతాలలోని పిల్లల కోసం ప్రారంభించదలచిన నవోదయ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆయనకి అప్పగించారు. ఆ పదవిలో ఉన్న ఐదేళ్లూ ఆ పాఠశాలలకు జీవం, సారం అన్నీ శర్మే అయ్యారు. ఆ పాఠశాలల్లో 33 శాతం సీట్లను ఆడపిల్లలకు కేటాయించారు. ఆ నిర్ణయానికి పీవీ సంతోషించారు. పీవీ ప్రధానమంత్రి కాగానే శర్మని దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్‌లో ఆయన అనేక విప్లవాత్మక మార్పులు చేశారు. అందులో ప్రముఖంగా పేర్కొనదగినది డీటీహెచ్– డైరెక్ట్ టు హోమ్ సర్వీస్. ఈ సేవలు కేవలం మనదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా డీటీహెచ్ అందుబాటులోకి వచ్చింది.
అలాగే ఆకాశవాణి, దూరదర్శన్ ఆర్కైవ్‌లను పటిష్ఠం చేసి, ప్రముఖ కళాకారుల రికార్డింగ్‌లను సీడీలుగా, క్యాసెట్లుగా మార్పించి మార్కెటింగ్ డివిజన్ల ద్వారా విక్రయించే ఏర్పాటు చేశారు. అది సంస్థకు ఆదాయవనరుగా మారింది. అటు కళాకారులకూ లబ్ధి కల్పించారు. ఎవరెవరి రికార్డింగ్‌లను విక్రయిస్తున్నామో వారందరికీ వారి గ్రేడింగ్ ప్రకారం ఏకమొత్తంగా పారితోషికం చెల్లించమని ఆదేశించారు.
నా అదృష్టం – దక్షిణ ప్రాంత ఆర్కైవ్స్‌కు ప్రత్యేక అధికారిగా నన్ను నియమించి ఆయన పర్యవేక్షణలో పనిచేసే అవకాశం కల్పించారు. శర్మ సాధించిన మరొక ఘనవిజయం ఏమిటంటే– స్పోర్ట్స్ రైట్స్ ఉన్న వారందరూ వారు నిర్వహించే కార్యక్రమాల సిగ్నల్స్‌ను విధిగా దూరదర్శన్‌కు ఇచ్చి తీరాలి. ఇందుకోసం పెద్ద పోరాటమే చేశారు. సుప్రీం కోర్ట్ వరకూ వెళ్లి విజయం సాధించారు. దీనితో దేశంలోని కేబుల్ పరిశ్రమ బలపడింది. క్రీడామంత్రిత్వ శాఖ ప్రతిష్ఠ ఇనుమడించింది. అదనపు కార్యదర్శి బాధ్యతలలో ఉన్నప్పుడే ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎమెరిటస్‌గా నియమితులయ్యారు. ఇలా ఎన్నని చెప్పను! ‘‘ఎవరు జీవించి ఉన్నట్లు?’’ అని యక్షుడి ప్రశ్న! ‘‘చనిపోయిన తరువాత కూడా ఎవరి పేరు ఎన్నాళ్లు ఈ లోకంలో వినబడుతుందో అన్నాళ్లూ వారు జీవించి ఉన్నట్లు!’’ అని ధర్మరాజు సమాధానం!!
ప్రయాగ రామకృష్ణ
ఇవి కూడా చదవండి..
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించిన భారత్
Updated Date - Sep 30 , 2025 | 02:38 AM